close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంగారకుడిపై రెక్కలు చాచి.. రెపరెపలాడి..!

మరో గ్రహంపై తొలిసారి గగనవిహారం
చరిత్ర సృష్టించిన ‘ఇన్‌జెన్యుటీ’ హెలికాప్టర్‌
కీలక మైలురాయి సాధించిన నాసా

కేప్‌ కెనావెరాల్‌: ఖగోళ పరిశోధనల్లో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇప్పటివరకూ భూమి వాతావరణానికే పరిమితమైన హెలికాప్టర్లు.. ఇక గ్రహాంతర పరిశోధనల్లోనూ హల్‌చల్‌ చేయనున్నాయి. ఈ దిశగా మొదటి అడుగుపడింది. అంగారకుడిపై తొలిసారిగా నియంత్రిత పద్ధతిలో, స్వీయ శక్తితో ఒక బుల్లి హెలికాప్టర్‌ గగనయానం చేసింది. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) రూపొందించిన ఈ లోహవిహంగం.. అరుణగ్రహ గాలిని చీల్చుకుంటూ మూడు మీటర్ల ఎత్తు చేరుకుంది. ఈ అద్భుతాన్ని.. 1903లో రైట్‌ సోదరులు తొలిసారి పుడమిపై ఆకాశయానం చేసిన చారిత్రక ఘట్టంతో నిపుణులు పోల్చారు.  1.8 కిలోల బరువున్న ఈ హెలికాప్టర్‌ పేరు ఇన్‌జెన్యుటీ. 8.5 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను పసిగట్టే లక్ష్యంతో పంపిన ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌లో భాగంగా దీన్ని నాసా ప్రయోగించింది. ఫిబ్రవరిలో ఇది అరుణ గ్రహంపై కాలుమోపింది. ఈ నెల 3న పర్సెవరెన్స్‌ నుంచి విడిపోయిన ఇన్‌జెన్యుటీ.. అంగారకుడి ఉపరితలంపై దిగింది. పరీక్షలు పూర్తిచేసుకొని సోమవారం తొలిసారి గగనయానం చేసింది. ఈ విషయాన్ని హెలికాప్టర్‌ ముఖ్య పైలట్‌ హావర్డ్‌ గ్రిప్‌ ప్రకటించగానే కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. ఇన్‌జెన్యుటీ కొలువుదీరిన ప్రదేశానికి 65మీటర్ల దూరంలోఉన్న పర్సెవరెన్స్‌ రోవర్‌ ద్వారా చిత్రాలు, డేటా అందుకోవడానికి 3గంటల పాటు వారు భారంగా నిరీక్షించాల్సి వచ్చింది. తొలి ప్రయత్నంలో ఇన్‌జెన్యుటీ 39 సెకన్ల పాటు అంగారకుడి గాల్లో విహరించి సాఫీగా కిందకు దిగింది. గగనయానంలో అది స్థిరంగానే సాగిందని డేటా చెబుతోంది.
ఎందుకు కష్టం?
భూమితో పోలిస్తే అరుణగ్రహ గురుత్వాకర్షణ శక్తి.. మూడో వంతే ఉంటుంది. అందువల్ల పుడమి మీదకన్నా సులువుగానే అక్కడ గగనవిహారం జరగాలి. అయితే భూమితో పోలిస్తే అంగారకుడి వాతావరణ సాంద్రత 1 శాతమే ఉంది. ఈ ఇబ్బంది వల్ల అక్కడ గాల్లోకి ఎగరడం చాలా కష్టం. ఇన్‌జెన్యుటీ రెక్కల భ్రమణ వేగాన్ని పెంచడం ద్వారా ఇంజినీర్లు ఈ ఇబ్బందిని అధిగమించారు. భూమి మీద హెలికాప్టర్‌ రెక్కలు సగటున నిమిషానికి 400 నుంచి 500 భ్రమణాలు చేస్తాయి. అంగారక హెలికాప్టర్‌లో అది ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా అంటే.. నిమిషానికి రెండున్నర వేల సార్లు తిరిగాలి. ఇందుకోసం ఇన్‌జెన్యుటీలో ఒకదానిపై ఒకటి.. రెండు జతల రెక్కలను అమర్చారు. అవి పరస్పరం వ్యతిరేక దిశలో తిరుగుతాయి. నేలపై దిగడానికి దీనికి నాలుగు కాళ్లను అమర్చారు. ఈ బుల్లి హెలికాప్టర్‌ పొడవు 49 సెంటీమీటర్లు. ఇందులో బ్యాటరీలు, హీటర్లు, సెన్సర్లు ఉన్నాయి. రెక్కలను కార్బన్‌-ఫైబర్‌, ఫోమ్‌తో తయారుచేశారు. ఈ రెక్కల విస్తీర్ణం 4 మీటర్లుగా ఉంది. బ్యాటరీల రీఛార్జి కోసం హెలికాప్టర్‌పై ఒక సౌరఫలకాన్ని అమర్చారు. అంగారకుడిపై రాత్రివేళ తలెత్తే మైనస్‌ 130 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఈ హెలికాప్టర్‌ విజయవంతంగా తట్టుకొంది. ఇందుకోసం అందులోని హీటర్‌ ఉపయోగపడింది. హెలికాప్టర్‌ తయారీకి ఆరేళ్లు శ్రమించాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన ఇంజినీరు బాబ్‌ బలరామ్‌ ఈ అద్భుత యంత్రాన్ని డిజైన్‌ చేశారు.
రైట్‌ సోదరుల క్షేత్రం..
అంగారకుడి ఉపరితలంపై సాఫీగా దిగడానికి వీలుగా రాళ్లు, రప్పలు లేని చదునైన ప్రాంతాన్ని నాసా ఎంపిక చేసింది. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ప్రదేశం.. పర్సెవరెన్స్‌ ల్యాండింగ్‌ ప్రదేశానికి 30 మీటర్ల దూరంలోనే కనిపించింది. దీనికి తాజాగా ‘రైట్‌ బ్రదర్స్‌ ఫీల్డ్‌’ అని పేరు పెట్టారు. తద్వారా ఆకాశయాన చరిత్రలో రెండు అద్భుత ఘట్టాలను సంధానించారు. నాడు రైట్‌ సోదరులు తాము నడిపిన తొలి విమానం ‘కిట్టీ హాక్‌’ రెక్కల్లో ఉపయోగించిన వస్త్రంలోని ఒక ముక్కను ఇన్‌జెన్యుటీలో ఉంచారు. నాసా ఇంజినీర్లు ఐదుసార్లు ఈ హెలికాప్టర్‌తో గగనవిహారం చేయిస్తారు. ఆకాశయాన పరిధిని క్రమంగా పెంచుతారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్‌లో అంగారకుడు, ఇతర గ్రహాలపైకి మరిన్ని డ్రోన్లను పంపడానికి వీలవుతుంది. తద్వారా అక్కడి దృశ్యాలపై విహంగ వీక్షణం చేయవచ్చు. ఉపకరణాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడానికీ ఇవి ఉపయోగపడతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భూమిపైనున్న హెలికాప్టర్ల సామర్థ్యాన్నీ మెరుగుపరచవచ్చు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు