close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
త్వరలో ఉద్యోగుల వర్గీకరణ

జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద గుర్తింపు
 జిల్లాలవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు
 కొత్త జోనల్‌ నిబంధనల అమలుకు సన్నాహాలు  

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానం ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఎంతమంది ఉద్యోగులుండాలనే దానిపైనా కసరత్తు చేయనుంది. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 2016 అక్టోబరు నుంచి 2019 జనవరి వరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. అప్పట్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయి కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రతి జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.
ఇలా వర్గీకరణ
ముందుగా జిల్లా, జోన్‌, బహుళ జోన్‌ స్థాయి పోస్టులను నిర్ధారించాలి. ఇప్పటికే ఉద్యోగ, అధికార సంఘాలు నాలుగో తరగతి నుంచి జూనియర్‌ అసిస్టెంటు స్థాయి వరకు పోస్టులను జిల్లా, సీనియర్‌ అసిస్టెంటు స్థాయిలోని వారిని జోనల్‌, గెజిటెడ్‌ అధికారులను బహుళ జోన్‌ పోస్టులుగా వర్గీకరించాలని అభ్యర్థించాయి. వివిధ శాఖలు తమ పరిధిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా వర్గీకరించి ఆ జాబితాను ప్రభుత్వానికి ఇవ్వాలి. దానిపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి, ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుతం పోస్టుల విషయంలో సమతూకం లేదు. చిన్న జిల్లా అయిన ములుగు, పెద్ద జిల్లా అయిన వరంగల్‌కు ఒకే సంఖ్యలో ఉద్యోగులున్నారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి దీనిని ఖరారు చేయనుంది.
కొన్ని నెలల తర్వాతే అమలు
ఉద్యోగుల వర్గీకరణ, సంఖ్య ప్రక్రియ ఆమోదం త్వరితగతిన పొందినా.. ప్రస్తుతం నెలకొన్న కరోనా ఇతర పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలల తర్వాతే దీనిని అమలు చేసే వీలుంది.

సమస్యలకు పరిష్కారం
టీఎన్జీవో, టీజీవో నేతలు రాజేందర్‌, మమత

ఉద్యోగుల సమస్యలకు కొత్త జోనల్‌ విధానంతో పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవో, టీజీవోల అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌, మమత అభిప్రాయపడ్డారు. ‘‘కొత్త విధానం ద్వారా ఉద్యోగులకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఉద్యోగుల వర్గీకరణ, జిల్లాల్లో పోస్టుల సంఖ్య తేలిన తర్వాత పదోన్నతులతో పాటు ఖాళీలపైనా స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 50 వేల పోస్టులకు తోడు మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం లభిస్తుంది’’ అని తెలిపారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు