సూది మందుకు దోచేస్తున్నారు!
close

ప్రధానాంశాలు

సూది మందుకు దోచేస్తున్నారు!

రెమ్‌డెసివిర్‌ పేరిట ఆసుపత్రుల నిలువుదోపిడీ
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
ఎమ్మార్పీ కంటే అయిదింతల వరకు వసూలు
ఈనాడు - హైదరాబాద్‌

‘రెమ్‌డెసివిర్‌’ ఇంజక్షన్‌ పేరిట కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై ఏకంగా మూడు నుంచి అయిదింతల వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఈ ఇంజక్షన్‌ అందరికీ అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ని తీవ్రమైన లక్షణాలున్న వారికే వాడాలని, అనవసరంగా వాడొద్దని ప్రైవేటు వైద్యులకు సూచించామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అయినా ప్రైవేటు ఆసుపత్రుల వారు ‘అత్యవసరం’ పేరిట సొమ్ము చేసుకుంటున్నారు. రెమ్‌డెసివిర్‌ ఇస్తేనే బాధితులు బతుకుతారనే ఆశతో అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులు చెల్లిస్తున్నారు. మరోవైపు టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లకూ కొన్ని మందుల దుకాణాల వారు కొరత సృష్టిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు.

రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను రెండు ఔషధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక సంస్థకు రోజుకు 34 వేలు, మరొకటి రోజుకు 37 వేల ఇంజక్షన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. రెండు సంస్థల ఇంజక్షన్‌ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు, అక్టోబరు వరకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉండడంతో.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులు పెద్దఎత్తున వినియోగించాయి. అందుకు తగ్గట్లుగా ఔషధ సంస్థలూ ఇంజక్షన్లను ఉత్పత్తి చేశాయి. క్రమేణా కేసులు తగ్గుముఖం పట్టడంతో రెమ్‌డెసివిర్‌ వాడకం తగ్గుతూ వచ్చింది. ఔషధ సంస్థలూ ఉత్పత్తిని తగ్గించాయి. గత మార్చి రెండో వారం నుంచి కొవిడ్‌ రెండోదశ ఉధ్ధృతి మొదలైంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నెల మొదటి వారంలో ఒక్కరోజులోనే 1,000 కేసులు నమోదు కాగా.. 17వ తేదీన 5,000 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఔషధ సంస్థల వద్ద సరిపోయినన్ని నిల్వలు లేవు.
బహిరంగ విపణిలో అందుబాటులో లేక..
కొవిడ్‌ మొదటి దశలోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు కొరత ఏర్పడింది. బహిరంగ విపణిలో కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఇంజక్షన్‌ను ఉత్పత్తి సంస్థలు నేరుగా ఆసుపత్రులకే సరఫరా చేయాలని ఔషధ నియంత్రణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధానం ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ కారణంగా బహిరంగ విపణిలో అందుబాటులో లేదు. వాస్తవానికి గరిష్ఠ చిల్లర ధర కంటే కూడా నాలుగో వంతు ధరకే ఆసుపత్రులకు ఉత్పత్తి సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఒక సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.800కే సరఫరా చేస్తోంది. అయినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. డబ్బు ముందుగానే చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.
మరో రెండు సంస్థలకు అనుమతి
రాష్ట్రంలో మరో రెండు ఔషధ సంస్థలకు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి కోసం అనుమతిచ్చినట్లుగా ఔషధ నియంత్రణాధికారులు తెలిపారు. రోజుకు మరో 35-40 వేల వరకు ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తవుతున్న ఇంజక్షన్లలో నాలుగో వంతు మాత్రమే రాష్ట్రంలోని ఆసుపత్రులకు సరఫరా చేస్తుండగా.. మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. దీంతోనూ కొరత ఏర్పడుతోంది. ఇంజక్షన్‌ను ఉత్పత్తి చేసిన అనంతరం నాణ్యత ప్రమాణాల పరిరక్షణలో భాగంగా కనీసం 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలి. నాణ్యత ధ్రువీకరణ తర్వాతే విడుదల చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ మొదటి వారంలో ఉత్పత్తి చేసిన నిల్వలు ప్రస్తుతం నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో ఉన్నట్లు ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో తగినన్ని నిల్వలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
రూ.1.5 - 3 లక్షలు పలుకుతున్న టొసిలిజుమాబ్‌
టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్ల కొరత సైతం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా మారిన వారిలో వైద్యులు కొందరికి రెమ్‌డెసివిర్‌, మరికొందరికి టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్లను సూచిస్తున్నారు. రెమెడెసివిర్‌ మందుల దుకాణాల్లో అందుబాటులో లేదు. కొన్ని ఆసుపత్రుల సిబ్బందితో అవగాహన ఏర్పర్చుకుని టొసిలిజుమాబ్‌ను నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగినంత ఇస్తే క్షణాల్లో తెచ్చిస్తున్నారు. ఈ ఇంజక్షన్‌ ఎమ్మార్పీ రూ.40 వేల వరకు ఉండగా.. రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ (62)కు టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ అవసరమైంది. ఆసుపత్రిలో స్టాకు లేకపోవడంతో ఓ దళారి ద్వారా రూ.1.6 లక్షలు చెల్లించి కుటుంబ సభ్యులు సంపాదించారు.


అందరికీ అవసరం లేదు
-డాక్టర్‌ రమణప్రసాద్‌, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, కిమ్స్‌

కొవిడ్‌ రోగుల్లో 99.98 శాతం మందికి టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ అవసరం ఉండదు. కొవిడ్‌ సోకిన మొదటి వారంలో అందించే ఫ్యాబీఫ్లూ మాత్రలతోనే చాలామందిలో నయమవుతుంది. రెండో వారంలో జ్వరం, ఆయాసం, దగ్గు లాంటి లక్షణాలతోపాటు ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే రెమ్‌డెసివిర్‌తో పాటు స్టెరాయిడ్లు ఇస్తారు. కొందరిలో ఐఎల్‌6, సీఆర్‌పీ, పెరిటిన్‌, ఎల్‌డీహెచ్‌, డిడైమర్‌ పరీక్షల్లో భారీగా హెచ్చుతగ్గులుంటే శరీరంలోని వ్యాధినిరోధక శక్తి మనపైనే దాడి చేస్తుంది. అలాంటప్పుడు ఇందుకు వ్యాధి నిరోధకశక్తిని తగ్గించాలి. ఈ సందర్భంగా మాత్రమే టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితుడికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాల్సిన అవసరం పడింది. బహిరంగ విపణిలో ఎక్కడా దొరకకపోవడంతో ఆసుపత్రివర్గాలే సమకూర్చడానికి అంగీకరించాయి. ఇంజక్షన్‌ గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) రూ.5,400 కాగా.. అంతకు ఐదింతలు అంటే రూ.27 వేలు చెల్లించాలని షరతు విధించాయి. ఆరు ఇంజక్షన్లకు గాను రూ.1.35 లక్షలు ముందుగానే చెల్లించాలని చెప్పాయి. బాధితుడి బంధువులు బతిమిలాడి చివరకు రూ.1.10 లక్షలు చెల్లించారు.
కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా రోగికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరమని వైద్యుడు సూచించారు. స్థానికంగానే కాకుండా హైదరాబాద్‌లోని పెద్ద ఔషధ దుకాణాల్లోనూ వెతికారు. ఎక్కడా దొరక్కపోవడంతో చివరకు ఆసుపత్రివర్గాలనే బంధువులు ఆశ్రయించారు. ఒక్కో ఇంజక్షన్‌ గరిష్ఠ చిల్లర ధర రూ.6వేలు కాగా.. ఆరు ఇంజక్షన్లకు రూ.36 వేలు తీసుకోవాలి. అయితే.. తాము కూడా నల్లబజారులోనే అధిక ధరకు కొనుగోలు చేశామంటూ ఆసుపత్రివారు రూ.లక్ష తీసుకున్నారు.


అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను నల్ల బజారులో అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కూకట్‌పల్లిలోని హెటిరో హెల్త్‌కేర్‌లో బిజినెస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్‌ సలీం జాఫర్‌, ఫీల్డ్‌ సేల్స్‌ అధికారిగా పనిచేస్తున్న బాతాల వెంకటేష్‌, అల్కెమ్‌ ఫార్మసీలో మెడికల్‌ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తున్న జొన్నల శరణ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 12 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.


విక్రయ కేంద్రం వద్ద ఆందోళన

మూసాపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ మూసాపేటలోని వైజంక్షన్‌లో హెటిరో సంస్థ ఏర్పాటు చేసిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయ కేంద్రం వద్ద సోమవారం తోపులాట చోటుచేసుకుంది. ఇక్కడ రూ.20,400కు ఆరు ఇంజక్షన్లతో కూడిన కిట్‌ను విక్రయిస్తున్నారు. రోగుల బంధువులు ఉదయం 6 గంటల నుంచే విక్రయ కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. ఒకరోజు టోకెన్లు తీసుకున్నవారికి తరువాతి రోజు లేదా మరోరోజు ఇంజక్షన్లను నిర్వాహకులు ఇస్తున్నారు. టోకెన్లు తీసుకుని రెండు రోజులైనా ఇంజక్షన్లు ఇవ్వడం లేదంటూ కేంద్రం ఎదుట సోమవారం పలువురు ఆందోళనకు దిగారు. గేటు తోసుకుని లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసులు వారిని శాంతింపజేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని