close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విత్తన రాయితీ మాటేమిటి?

వానాకాలం పంటలకు రైతులే కొనుక్కోవాలి

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం పంటల సాగుకు మరో నెల రోజుల్లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని చెప్పిన వ్యవసాయశాఖ వాటిపై రాయితీ ఇస్తుందా లేదా.. అనే విషయాన్ని చెప్పలేదు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) రైతులకు జిల్లాల్లో విత్తనాలను విక్రయిస్తుంది. 2019 వరకూ ఆహారధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాల పంటల విత్తన ధరల్లో 33 శాతం వరకూ రాయితీగా వ్యవసాయశాఖ భరించేది. గతేడాది(2020) జనుము, పిల్లిపెసర, సోయాచిక్కుడు పంటల విత్తనాల ధరల్లో రాయితీని భరించింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో విత్తన రాయితీ పద్దు కింద రూ.71 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. వీటితో 1.93 లక్షల క్వింటాళ్ల సోయా, జనుము, పిల్లిపెసర విత్తనాలకు మాత్రమే రాయితీ ఇవ్వగలమని అధికారులు లెక్కగట్టారు. దీంతో విత్తన కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి.
భారీగా ధరల పెంపు
గతేడాది 1.20 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను ప్రైవేటు కంపెనీలు రాయితీపై అమ్మకానికి సరఫరా చేయగా.. ఈ సీజన్‌లో 44 వేల క్వింటాళ్లకు మించి ఇవ్వలేమని చెప్పాయి. అప్పట్లో క్వింటాకు రూ.6,645 ధర కాగా ఈ ఏడాది రూ.9,700 వరకూ పెంచుతున్నాయి. ఈ వానాకాలంలో పత్తి, కంది, నూనెగింజల పంటలు ఎక్కువగా సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంది గతేడాది 10 లక్షల ఎకరాల్లో వేయగా ఈ సీజన్‌లో 20 లక్షల ఎకరాల్లో వేయాలని రైతులకు సూచించింది. ఇందుకు 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. కంది విత్తులు టీఎస్‌ సీడ్స్‌ వద్ద కేవలం 4 వేల క్వింటాళ్లే ఉన్నాయి. జాతీయ విత్తన సంస్థను రాష్ట్ర వ్యవసాయశాఖ అడగ్గా మరో 5,500 క్వింటాళ్లు ఇస్తామంది. ప్రైవేటు కంపెనీలు 14 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పాయి. మిగతా విత్తనాలను రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనాలి. క్వింటా కంది విత్తనాల ధరను రూ.9600కి కంపెనీలు పెంచేశాయి. నూనెగింజల పంటల్లో సోయాకు మాత్రమే గతేడాది ఇవ్వగా ఈ ఏడాది అదీలేదు. వ్యవసాయశాఖ వర్గాలను వివరణ కోరగా.. విత్తన రాయితీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి గత నెలలోనే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు