close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 3,187 కేసులు

ఏడు మరణాలు

20 వేలు దాటిన క్రియాశీల కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 3,187 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లలో తొలి దశ ఉద్ధృతిలోనూ ఇంత భారీ సంఖ్యలో కేసులు నిర్ధారణ కాలేదు. గత సంవత్సరం ఆగస్టు 25న 61,040 నమూనాలను పరీక్షించగా.. 3,018 కేసులు (4.94 శాతం) నమోదయ్యాయి. తాజాగా 1,15,311 నమూనాలను పరీక్షించగా, 2.76 శాతం పాజిటివ్‌ రేటు నమోదైంది. గత 10 రోజులతో పోల్చితే పాజిటివ్‌ రేటు రెండింతలకు పైగా పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,27,278కి పెరిగింది. ఈ నెల 10న(శనివారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. గత మూడు రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్నవారు పెరుగుతున్నారు. ఈ నెల 8న 15,472 క్రియాశీల కేసులు ఉండగా.. 9న 17,791కు, 10న 20,184కు పెరిగాయి. కొత్తగా మరో 7 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 1,759 మంది కరోనాతో కన్నుమూశారు.
వరుసగా మూడో రోజూ లక్ష పరీక్షలు
రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య వరుసగా మూడో రోజు లక్ష దాటింది. ఈ నెల 8న 1,01,986, 9న 1,11,726 పరీక్షలు నిర్వహించగా.. 10న 1,15,311 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,09,88,976కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో 1,03,267 నమూనాలను పరీక్షించగా, ప్రైవేటులో 12,044 మాత్రమే చేశారు. తాజాగా 787 మంది కోలుకోగా, మొత్తంగా 3,05,335 మంది ఆరోగ్యవంతులయ్యారు. గత 6 వారాలుగా కొవిడ్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య తగ్గుతోంది. నెలన్నర కిందట కోలుకునేవారి శాతం 98కి పైగా నమోదు కాగా.. ప్రస్తుతం 93.29 శాతానికి తగ్గింది. ఈ విషయంలో జాతీయ సగటు 90.4 శాతం ఉంది.
జిల్లాల్లో ఉద్ధృతి
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ విరుచుకుపడుతోంది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 551 పాజిటివ్‌లు నమోదయ్యాయి. శనివారం 50కి పైగా కొత్త కేసులు నమోదైన జిల్లాల్లో.. మేడ్చల్‌ మల్కాజిగిరి(333), రంగారెడ్డి(271), నిజామాబాద్‌(251), నిర్మల్‌(154), జగిత్యాల(134), కామారెడ్డి(113), కరీంనగర్‌(104), సంగారెడ్డి(104), వరంగల్‌ నగర(98), ఆదిలాబాద్‌(92), నల్గొండ(83), సిద్దిపేట(81), ఖమ్మం(79), మహబూబ్‌నగర్‌(73), వికారాబాద్‌(68), యాదాద్రి భువనగిరి(60), మంచిర్యాల(59), వనపర్తి(59), రాజన్న సిరిసిల్ల(57), సూర్యాపేట(55), మెదక్‌(53) ఉన్నాయి.

క్వారంటైన్‌లోకి పవన్‌కల్యాణ్‌


ఈనాడు, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత, భద్రతా సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకుల్లో ఎక్కువ మంది వారం వ్యవధిలో ఒక్కొక్కరుగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరంతా ఆయనకు సమీపంలో విధులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.  అక్కడి నుంచే రోజువారీ విధులు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని, టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని తెలిపింది.

ఏపీలో 3,495 కేసులు.. 9 మంది మృతి
ఏపీలో శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 31,719 నమూనాలను పరీక్షించారు. వారిలో 3,495 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 9,25,401కు, మరణాలు 7,300కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,954 క్రియాశీల కేసులున్నాయి.

మాస్కులు, ఎడమే అందరికీ రక్ష: మంత్రి ఈటల 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెండో దశలో ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మాస్కులు ధరించడం, ఎడం పాటించడమే అందరికీ రక్ష అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. టీకాలపై అపోహలు వద్దన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఈటల మాట్లాడారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.28 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.56గా ఉందన్నారు. సాంక్రమిక వ్యాధుల వైద్య నిపుణుడు డా.విజయ్‌ యల్దండి మాట్లాడుతూ.. అన్ని టీకాలనూ ప్రయోగశాలల్లో పూర్తిగా పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి తెస్తారని, ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా వేయించుకోవాలని సూచించారు. జ్వరం లాంటి లక్షణాలు సాధారణమేనని.. నిపుణుల సూచనలనే నమ్మాలని, వదంతులను విశ్వసించవద్దని స్పష్టం చేశారు. చైతన్య వేదిక ఇన్‌ఛార్జి డీటీ నరసింహారావు, సభ్యులు పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు