close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జన చేతనకు స్వచ్ఛ బడి

సిద్దిపేటలో ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: వ్యర్థాల నుంచి సంపద సృష్టితో పాటు ఆరోగ్య రక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు స్వచ్ఛ బడి దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో రూ.50 లక్షల వ్యయంతో నెలకొల్పిన స్వచ్ఛ బడిని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ‘‘ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో చెత్త ఒకటి. అమెరికా, జపాన్‌, యురోపియన్‌ దేశాలు కూడా ఈ సమస్యతో సతమతం అవుతున్నాయి. జీవరాశులకు నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా జన చేతన కలిగించేందుకు స్వచ్ఛ బడిని ఏర్పాటుచేశాం. పిల్లలు, మహిళలు, వయోవృద్ధులు అన్ని వర్గాల వారు ఇక్కడికి వచ్చి పాఠాలు విని, ఆచరించాలి. తడి, పొడి, హానికర చెత్తను సమర్థంగా నిర్వహిస్తే పర్యావరణం, ప్రజారోగ్యం బాగుంటాయి’’ అని మంత్రి వివరించారు. సిద్దిపేటలో ఇళ్లలోనే సేంద్రియ ఎరువు తయారు చేసి కూరగాయలు, ఆకుకూరలు పండించాలని సూచించారు. ఇందుకు వీలుగా రూపొందించిన తొట్లను పలువురు మహిళలకు అందజేశారు. ఉచితంగా విత్తనాలూ అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, పర్యావరణవేత్త డాక్టరు శాంతి, బల్దియా ఛైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ రమణాచారి, కౌన్సిలర్‌ దీప్తి పాల్గొన్నారు.

బోధన.. ప్రత్యక్ష అవగాహన..

సిద్దిపేట స్వచ్ఛ బడి తెలుగు రాష్ట్రాల్లో మొదటిది కాగా, దక్షిణాదిలో రెండోది. బెంగళూరులో మొదటిది ఏర్పాటవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పర్యావరణవేత్త డాక్టరు శాంతి నేతృత్వంలో సిద్దిపేటలోనూ ఇది పురుడుపోసుకొంది. బోధన.. ప్రత్యక్ష అవగాహన లక్ష్యంగా కార్యకలాపాలుంటాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువు తయారీ, మిద్దె తోటల పెంపకం, జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇళ్లు, అపార్టుమెంట్లు, కాలనీ, వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై డిజిటల్‌ రూపంలో బోధిస్తారు. ప్రత్యక్ష నమూనాల ద్వారా వివరిస్తారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడవనుంది. కనిష్ఠంగా గంట, గరిష్ఠంగా మూడు గంటల పాటు శిక్షణ ఇస్తారు. బల్దియా పర్యావరణ ఇంజినీర్‌ దీనికి ఇన్‌ఛార్జి. బోధించేందుకు ఆరుగురు వాలంటీర్లు ఉంటారు. విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు..ఇలా విభిన్న వర్గాల వారికి శిక్షణ ఇచ్చి చెత్త నుంచి సంపద, ఆరోగ్యాన్ని సృష్టించవచ్చు అనే సందేశాన్ని ఇవ్వనున్నారు. శిక్షణ పొందాలనుకునే వారు ముందుగా ఈ కేంద్రం బాధ్యుడికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సిద్దిపేట కమిషనర్‌ కె.వి.రమణాచారి తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు