close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మినీ పురపోరుకు మోగిన గంట

నేటి నుంచి నామినేషన్లు
  30న పోలింగ్‌... మే 3న ఓట్ల లెక్కింపు
  వరంగల్‌, ఖమ్మం సహా ఏడింటికి ఎన్నికలు
  బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మినీ పురపోరుకు నగారా మోగింది. వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారథి గురువారం విడుదల చేశారు.  శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహించనుండగా మే 3న ఓట్లు లెక్కిస్తారు. ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లను గురువారం ఖరారు చేసిన పురపాలకశాఖ వివరాలు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గతంలో రిజర్వేషన్లు ఖరారు చేయని నకిరేకల్‌, కొత్తూరు, జడ్చర్ల పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను సీడీఎంఏ కార్యాలయంలో పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బ్యాలెట్‌ విధానంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెల్ల బ్యాలెట్‌ పత్రాలను వినియోగించనున్నారు. ఎన్నికలు జరిగే అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఒక వార్డుకు ఎన్నిక జరుగుతున్నా మున్సిపాలిటీ అంతా కోడ్‌ అమల్లో ఉంటుంది.

మహిళా ఓటర్లే ఎక్కువ
మినీ పురపోరులో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లో మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే 18,259 మంది ఎక్కువగా ఉన్నారు.

స్క్రూటినీకి నలుగురికే అవకాశం
నామినేషన్ల పరిశీలనకు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్‌, ప్రతిపాదించిన వ్యక్తి, మరో వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది. జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌ నామినేషన్ల అప్పీలుకు అవకాశం లేదు.

ప్రచారంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
* ఇంటింటి ప్రచారంలో భద్రతా సిబ్బంది కాకుండా అభ్యర్థితో కలిపి అయిదుగురు మాత్రమే పాల్గొనాలి.
* కాన్వాయ్‌లో భద్రతా సిబ్బంది వాహనం కాకుండా వరుసగా రెండు వాహనాలు మాత్రం ఉండాలి. ప్రతి రెండు వాహనాల అనంతరం పదిమీటర్ల దూరం ఉండాలి.
* వేర్వేరు పార్టీల రోడ్‌షోలకు మధ్య  అరగంట అంతరం ఉండాలి.
* బహిరంగ సభలు, ర్యాలీలకు కొవిడ్‌-19 నిబంధనలు వర్తిస్తాయి.

ఎన్నికల వ్యయపరిమితి ఇది
జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్‌ అభ్యర్థి వ్యయపరిమితి రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో అభ్యర్థి వ్యయపరిమితి రూ.1.5 లక్షలు కాగా మున్సిపాలిటీల్లో వార్డు సభ్యుడి వ్యయ పరిమితి లక్ష రూపాయలు. పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించాలి. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు