close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌ రానివ్వొద్దు

అందుకోసం రాష్ట్రాలు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి
  వలస కార్మికులకు భరోసా ఇవ్వాలి
  తుపానులా కరోనా రెండో దశ
  శ్రీరాముణ్ని ఆదర్శంగా తీసుకొని నిబంధనలు పాటిద్దాం
  రంజాన్‌ స్ఫూర్తితో నియమపాలనకు కట్టుబడి ఉందాం
 దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ను చిట్టచివరి ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దాన్ని విధించకుండా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సూక్ష్మస్థాయిలో కంటెయిన్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యాన్నీ కాపాడటం వీలవుతుందని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మంగళవారం రాత్రి ప్రసంగించారు. మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
కరోనాపై దేశం ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తోంది. తుపానులా రెండో దశ విరుచుకుపడుతోంది. గత కొన్నిరోజుల్లో చాలామంది ఆప్తులను కోల్పోయారు. ప్రస్తుతం మన ముందు కఠిన సవాలు ఉంది. సంకల్పం, ధైర్యం, సన్నద్ధతతో దాన్ని అధిగమించాలి.
ఔషధాల ఉత్పత్తి పెరిగింది
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. దాన్ని అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కృషిచేస్తున్నాయి. రాష్ట్రాల్లో నూతన ప్లాంట్లు పెట్టాం. కొత్తగా లక్ష సిలిండర్లు అందుబాటులోకి తెచ్చాం. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్లించాం. ఆక్సిజన్‌ రైలు ఏర్పాటుచేశాం. దేశంలో కేసులు పెరిగేకొద్దీ ఔషధాల ఉత్పత్తీ పెరిగింది. బలమైన ఫార్మారంగం ఉండటం మన అదృష్టం. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాం. నగరాల్లో తలెత్తుతున్న డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నాం.
గత ఏడాది పరిస్థితులు భిన్నం
దేశంలో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి తక్కువ సమయంలోనే టీకాలను తయారుచేశారు. ప్రపంచంలో అత్యంత చౌకైన టీకా మనదే. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల్లో స్థైర్యం నింపాలి. ఏ నగరంలో ఉన్నవారిని అక్కడే ఉండమని చెప్పాలి. అప్పుడే టీకా వేగంగా లభిస్తుంది. పనులూ నిలిచిపోవు. ప్రజాభాగస్వామ్యంతో ఇప్పుడు కరోనా తుపాన్‌ను ఓడిస్తామన్న నమ్మకం నాకుంది.
యువత బాధ్యత తీసుకోవాలి
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్నార్తులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి. ఇప్పటికే చాలామంది వ్యక్తులు, సామాజిక సంస్థలు ఇప్పటికే ఆ పనిచేస్తుండటం సంతోషకరం. యువత కమిటీలుగా ఏర్పడాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలి. వారు అలా చేస్తే కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటుచేయడం, లాక్‌డౌన్‌/కర్ఫ్యూ విధించడం వంటి పరిస్థితులు ప్రభుత్వాలకు రానేరావు. బుధవారం శ్రీరామనవమి. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిలా మనం మర్యాదలను అనుసరించాలి. కరోనా నుంచి రక్షించుకోవడానికి అన్ని నియమాలనూ వందశాతం పాటించాలి. ప్రస్తుతం రంజాన్‌ మాసం నడుస్తోంది. ధైర్యం, ఆత్మసంయమనం, నియమపాలనను అది నేర్పిస్తుంది. కరోనాపై యుద్ధంలో విజయం సాధించడానికి నియమపాలన చాలా ముఖ్యం.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు