close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విదేశీ టీకాలకు పచ్చజెండా

అమెరికా, ఐరోపా, జపాన్‌ అనుమతించిన వ్యాక్సిన్లకు ‘అత్యవసర’ సమ్మతి
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల రాకకు మార్గం సుగమం

ఈనాడు, దిల్లీ: ఒకవైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో విదేశాల్లో అత్యవసర అనుమతులు పొందిన పలు టీకాలకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థల టీకాలు దేశంలో త్వరగా అందుబాటులోకి వచ్చే వీలుంది.

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలోని జాతీయ నిపుణుల బృందం (నెగ్‌వ్యాక్‌)తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దేశంలో టీకాల లభ్యతను పెంచడంతోపాటు, ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌ పరిధిని, వేగాన్ని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విదేశాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన లేదా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండి.. అమెరికా, బ్రిటన్‌, ఐరోపా, జపాన్‌లకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లకు ఈ మార్గంలో పచ్చజెండా ఊపాలని నిర్ణయించినట్లు వివరించింది. 

అయితే ఈ విదేశీ వ్యాక్సిన్ల సురక్షతను అంచనావేయడానికి, వాటిని తీసుకున్న తొలి 100 మంది లబ్ధిదారులను వారం రోజులపాటు పరిశీలిస్తారు. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా వాటి వినియోగానికి సమ్మతిస్తారు. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం.. భారత్‌లో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాకే విదేశీ టీకాల వినియోగానికి ఆమోద ముద్ర లభించేది. ఈ నిబంధనను తాజాగా సడలించారు. ఈ మేరకు ఓవైపు టీకాల వినియోగం జరుగుతుండగానే సమాంతరంగా ఆయా కంపెనీలు..  వాటిపై అనుబంధ క్లినికల్‌ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల విదేశీ వ్యాక్సిన్లు త్వరగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. సదరు టీకాలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకొని, భారత్‌లోనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా భారీ పరిమాణంలో విదేశాల నుంచి టీకాను దిగుమతి చేసుకొని, దాన్ని చిన్నచిన్న వయెల్స్‌గా తయారుచేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. స్థానికంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు