close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీరు నిర్ణయం తీసుకుంటారా..  మేం ఆదేశించాలా?!

కొవిడ్‌ నియంత్రణపై హైకోర్టు ప్రశ్నలు
పరీక్షలెన్ని చేశారు? పాజిటివ్‌లెన్ని?
ఆక్సిజన్‌ నిల్వలపై స్పష్టత ఇవ్వండి
అధికారులకు ధర్మాసనం ఆదేశం

దిల్లీలో పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? రాత్రిపూట.. వారాంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు చర్యలు తీసుకుంటారా? లేక మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా? ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మీది.. మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి.

- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నియంత్రణలో ఉదాసీనతపై సోమవారం హైకోర్టు మండిపడింది. 10 రోజుల సమయం ఇచ్చినా ఏ ఒక్క ఆదేశం అమలు చేయలేదని తప్పుపట్టింది. మీరు చేయకపోతే మేం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాజకీయర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు... పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది. మద్యం దుకాణాల్లో వచ్చే ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదా? వారంరోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఇంట్లోనే రక్షణ ఉండడంలేదు.. అని పేర్కొంది. కోర్టుకు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీసుకుంటున్న చర్యలపై జిల్లాలవారీగా పరీక్షలు ఎన్ని, పాజిటివ్‌లు ఎన్నెన్నో వివరాలడిగితే ఇవ్వలేదంది. ఓ వైపు ఆరోగ్యశాఖ మంత్రి ఆక్సిజన్‌ నిల్వలు లేవని చెబుతుంటే మరోవైపు ఆక్సిజన్‌ తగినంత ఉందని ఆరోగ్యశాఖ కోర్టుకు చెబుతోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, రెమ్‌డెసివిర్‌ కొరతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మీరు చేస్తారన్న నమ్మకం పోతోంది..
కొవిడ్‌ నియంత్రణపై గత ఏడాది దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యాహ్నానికి అధికారులు హాజరుకావాలని ఆదేశించడంతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కోర్టుకు వచ్చారు. విమానాల్లో వచ్చే దేశీయ ప్రయాణికులతోపాటు రైలు, రోడ్డు మార్గాల్లో వచ్చే ఇతర రాష్ట్రాల ప్రయాణికుల తనిఖీకి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కుంభమేళా నుంచి తిరిగి వచ్చేవారిని క్వారంటైన్‌కు పంపుతున్నారా అని అడిగింది. ‘మీరు చేస్తారన్న నమ్మకం పోతోంది’ అని వ్యాఖ్యానించింది. నివేదికలో ఏ వివరాలు లేకపోవడంతో తామే ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ నుంచి వివరాలను తీసుకున్నామని తెలిపింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ స్పందిస్తూ కేవలం వైద్య ఆరోగ్యశాఖ ఒక్కటే కాకుండా ప్రభుత్వ శాఖలన్నీ కరోనా నియంత్రణ పనిలోనే ఉన్నాయన్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కొవిడ్‌ ఆస్పత్రులను గుర్తించాలని.. బెడ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. నోడల్‌ అధికారులను నియమించాలని, ఎక్కడైనా కుటుంబం అంతా కొవిడ్‌ బారిన పడితే వారిని ఆదుకోవాలని సూచించింది.


ప్రాణాలు పోతుంటే ఇలాగేనా?

14 కొత్త ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. నాలుగు వారాల గడువు కావాలని ఏజీ చెప్పడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు పోతుంటే 4 వారాలు అవసరమా? వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురండి అని సూచించింది. 273 మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేశామని ఆరోగ్యశాఖ కార్యదర్శి చెప్పారు. ఆదిలాబాద్‌లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కోర్టుల భౌతిక విచారణను నిలిపివేశామని ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలు తీసుకోవడంలేదని ధర్మాసనం పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి 14 వరకు నిర్వహించిన సర్వే ప్రకారం 80.9 శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పరీక్షలెన్ని చేశారనగా 33 జిల్లాలో ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేశామని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ తెలిపారు. సమగ్ర వివరాలతో నివేదిక ఈనెల 22లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గడువు పొడిగించాలని ఏజీ కోరగా ధర్మాసనం నిరాకరిస్తూ చేయగలిగింది చేయండి, మిగిలినవి మేం చేస్తామంటూ విచారణను 23కు వాయిదా వేసింది.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు