close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీజేఐగా మహిళను నియమించే సమయం ఆసన్నమైంది

ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా జడ్జిల నియామకానికి ప్రాధాన్యం
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళను నియమించే సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జిల నియామకం చేపట్టేటప్పుడు మహిళలను దృష్టిలో ఉంచుకుని, వారికి కొలీజియం ప్రాధాన్యమిస్తోందని పేర్కొంది. ఈ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో మహిళలకు పెద్దపీట వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తులు కేవలం 11.04% మాత్రమే ఉన్నారని; జడ్జిల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమివ్వాలంటూ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం (ఎస్‌సీడబ్ల్యూఎల్‌ఏ) ఈ పిటిషన్‌ వేసింది.

కుటుంబ బాధ్యతలు ఉన్నాయంటున్నారు
విచారణ సందర్భంగా జస్టిస్‌ బోబ్డే మాట్లాడుతూ- ‘‘భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళా జడ్జి బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం. ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం లభించేలా ప్రయత్నిస్తాం. ప్రతి కొలీజియం తగిన సంఖ్యలో మహిళలను న్యాయమూర్తులుగా నియమించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నాకో విషయం చెప్పారు. మహిళా న్యాయవాదులను జడ్జిలుగా నియమిస్తామని అడిగితే... తమకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయని, పిల్లల చదువులు చూసుకోవాల్సి ఉందంటూ వారు సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు నా దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తుల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమిచ్చే విషయం ఎప్పుడూ మా దృష్టిలో ఉంటుంది. భవిష్యత్తులో మహిళలు తగిన సంఖ్యలో ఉన్నతస్థాయి న్యాయమూర్తులుగా నియమితులవుతారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లు కూడా ఉన్నారు. 1950 నుంచి ఇప్పటివరకూ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక్క మహిళకూ చోటు దక్కలేదు.

కొలీజియం సిఫార్సుల ఆమోదానికి గడువు పెట్టండి

కొలీజియం సూచించిన పేర్లను ఆమోదించడంలో ఆలస్యం జరగకుండా నిర్ణీత సమయాన్ని పెట్టుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయమూర్తుల నియామకం విషయమై కొలీజియం సిఫార్సు చేసిన పది పేర్లు గత ఏడాదిన్నరగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. పెండింగ్‌లో ఉన్న పేర్లను ఎప్పుడు ఆమోదిస్తారని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. మూడు నెలల్లో నిర్ణయం వెలువడుతుందని ఆయన సమాధానం ఇచ్చారు. కార్యసరళి విధి విధానాల ప్రకారం ప్రతి స్థాయిలో ఎన్ని రోజుల్లో ఆమోదం తెలపాలన్నదానిపై నిర్ణీత గడువు ఉందని, కానీ ప్రధాని దగ్గరకు వచ్చే సరికి ఎలాంటి గడువు ఇవ్వలేదని చెప్పారు. ప్రధాని ఆమోదం తెలిపిన తరువాతే దస్త్రాలను రాష్ట్రపతికి పంపిస్తారని వివరించారు. హైకోర్టుల్లో 416 ఖాళీలున్నాయని, ఇందులో 220 పదవులకు సంబంధించి హైకోర్టు కొలీజియంల నుంచి సిఫార్సులు రాలేదని చెప్పారు. న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులను నియమించే కోటా కింద గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మేఘాలయ, ఒరిస్సా, సిక్కిం హైకోర్టుల్లో ఖాళీలున్నాయన్నారు. హైకోర్టు వ్యవహారాలను తాము చూసుకుంటామని, ప్రభుత్వపరంగా ఆమోదం తెలిపేందుకు నిర్ణీత సమయం ఉండేలా చూడాలని ధర్మాసనం పేర్కొంది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు