close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణలో అధికారంలోకి వస్తాం

వై.ఎస్‌.షర్మిల ధీమా

ఉద్యోగ దీక్ష విరమణ..

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే భర్తీ చేయాలని వై.ఎస్‌.షర్మిల డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 3.85 లక్షలని ఒక నివేదిక చెబుతోందని.. వాటన్నింటినీ భర్తీ చేయాలన్నారు.  హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులు షర్మిలకు పండ్ల రసం ఇచ్చి ఉద్యోగ దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏడేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవన్నారు. దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఇకముందు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్లు వచ్చేవరకు తాను పోరాడతానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రిలే దీక్షలను కొనసాగిస్తాయన్నారు.నోటిఫికేషన్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని.. ఉద్యోగాల భర్తీలో ఏడేళ్ల వరకు వయోపరిమితి పెంచాలని ఆమె డిమాండ్‌ చేశారు.  రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో లక్షల్లో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని పేర్కొన్నారు.  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయనుకుంటే కేసీఆర్‌ ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌పై తనతో పోలీసులు వ్యవహరించిన తీరును షర్మిల తప్పుపట్టారు. కేసీఆర్‌ తన రాజకీయ లబ్ధి కోసం 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశారని విమర్శించారు. యూనివర్సిటీల్లో వీసీలు కూడా లేరని.. విద్యార్థులు, ప్రొఫెసర్లకూ గొర్రెలిస్తే కాసుకుంటూ జీవిస్తారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.   ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం పైసా సాయం అందించలేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. రవీంద్రనాయక్‌ భార్యకు, కొప్పు రాజు తల్లికి, మురళి తల్లికి రూ.50 వేల చొప్పున చెక్కులను షర్మిల అందజేశారు. కార్యక్రమంలో ఆమె తల్లి విజయమ్మ పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు