close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాస్క్‌ మరవొద్దు.. జరిమానా వెయ్యించుకోవద్దు!

తనిఖీలు విస్తృతం చేసిన పోలీస్‌ శాఖ
నాలుగు రోజుల్లో 41 వేల మందికి ఈ-చలానాలు
ఉల్లంఘనుల చరవాణికి లింక్‌ రూపంలో వివరాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న వేళ మాస్క్‌ ధరించకుండా సంచరించే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్‌ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలంటూ కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉల్లంఘనులను గుర్తించడంపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. వీరికి ఎలా జరిమానాలు విధించాలనే అంశంపై మొదట్లో తర్జనభర్జనలు పడిన ఆ శాఖ చివరికి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇచ్చినట్టే ఈ-చలానా జారీచేయాలని నిర్ణయించింది.

రోజుకు పదివేలకు పైగా
ఈ నెల 5 నుంచి 11వతేదీ వరకు వారం రోజుల్లో 6 వేలకుపైగా ఉల్లంఘనులకు జరిమానా విధించింది. తర్వాత రోజు నుంచి తనిఖీలను విస్తృతం చేసింది. కూడళ్లు, ప్రధాన రహదారులు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న సిబ్బంది మాస్క్‌ ధరించని వారి ఫొటోలు తీస్తున్నారు. వారి ఆధార్‌ లేదా ఫోన్‌ నంబరు ఆధారంగా వివరాలు సేకరించి ఈ-చలానా రూపొందిస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం 51బి సెక్షన్‌ కింద జరిమానాలు విధిస్తున్నట్టు చలానాల్లో పేర్కొంటున్నారు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్‌ నంబరుకు ఉల్లంఘన వివరాలతో కూడిన లింక్‌ను పంపిస్తున్నారు. ఆ లింక్‌ను తెరిచి అందులోని వివరాల ఆధారంగా నెట్‌బ్యాంకింగ్‌ లేదా, మీసేవ కేంద్రంలో జరిమానా చెల్లించాలని సూచిస్తున్నారు. ఇలా ఈ నెల 12వతేదీ నుంచి 15వ తేదీ గురువారం సాయంత్రం వరకు సుమారు 41,249 మందికి పోలీస్‌ శాఖ తాఖీదులు జారీచేసింది. వీటిలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అత్యధికంగా 15,230 ఉన్నాయి. రామగుండంలో 4,672, రాచకొండలో 3,067, కరీంనగర్‌లో 1,823, మహబూబ్‌నగర్‌లో 1,477, నిజామాబాద్‌లో 1,250, కొత్తగూడెంలో 1,219 మందికి, భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 104 మందికి ఈ-చలానాలు పంపింది. ‘గతంలో మాస్క్‌ ధరించని వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచేవాళ్లం. దీంతో పోలీసులపై పనిభారం, న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ దఫా ఇలా ఏర్పాట్లు చేశాం. జరిమానా సొమ్ము చాలా రోజుల వరకూ చెల్లించని వారిని మాత్రం అరెస్ట్‌ చేసే యోచనలో ఉన్నాం’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు