close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రాణదాత కన్నుమూత

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఇకలేరు
నిమ్స్‌ డైరెక్టర్‌గా విశేష సేవలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖుల సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌- యూసుఫ్‌గూడ, షేక్‌పేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు.. వైద్యరంగంలో చిరస్మరణీయమైన పేరు అది. వైద్య సేవల్లో చెరగని ముద్ర ఆయనది. నిమ్స్‌ ఆసుపత్రిని దేశంలోనే అగ్రగణ్యంగా తీర్చి దిద్దిన ఘనత ఆయన సొంతం. అయిదు దశాబ్దాలకు పైగా తన సేవలతో ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్న ప్రముఖ వైద్యులు, ‘నిమ్స్‌’ ఆసుపత్రి పూర్వ సంచాలకులు పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు (96) శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 7.20 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు శుశ్రుత్‌, కుమార్తెలు శోభారాణి, సబిత ఉన్నారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో 1925 జనవరి 25న ఆయన జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాకర్ల విద్యాభ్యాసం చల్లపల్లిలో సాగింది. అనంతరం ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యపట్టా అందుకున్నారు. ఉపకార వేతనంపై అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. సమయపాలన, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన చివరి వరకూ బోధన వృత్తిలోనే కొనసాగారు. ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్ది తెలుగు నేలకు అందించిన మహోన్నత వ్యక్తిగా, లక్షలాది రోగులకు వైద్యం అందించిన ప్రాణదాతగా కాకర్ల సుబ్బారావు పేరు పొందారు. ఉస్మానియా వైద్య కళాశాల, నిమ్స్‌, కిమ్స్‌ వైద్య కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేశారు. నెలరోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. సాయంత్రం ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

అంచెలంచెలుగా.. వైద్యనారాయణుడిగా..
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి వైద్య వృత్తిని చేపట్టారు. హౌస్‌ సర్జన్‌ చేశాక 1951లో ఆమెరికా వెళ్లి రేడియాలజీ పూర్తిచేశారు. అక్కడే ప్రముఖ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ పూర్తిచేశారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజీలో ఫెలోషిప్‌ చేశారు. 1956లో అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చి బోధన మీద మక్కువతో ఉస్మానియా వైద్యశాలలో గౌరవ బోధకుడిగా నెలకు రూపాయి వేతనంతో చేరారు. 14 ఏళ్లపాటు అక్కడే పనిచేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి రేడియాలజీ విభాగ అధిపతిగా పదోన్నతి సాధించారు. 1970లో తిరిగి అమెరికా వెళ్లారు. పలు ఆసుపత్రుల్లో ఉన్నత హోదాల్లో పనిచేశారు. చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే తెలుగువారందరినీ ఏకతాటిపైకి చేర్చాలనే సంకల్పంతో ‘తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా’ (తానా) స్థాపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం
కాకర్ల సుబ్బారావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను స్మరించుకున్నారు. నిమ్స్‌ అభివృద్ధికి ఆయన గొప్ప కృషి చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, కిమ్స్‌ ఎండీ బొల్లినేని భాస్కరరావు, పలువురు వైద్య నిపుణులు కాకర్ల భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి డాక్టర్‌ కాకర్ల నేత్రాలను దానం చేశారు. 


తెలుగువారికి తీరని లోటు: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: కాకర్ల సుబ్బారావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైద్యసేవలో అయిదు దశాబ్దాలకు పైగా ఉన్న కాకర్ల ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. బసవతారకం ఆసుపత్రికి ట్రస్టీగా, ఛైర్మన్‌గా కాకర్ల ఎనలేని సేవలందించారని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. అమెరికాలోని తెలుగువారందరినీ ఒకచోట చేర్చేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి’ (తానా) రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి కాకర్ల సుబ్బారావు అని ‘తానా’ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, సతీశ్‌ వేమన పేర్కొన్నారు.


విజ్ఞాన గని.. వైద్యశిఖామణి..

‘‘జీవితంలో మొదటి 30 ఏళ్లు కష్టపడి, ఇష్టపడి చదివాను. తర్వాత 30 ఏళ్లలో వృత్తిలో ఎదుగుతూ సంపాదన ఆర్జించాను. మూడో 30 ఏళ్లు నా ఎదుగుదలకు కారణమైన సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. మనిషిగా మన పుట్టుకకు అర్థం ఉండాలి’’ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఒక ఇంటర్వ్యూలో అన్నమాటలివి. 21 మంది కుటుంబ సభ్యుల్లో 11 మంది వైద్యులేనంటూ గర్వంగా చెప్పేవారు. రేడియాలజీలో పుస్తకాలు, జర్నల్‌లో పరిశోధన వ్యాసాలు రాశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు. 2001లో జీవితకాలపు కృషి అవార్డు పొందారు.  హైదరాబాద్‌ షేక్‌పేటలో 1991లో ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించారు. ఐసీఎస్‌సీ విధానంలో బోధన సాగించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంతో కాకర్లకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. తమ స్నేహానికి గుర్తుగా పాఠశాల ఆవరణలో అబ్దుల్‌ కలాం నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. రేడియాలజీ, ఇమేజింగ్‌ సాంకేతికతలో యువతను ప్రోత్సహించేందుకు కాకర్ల సుబ్బారావు రేడియాలజికల్‌ అండ్‌ ఇమేజింగ్‌ ఎడ్యుకేషనల్‌ సైన్సెస్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్‌ కోరికపై నిమ్స్‌కు

1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు విద్య, వైద్య రంగాల్లో పనిచేస్తున్న తెలుగువారిని చూశారు. జన్మభూమికి సేవ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిందిగా కోరారు. ఆయన కోరిక మేరకు కాకర్ల 1986లో హైదరాబాద్‌ వచ్చి నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌ను గాడిన పెట్టేందుకు మహాయజ్ఞమే చేశారు. మొదటిసారిగా రోగుల నుంచి నామమాత్రపు ఫీజు పద్ధతిని ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. కాకర్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత నిమ్స్‌ రూపురేఖలే మారిపోయాయి. పేద, మధ్యతరగతి రోగులకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందేలా అభివృద్ధి చేశారు.  నిమ్స్‌ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా వ్యవహరించారు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు