close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడో డోసుతో కొవిడ్‌కు మూడుతుందా?

మరింత డేటా అవసరం
ఇప్పుడే నిర్ణయం తొందరపాటు అవుతుంది
నిపుణుల వెల్లడి

దిల్లీ: కొవిడ్‌-19పై సమర్థ పోరు కోసం టీకాకు సంబంధించిన మూడో బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై మరింత డేటా అవసరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో శాస్త్రీయ ఆధారాలు లేకుండా అంచనాల ఆధారంగానే దీని ఆవశ్యకతను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తమ టీకాలకు సంబంధించి రెండు డోసులను పొందినవారికి ఈ ఏడాది మూడో డోసు అవసరమవుతుందని ఫైజర్‌, మోడెర్నా సంస్థలు ఇటీవల ప్రకటించాయి. ఆ తర్వాత కూడా ఏటా ఒక డోసును పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశాయి. కొవాగ్జిన్‌ టీకా మూడో డోసుపై క్లినికల్‌ ప్రయోగాలకు భారత్‌ బయోటెక్‌ ఇటీవల అనుమతి పొందింది. బూస్టర్‌ డోసు ఆవశ్యకత, సమర్థతపై మరిన్ని అధ్యయనాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్లపై పోరాడటంలో ఇది మరింత సమర్థంగా పనిచేస్తుందా అన్నది తేల్చాలని చెప్పారు.

యాంటీబాడీల తీవ్రత ఎప్పటికి పడిపోతుందో తేల్చాలి
రోగనిరోధక వ్యవస్థలోని జ్ఞాపకశక్తికి సంబంధించిన డేటా ఆధారంగా మూడో డోసుపై కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)లోని నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ సమీరన్‌ పాండా చెప్పారు. రెండు డోసులు ఇచ్చాక.. మూడో డోసు అవసరమయ్యే స్థాయికి సదరు వ్యక్తిలో యాంటీబాడీల తీవ్రత ఎప్పటికి పడిపోతుందన్నది తేల్చాలని ఆయన తెలిపారు. ‘‘తరిగిపోతున్న యాంటీబాడీలను ఎదుర్కొని, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ బూస్టర్లను ఇస్తుంటారు. 6-9 నెలల తర్వాత వీటి తీవ్రత తగ్గిపోతున్నట్లు వెల్లడైంది. అయితే కరోనా సోకినవారిలోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది. టీకా వేసిన వారిలో ఎంత కాలానికి ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందన్నది ఇంకా వెల్లడి కాలేదు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ఆరంభమై ఐదు నెలలు కూడా గడవలేదు. అందువల్ల దీనిపై ఒక నిర్ధారణకు రావడానికి ఇంకా సమయం ఆసన్నం కాలేదు’’ అని పేర్కొన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ప్రొఫెసర్‌ గిరిధర బాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మూడో డోసు.. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి ఈ వాదనను సమర్థించడానికి అవసరమైన డేటా అందుబాటులో లేదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఫ్లూ టీకాల తరహాలో కొవిడ్‌కూ ఏటా బూస్టర్‌ డోసులు అవసరం కావొచ్చు. కొవిడ్‌-19 వ్యాధి చాలా కొత్తది. దానికి టీకాలు అభివృద్ధి చెంది ఏడాది కూడా కాలేదు. మనకు మరింత డేటా, అధ్యయనం కావాలి’’ అని చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు