close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
25 జిల్లాల్లో ఉద్ధృతి

 ఒక్కరోజులోనే 5,926 పాజిటివ్‌లు
 ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇదే అత్యధికం
 కరోనాతో మరో 18 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ 25 జిల్లాల్లో ఉధ్ధృతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 5,926 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి పెరిగింది. మరో 18 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,856కు చేరింది. ఈ నెల 19న (సోమవారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 క్రియాశీల కేసులున్నాయి. సోమవారం 1,22,143 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,19,42,985కు పెరిగింది.
నాలుగో స్థానంలో నిజామాబాద్‌
తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(793), మేడ్చల్‌ మల్కాజిగిరి(488), రంగారెడ్డి(455) జిల్లాల తర్వాత నిజామాబాద్‌ 444 కేసులతో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా ఫలితాల్లో కామారెడ్డిలో 262, ఖమ్మంలో 247, వరంగల్‌ నగర జిల్లాలో 208, జగిత్యాలలో 205, మహబూబ్‌నగర్‌లో 195, మంచిర్యాలలో 188, సంగారెడ్డిలో 184, కరీంనగర్‌లో 168, నిర్మల్‌, సిద్దిపేట జిల్లాల్లో 167 చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 149, నల్గొండలో 144, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో 129 చొప్పున, మెదక్‌లో 124, సూర్యాపేటలో 121, యాదాద్రి భువనగిరిలో 117, రాజన్న సిరిసిల్లలో 116, భద్రాద్రి కొత్తగూడెంలో 113, ఆదిలాబాద్‌లో 105, వరంగల్‌ గ్రామీణలో 103 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.
* సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరిలో అయిదుగురు స్టాఫ్‌నర్సులు, అటెండర్‌, 102 డ్రైవర్‌ ఉన్నారు.
ప్రభుత్వ వైద్యంలో 10,029 పడకలు అందుబాటులో..
ప్రభుత్వ వైద్యంలో మొత్తం 13,732 కొవిడ్‌ పడకలు కేటాయించగా, ఇందులో సోమవారం రాత్రి నాటికి 3,703 నిండిపోయాయి. 10,029 అందుబాటులో ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిలో 1043 ఐసీయూ పడకలున్నాయి. ప్రైవేటులో 30,816 పడకలకుగాను 10,919 పడకల్లో రోగులు సేవలు పొందుతున్నారు. 19,897 పడకలు అందుబాటులో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
కొవిడ్‌ రోగులకు ఉచిత డయాలసిస్‌
ప్రభుత్వ వైద్యంలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న మూత్రపిండాల వైఫల్య రోగులకు ఉచిత డయాలసిస్‌ సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డయాలసిస్‌కు గాంధీ ఆసుపత్రిలో రూ.1,175, టిమ్స్‌లో రూ.1,215 చొప్పున నిర్వహణ సంస్థకు చెల్లించాలని పేర్కొంటూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఏపీలో కొత్త కేసులు 8,987.. మరణాలు 35

ఈనాడు, అమరావతి: ఏపీలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 37,922 నమూనాలు పరీక్షించగా 8,987 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 35 మంది ప్రాణాలు విడిచారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు