close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికలతో కరోనా కల్లోలం

భారీగా పెరిగిన పాజిటివ్‌ కేసులు

సాగర్‌లో పెద్దఎత్తున  ప్రబలిన వైరస్‌

ఎక్కడా అమలుకాని నిబంధనలు

ఈనాడు- హైదరాబాద్‌; ఈనాడు డిజిటల్‌ -నల్గొండ: కరోనా కల్లోలానికి ఎన్నికలు తోడవుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రధాన నాయకులు సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సహా సభలు, సమావేశాలకు హాజరైన వారిలో అనేకమంది కొవిడ్‌ బారిన పడ్డారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నేతలు, ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్న వారు, సభలు సమావేశాలకు హాజరైనవారిలో ఇతరుల కంటే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. తాజాగా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.
అనుమతి ఒకలా.. సభ మరోలా
పోలీసులు నిర్దేశించిన సంఖ్యతోనే సభ నిర్వహించాలని అనుమతి ఇచ్చేటప్పుడే స్పష్టం చేస్తారు. నిర్వాహకులు మాత్రం ఈ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. అనుమతించిన వారికంటే రెట్టింపు, మూడింతల మందితో సభలను నిర్వహించడం గమనార్హం. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఓ సభలో ఆరువేల మందితో నిర్వహించేందుకు అనుమతించగా రెట్టింపునకు పైగా జనం సభకు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల సభలన్నీ ఇదే రీతిలో జరిగాయి. ఓ బహిరంగ సభలో పాల్గొన్న నాయకుడు మాట్లాడుతూ ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదన్నారు.
మంగళవారం 195 కేసులు
గత పది రోజులుగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో భారీగా కొవిడ్‌ కేసులు పెరిగాయి. గతంలో రోజుకు 10 నుంచి 25 పాజిటివ్‌లు వస్తున్న చోట ఇప్పుడు రోజుకు 150కి పైగా వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 739 కేసులు వచ్చాయి. సోమవారం 174 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా మంగళవారం వీటి సంఖ్య 195కు పెరిగింది.  ఖమ్మంలో ఈ నెల 9న నిర్వహించిన వై.ఎస్‌.షర్మిల సభలో పాల్గొన్న నాయకులతో పాటు సభకు హాజరైన వారిలో సుమారు 100 మందికిపైగా వైరస్‌ సోకినట్లు ఆ పార్టీ ముఖ్యనేత తెలిపారు.
మంత్రులు, నేతలపై పోలీసు కేసులు
సాగర్‌ ఎన్నికల సందర్భంగా మాస్కులు లేకుండా ప్రచారాలు నిర్వహించారంటూ తెరాస, భాజపా అభ్యర్థులు సహా మరికొందరిపై 120 కేసులు నమోదయ్యాయి. 5 కంటే ఎక్కువ వాహనాలు వినియోగించి కాన్వాయ్‌ నిబంధనలు పట్టించుకోలేదంటూ కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డిపై కేసులు పెట్టారు.
సభలు ఇలా జరగాలి
* జిల్లా ఎన్నికల అథారిటీ సభలు నిర్వహించేందుకు అనువైన మైదానాన్ని గుర్తించాలి. ప్రవేశం.., వెలుపలికి వచ్చే మార్గాలను స్పష్టంగా నిర్దేశించాలి.
* సభలో భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ ఉండాలి.
* జిల్లా నోడల్‌ వైద్యాధికారి కూడా కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించేలా జోక్యం చేసుకోవాలి.
* జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా ఎస్పీ నిర్దేశించిన వారి కంటే ఎక్కువమందికి మించి సభకు హాజరుకాకుండా చర్యలు తీసుకోవాలి.
* రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సభలో పాల్గొనేవారికి మాస్క్‌లు, శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి ఏర్పాట్లు చేయాలి.
* ఉల్లంఘనులపై విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం జిల్లా ఎన్నికల అథారిటీ చర్యలు తీసుకోవాలి.

కొవిడ్‌ తీవ్రత ఎలా ఉంది?: ఎస్‌ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 30న పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొవిడ్‌ తీవ్రతపై వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని వైద్య ఆరోగ్యశాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాసింది. ఎన్నికలు వాయిదా వేయాలని విన్నవిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ రాసిన లేఖ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ చర్య తీసుకుంది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు