close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెంచర్‌కు రోడ్డు... వరదకు అడ్డు

కాలువను రహదారిగా మార్చిన స్థిరాస్తి వ్యాపారులు
  పంచాయతీరాజ్‌ నిర్మించిన వంతెన కింద బరితెగింపు
 కాలువ ఆనవాళ్లు పూర్తిగా మాయం

ఈ చిత్రం చూడండి.. వంతెన కింద కనిపిస్తున్న రోడ్డు ప్రజలకు సౌకర్యంగా ప్రభుత్వం నిర్మించింది అనుకుంటున్నారా..! అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. వంతెన కింద వర్షపు నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా నిర్మించిన వరద కాలువను స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించేశారు. ఆపై దర్జాగా ఇలా రోడ్డు వేసేశారు. రాజధాని హైదరాబాద్‌ శివారు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోని పులిమామిడి వద్ద అక్రమ బాగోతమిది.

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో రెండు స్థిరాస్తి సంస్థలు హెచ్‌ఎండీఏ అనుమతితో వెంచర్‌ను వేస్తున్నాయి. పులిమామిడి నుంచి మహేశ్వరం వెళ్లే దారికి రెండువైపులా ఇది ఉంది. రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణలో భాగంగా కాలువ పారే మార్గంపై ఉన్న చిన్నపాటి కల్వర్టు స్థానంలో రూ.2.31 కోట్ల నాబార్డు నిధులతో పంచాయతీరాజ్‌ శాఖ వంతెన నిర్మించింది. వర్షాకాలంలో ఎగువ నుంచి వ్యవసాయ పొలాల మీదుగా వచ్చే వరద ఈ కాలువలోంచే పారుతుంది. రోడ్డుకు ఇరువైపులా వెంచర్‌ ఉండటంతో కాలువపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. వంతెన కింద ఉన్న కాలువ ఆనవాళ్లు తొలగించి వరద నీరు వెళ్లే ప్రాంతాన్ని చదును చేసి వెంచర్‌లోకి రెండువైపులా రాకపోకలు సాగించేలా రహదారి నిర్మించారు.వర్షపు నీటి ప్రవాహం వెంచర్‌లోకి రాకుండా పైభాగంలో గోడల నిర్మాణం చేపట్టారు.

గొలుసుకట్టును తెంపేశారు
పులిమామిడి సమీప ప్రాంతాల నుంచి వర్షాకాలంలో వచ్చే వరద ఈ వంతెన కిందుగా జైత్వారం పరిధిలోని నాయినివాణి చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి కొత్తగూడ ఆయకట్టు చెరువులోకి వెళ్తుంది. ఇలా గొలుసుకట్టు కాలువల ద్వారా 30 కి.మీ. ప్రవహించి ఇబ్రహీంపట్నం చెరువుకు చేరుతుంది. ఈ గొలుసుకట్టును స్థిరాస్తి వ్యాపారులు తెంపేశారు. వంతెన కింద నిర్మించిన రోడ్డు.. అడ్డుగా కట్టిన గోడల వల్ల ఎగువ నుంచి వచ్చే వరదతో భవిష్యత్తులో ముంపు ముప్పు పొంచి ఉంది.
ఆక్రమణ నిజమేనన్న నీటిపారుదలశాఖ
‘పులిమామిడి వంతెన కింద వరద కాలువను చదును చేసి రెండు స్థిరాస్తి సంస్థలు లేఅవుట్‌కు రోడ్డు వేశాయి. మావద్ద ఉన్న సర్వే ఆఫ్‌ ఇండియా పటం ప్రకారం అక్కడ కాలువ ఉన్నట్లు తేల్చాం’ అని నీటిపారుదలశాఖ ఏఈ నర్సయ్య అన్నారు. ఈ ఆక్రమణపై ఫిర్యాదులు రావడంతో గతనెల 7వ తేదీన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాలువ ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని రేఖాచిత్రపటం, ఇతర చిత్రాలతో గత నెల 18న కందుకూరు మండల తహసీల్దారుకు లేఖ రాశారు. ఆర్‌ఐను పంపించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లేఖ అందలేదన్న తహసీల్దారు
‘నీటిపారుదల శాఖాధికారులు రాసిన లేఖ మాకు రాలేదు. వంతెన కింద కాలువ ఆక్రమణ విషయం నా దృష్టికి రావడంతో నీటిపారుదలశాఖ, రెవెన్యూ విభాగాలు కలిసి సంయుక్త విచారణ చేయాలని చెప్పా. నీటిపారుదలశాఖ నివేదిక ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని కందుకూరు తహసీల్దారు జ్యోతి అన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు