close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
63 వేల పడకలున్నాయ్‌

రెమ్‌డెసివిర్‌ సమస్య త్వరలోనే పరిష్కారం
వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులను మినహాయిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా కొవిడ్‌ బాధితులకు పడకల కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 63 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, బెడ్లు దొరకవేమోనని ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి అవసరమైతే వందల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.  ‘‘ఈ వ్యాధి సోకిన వారందరికీ స్పెషలిస్టు వైద్యసేవల అవసరం రాదు. ఎంబీబీఎస్‌లు చికిత్స అందించవచ్చు. నిజంగా అవసరమైన వారికే వైద్యులు ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందించాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ బాధితుల్లో ఆరోగ్యం విషమించాక గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు’’ అని స్పష్టం చేశారు. మంత్రి ఈటల ఆదివారం బీఆర్‌కే భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రోగుల సంఖ్య పెరిగితే మున్ముందు 360 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుంది. కొరత లేకుండా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగైదు నెలలుగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో.. ఔషధ సంస్థలు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని నిలిపివేశాయి. త్వరలోనే మరో 3 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రాష్ట్రానికి వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కంపెనీలతో నిత్యం మాట్లాడుతున్నారు. ఎవరికైనా అవసరమైతే వైద్యుల చీటీని తీసుకొస్తే, ఔషధ నియంత్రణ అధికారులు ఇంజక్షన్లు అందించే ఏర్పాట్లు చేస్తారు.
వైద్యులు, నర్సులు సెలవులు పెట్టొద్దు
కరోనా రాకుండా చూసుకోవడంలో మాస్క్‌లే శ్రీరామరక్ష. రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లు, ప్లాస్మాథెరపీ ఇవన్నీ ప్రయోగాత్మకంగా అందిస్తున్నవే. పరిమితుల మేరకే పనిచేస్తాయి. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదు. లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా, ముప్పు తీవ్రత అధికంగా ఉండే కేసులు తక్కువే. కరోనా సోకినవారిలో 99.5 శాతం మంది కోలుకుంటున్నారు. కొందరు మాత్రమే మృతి చెందుతున్నారు. పీపీఈ కిట్లు, ఔషధాలు, హోం ఐసొలేషన్‌ కిట్లు, అంబులెన్సులు, వైద్యుల కొరత లేకుండా చేస్తున్నాం. అవసరమైనచోట నియామకాలు చేపట్టాలని కలెక్టర్లకు అధికారం ఇచ్చాం. వైద్యులు, నర్సులు సెలవులు పెట్టొద్దు. విధులు నిర్వహిస్తూ రోగులకు ధైర్యం ఇవ్వాలి’’ అని మంత్రి ఈటల కోరారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు