close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గాంధీ ఆసుపత్రి పూర్తిగా కొవిడ్‌కే

నేటి నుంచి సేవలు
అందుబాటులో 1850 పడకలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని శనివారం నుంచి మరోసారి పూర్తిస్థాయి కొవిడ్‌ వైద్య సేవా కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గాంధీలో మొత్తం 1850 పడకలుండగా.. 700 కొవిడ్‌ బాధితులకు కేటాయించారు. గురువారం నాటికి 450 మంది చికిత్స పొందుతుంటే శుక్రవారం రాత్రి వరకు మరో 150 మంది చేరారు.
పది నిమిషాలకు ఒకరి చేరిక
గాంధీ ఆసుపత్రిలో ప్రతి పది నిమిషాలకు ఒకరు కరోనాతో చేరుతున్నారు.ఇప్పటికే ఇన్‌పేషెంట్‌ బ్లాకు మొత్తం నిండిపోయింది. కొత్తవారిని చేర్చుకోలేని పరిస్థితి నెలకొంటోందని భావించిన యాజమాన్యం ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో శనివారం నుంచి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని ఆ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ వివిధ రోగాలతో చికిత్సలు పొందుతున్న వెయ్యి మందిని ఒకట్రెండు రోజుల్లో ఇతర వైద్యశాలలకు తరలించడమో, ఇళ్లకు పంపించడమో చేస్తామని ఆయన అన్నారు. తద్వారా 1850 పడకలు పూర్తిగా కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ఏడాది మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ఈ వైద్యశాల ఇదే తరహాలో సేవలందించి అనేక మంది ప్రాణాలు కాపాడింది. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో వెయ్యి కరోనా పడకలుంటే సగానికి పైగా నిండిపోయాయి. కింగ్‌కోఠి ప్రభుత్వ వైద్యశాల, ఛాతీ వైద్యశాలల్లో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గాంధీ’ని పూర్తి స్థాయి కరోనా వైద్య సేవా కేంద్రంగా మార్చడం రోగులకు ఉపకరించనుంది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు