close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాగర సమరం నేడే

ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఈనాడు, నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో నియోజకవర్గవ్యాప్తంగా 2,20,300 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెరాస, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా అభ్యర్థులతో పాటు మొత్తం 41 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ దఫా పోలింగ్‌ సమయాన్ని రెండు గంటల పాటు పెంచింది. పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిగా కొవిడ్‌ నిబంధనలు అమలవుతాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, ఎలాంటి ఘర్షణలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక విధులు నిర్వర్తించే సిబ్బందికి అనుములలోని ఐటీఐ కళాశాలలో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. మరోవైపు పోలింగ్‌కు ఒక రోజు ముందు శుక్రవారం అన్ని పార్టీలు ఓటర్లపై ప్రలోభాలను ఎరవేశాయి.
ఓ ప్రధాన రాజకీయ పక్షం శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తల వరకే ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేసింది. కొన్నిచోట్ల రూ.2 వేలు చొప్పున ఇచ్చినట్లు సమాచారం. చాలాచోట్ల శుక్రవారం ఉదయం నుంచే బూత్‌ల వారీగా మద్యం సరఫరా చేశారు.  నిడమనూరు మండలం ఊట్కూరుకు చెందిన ఓ ప్రధాన పార్టీ నాయకుడు డబ్బులు పంచుతున్నారని పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఆ పార్టీ నాయకులు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచారణ అనంతరం ఆ నాయకుడిని పోలీసులు వదిలేయడంతో గొడవ సద్దుమణిగింది. ‘‘అన్ని పార్టీలు కలిపి నాకు ఓటుకు రూ. 4 వేలు ఇచ్చాయి. ఇన్ని డబ్బులు ఒక్క ఓటుకు ఇవ్వడం నేనేప్పుడూ చూడలేద’’ని తిరుమలగిరికి చెందిన ఓ వృద్ధుడు ‘ఈనాడు’తో చెప్పడం ప్రలోభాల పరిస్థితికి అద్దం పడుతోంది. 


కారులో నగదు స్వాధీనం...

గుర్రంపోడు, న్యూస్‌టుడే: ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో రూ.3.28 లక్షల నగదును ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం స్వాధీనం చేసుకుంది. శుక్రవారం నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా నగదు తరలిస్తున్నారని గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు.. ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం కాంగ్రెస్‌ నాయకుడు కామసాని లక్ష్మారెడ్డి కారును తనిఖీచేశారు. కారులో ఉన్న రూ.3.28 లక్షలు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన తోటలోని బత్తాయి కాయలు అమ్మగా వచ్చిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.


నేడే తిరుపతి ఉప ఎన్నిక

ఈనాడు, తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రానికి అన్ని పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సుల తరలింపును పూర్తి చేశారు. శనివారం ఉదయం ఏడింటినుంచి రాత్రి ఏడింటి వరకు ఎన్నిక జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.




ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు