close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆంక్షలు కఠినతరం

  కరోనా కట్టడికి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు

ఈనాడు-దిల్లీ,గువాహటి, లఖ్‌నవూ: కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పాక్షిక లేదా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. వచ్చే 3 వారాలు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటంతో ఎక్కడికక్కడ రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఝార్ఖండ్‌ వారం రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది. తెలంగాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, కేరళ, ఒడిశా, మణిపుర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌లోని అన్ని జిల్లాల పట్టణ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. మిజోరంలో ఐజ్వాల్‌తో పాటు 10 జిల్లాకేంద్రాల్లో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. చండీగఢ్‌లో శ్రీరామనవమి నాడు (బుధవారం) ఒకరోజు లాక్‌ డౌన్‌ విధిస్తున్నారు. మేఘాలయ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల పర్యాటకులపై నిషేధం విధించింది. మే 4 వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లోనూ పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు.

‘మహా’లాక్‌డౌన్‌ దిశగా..!
దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో బుధవారం నుంచీ పకడ్బందీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉంది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం మొగ్గు చూపడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటన చేసే అవకాశం ఉందని సీనియర్‌ మంత్రి ఒకరు తెలిపారు.
* దేశ రాజధాని దిల్లీలో మంగళవారం లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, మాల్స్‌, సినిమా థియేటర్లు, వారాంతపు మార్కెట్లు, తయారీ యూనిట్లు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, బార్లు, ప్రజా పార్కులు మూతపడ్డాయి.
* దిల్లీ కంటోన్మెంట్‌లోని తమ బేస్‌ ఆసుపత్రిని ప్రత్యేకించి కొవిడ్‌ వైద్యకేంద్రంగా మారుస్తున్నట్లు భారత సైన్యం మంగళవారం తెలిపింది. గురువారం నుంచి ఇక్కడ కొవిడ్‌ బారిన పడిన సైనిక సిబ్బందికి, మాజీ సైనికులకు వైద్యసేవలు అందించనున్నట్లు వెల్లడించింది.
యూపీలో వారాంతపు కర్ఫ్యూ
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వారాంతపు (శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 60 గంటల పాటు) కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. అలాగే 500 కేసులకు పైగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ రాత్రివేళ కర్ఫ్యూ విధించింది.

5 నగరాల్లో లాక్‌డౌన్‌పై స్టే

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందువల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని 5 నగరాల్లో ఈ నెల 26వ తేదీ వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, కానీ ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలన్న హైకోర్టు ఉత్తర్వు సరైనది కాదని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఉత్తర్వులు తీవ్ర పాలనాపరమైన సమస్యలు సృష్టిస్తాయని అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు