close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌

మే 1 నుంచి అమలు 

రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
ఇక 50% డోసులు నేరుగా వాటికే...
అవసరమైతే రాష్ట్రాలు అదనపు డోసులు సేకరించుకోవచ్చు
తయారీదారులు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చు

ఈనాడు, దిల్లీ: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌ అందించే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న కేంద్రీకృత పంపిణీ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో... సగం వ్యాక్సిన్‌ నిల్వలను నేరుగా రాష్ట్రాలకు సరఫరాచేసే అధికారాన్ని తయారీదారులకు కల్పించింది. ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం బహిరంగ మార్కెట్లోకి టీకాను విడుదల చేసుకోవడానికీ అవకాశమిచ్చింది. ప్రధాని మోదీ ఆధ్వర్యాన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
మూడోదశ సరళీకృతం...
మే 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశ టీకా కార్యక్రమం కింద... వ్యాక్సిన్‌ ధర, సేకరణ, లబ్ధిదారుల అర్హతలను మరింత సరళీకృతం చేసినట్లు కేంద్రం పేర్కొంది. స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి భాగస్వాములందరికీ అధికారం కల్పించినట్లు తెలిపింది. ఈ దశలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ తీసుకొనే అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించింది. టీకా ఉత్పత్తి పెంపు నిమిత్తం తయారీదారులకు ప్రోత్సాహం అందించాలని; ఇదే సమయంలో స్థానికంగా వ్యాక్సిన్‌ తయారీ కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించింది. టీకా తయారీదారులు... 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి, నిర్ణీత ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడానికి కేంద్రం అంగీకరించింది. అదనపు డోసులు కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి సేకరించుకోవడంతోపాటు... 18 ఏళ్లుదాటిన ఏ వర్గానికైనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించే స్వేచ్ఛను కూడా కల్పించింది.
నిర్ణయాలు ఇలా...
1. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ల విషయంలో ఉత్పత్తిదారులు ప్రతినెలా 50% డోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించాలి. మిగతా 50% డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌కు అమ్ముకోవచ్చు.
2. బహిరంగ మార్కెట్లో విక్రయించే డోసుల ధరలను వ్యాక్సిన్‌ తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, పారిశ్రామిక సంస్థలు తమ అవసరాల కోసం టీకాను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రైవేటుగా వ్యాక్సిన్‌ అందించేవారంతా... డోసు ధరను పారదర్శకంగా బహిర్గతం చేయాలి. ఈ విధానంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ అందించవచ్చు.
3. కేంద్రం తలపెట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, 45 ఏళ్లు దాటినవారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందిస్తారు. ఈ కార్యక్రమం కింద మాత్రం 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయరు.
4. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీకాల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులకు పరిమితి లేదు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు