close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆక్సిజన్‌ సరఫరాకు ఊపిరి

రాష్ట్రానికి 360 టన్నులు కేటాయించిన కేంద్రం
విశాఖ స్టీల్‌ ప్లాంటు నుంచి తరలింపు
తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఏపీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ అవసరాలపై కేంద్రం దృష్టి సారించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రాణవాయువు సరఫరాను కేంద్రమే పర్యవేక్షిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంటులో రోజువారీగా తయారవుతున్న ఆక్సిజన్‌లో కొంత మొత్తాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేటాయించి.. మిగిలినది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించింది. తెలంగాణలో రోజువారీగా 250 మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమని కేంద్రం అంచనా వేసింది. అధిక మొత్తంలో ఆక్సిజన్‌ పంపించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు స్టీల్‌ ప్లాంటులో తయారవుతున్న ఆక్సిజన్‌ సరఫరాలో తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. మహారాష్ట్రలో కేసుల తీవ్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో స్టీల్‌ ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ సరఫరాకు రైల్వేశాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
విశాఖలో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రాంగణంలోని ఆక్సిజన్‌ తయారీ పరిశ్రమలో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు ఉత్పత్తవుతోంది. ఉత్పత్తిని ఇంకా పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా స్టీల్‌ ప్లాంటు అధికారులను కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. ప్లాంటులో సుమారు 2,700 మెట్రిక్‌ టన్నుల నిల్వకు అవకాశం ఉంది. ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఫ్లాట్‌ వ్యాగన్లు ముంబయి నుంచి మంగళవారానికి విశాఖపట్నం చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిలో సత్వరం ఆక్సిజన్‌ నింపేందుకు విశాఖ స్టీల్‌ ప్లాంటు, రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ను రవాణా చేసే వాహనాల కోసం అధికారులు అన్వేషణ ఆరంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 47 అనుమతులు తీసుకున్న ట్యాంకర్లున్నట్లు గుర్తించారు. వీటిలో 22 ఆక్సిజన్‌ రవాణా చేసేవి కాగా.. నైట్రోజన్‌ సరఫరా ట్యాంకర్లు 22, మరో మూడు ఆర్గానిక్‌ కెమికల్స్‌ సరఫరా చేసే ట్యాంకర్లు ఉన్నాయి.


ఆక్సిజన్‌ను ఇలా ఉత్పత్తి చేస్తారు..!

గాలిలో 20.6% ఆక్సిజన్‌, 78.03% నైట్రోజన్‌,  0.93% శాతం ఆర్గాన్‌ గ్యాస్‌లతో పాటు ఇతర మూలకాలూ ఉంటాయి. ఉక్కు తయారీలో ప్రధానంగా ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌ వాయువుల అవసరం చాలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి లేకుండా ఉక్కుని ఉత్పత్తి చేయలేం. అందుకే ఉక్కు కర్మాగారాలన్నీ ఈ గ్యాస్‌లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుంటాయి. క్రయోజనిక్‌ ఎయిర్‌ సప్రెషన్‌ విధానంలో గాలి నుంచి ఈ వాయువుల్ని వేరుచేస్తారు. మైనస్‌ 173 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే వీటిని వేరు చేయడం సాధ్యమవుతుంది. మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌ వేరవుతుంది. అది గ్యాస్‌ రూపంలో ఉంటుంది. దాన్ని ద్రవరూపంలోకి మార్చి మరింత వడకడితే 99.9 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లభిస్తుంది. ఒక గంటకు ఒక లక్ష సాధారణ ఘనపు మీటర్ల గాలిని ప్రాసెస్‌ చేస్తే... 13,500 నుంచి గరిష్ఠంగా 18,500 సాధారణ ఘనపు మీటర్ల ద్రవ రూప ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు