close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జిల్లాల్లో వణుకు

వారంలోనే రెట్టింపు నుంచి అయిదు రెట్లు పెరిగిన కరోనా కేసులు
 నిండిపోతున్న ఆసుపత్రులు

 పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ఈనాడు - హైదరాబాద్‌

   ఏప్రిల్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 975. ఇందులో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి మూడు జిల్లాలోనే 47.3 శాతం (461) కేసులు నమోదయ్యాయి. మిగిలిన 30 జిల్లాల్లో 52.7 శాతం (514) కేసులు నమోదయ్యాయి.
  ఏప్రిల్‌ 20న తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసులు 6,542. 19 రోజుల్లో కేసులు భారీగా పెరిగాయి. ఇందులో ఆ మూడు జిల్లాల్లో 30.58 శాతం (2,000) కేసులు నమోదు కాగా..  మిగిలిన 30 జిల్లాల్లో ఏకంగా 69.42 శాతం (4,542) నమోదయ్యాయి.
  19 రోజుల వ్యవధిలో 3 జిల్లాల్లో కేసులు సుమారు నాలుగు రెట్లు పెరిగితే.. మిగిలిన 30 జిల్లాల్లో పాజిటివ్‌ల పెరుగుదల తొమ్మిది రెట్లుంది.

 

కరోనా వైరస్‌ విజృంభణ జిల్లాలను హడలెత్తిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో స్వచ్ఛంద కట్టుబాట్లు విధిస్తున్నారు. కేసుల సంఖ్య పరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉంటున్నప్పటికీ.. మిగిలిన జిల్లాల్లో కొవిడ్‌ కేసులు వాయువేగంతో పెరుగుతున్నాయి. అత్యధిక జిల్లాల్లో గత వారం రోజుల్లోనే రెట్టింపు నుంచి అయిదింతలు పెరగడం గమనార్హం. కొన్ని ఉమ్మడి జిల్లాలు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో నమోదవుతున్న కేసులతో పోటీపడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రంగారెడ్డి(532), మేడ్చల్‌ మల్కాజిగిరి(570)ల కంటే అధికంగా 662 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 653 కేసులు నిర్ధారణ అయ్యాయి. తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లోనూ అదే తీరుగా పెరుగుదల కనిపిస్తోంది.  జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 14వ తేదీన 15 కేసులు నమోదవగా, 20న 48 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులు
జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పడకలు వేగంగా నిండిపోతున్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమించి వెంటిలేటర్‌ బెడ్‌పైకి తరలించాల్సి ఉన్నప్పటికీ సిలిండర్ల సరఫరాలో జాప్యంతో కొన్ని ఆసుపత్రుల్లో బాధితుల్ని ఆక్సిజన్‌ పడకలపైనే సర్దుబాటు చేస్తున్నారు. ఆక్సిజన్‌ సరఫరా తక్కువగా ఉండటంతో సిలిండర్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోగుల సంఖ్యకు అనుగుణంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో రోగులు బ్లాక్‌లో కొనుక్కోవడమో, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వెళ్లడమో చేస్తున్నారు. వైద్యసిబ్బంది సైతం కొవిడ్‌ బారిన పడుతుండటంతో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాల్సి వస్తోంది.
‘మహా’ రోగులే ఎక్కువ
నిజామాబాద్‌: మహారాష్ట్రలో కరోనా కల్లోలం, ఆసుపత్రుల్లో పడకలు దొరక్కపోవడంతో ఆ ప్రభావం నిజామాబాద్‌ జిల్లాపై పడుతోంది. ఇక్కడి ఆసుపత్రుల్లో ఎక్కువ మంది బాధితులు అక్కడివారే. 19 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తుండగా.. మరో 40-50 ఆసుపత్రులు అనుమతి కోసం దరఖాస్తు చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 405, ప్రైవేటులో 400 పడకలున్నాయి. మొత్తం పడకలను 2,100కి పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్‌కి నిత్యం 300 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా అవుతున్నాయి. రోగులు అధిక సంఖ్యలో ఉండటంతో హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. గతంలో మూడు ఏజెన్సీలు ఆసుపత్రులకే వచ్చి ఆక్సిజన్‌ నింపి వెళ్లేవి. ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందే ప్లాంట్లకు వెళ్లి నింపుకోవాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో రోగుల్ని ఆరేడు రోజులకే పంపిస్తూ.. హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నాయని సమాచారం. ఆ తర్వాత ఆ పడకలను కొత్త రోగులకు ఇస్తున్నారు.

పరీక్షించిన అయిదుగురిలో ఒకరికి..
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ విజృంభిస్తోంది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజుకు 200 మంది కరోనా బారిన పడుతున్నారు. 15 రోజుల క్రితం 23 పాజిటివ్‌లు నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 364కి పెరిగింది. ఖమ్మం జిల్లాలో పరీక్షలు చేసిన ప్రతి వెయ్యి మందిలో 200 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. వైద్యసిబ్బందీ కరోనా బారిన పడుతున్నారు.
ఏప్రిల్‌లో అత్యధికంగా
మెదక్‌: కరోనా తీవ్రంగా ఉంది. మెదక్‌లో ఇప్పటివరకు అత్యధిక కేసులు ఏప్రిల్‌లో 2,870 నమోదయ్యాయి. సిద్దిపేటలో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని బాధితులు చికిత్స నిమిత్తం ఎక్కువగా హైదరాబాద్‌కు వెళ్తున్నారు. సంగారెడ్డి ఆసుపత్రిలో 100 పడకలు ఉండగా.. 58 మంది సేవలు పొందుతున్నారు.
వైద్యుల కొరత
వరంగల్‌: ఉమ్మడి జిల్లాలో బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలతో పాటు కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి, ఛత్తీస్‌గఢ్‌ నుంచి సైతం వరంగల్‌ ఎంజీఎంకు కొవిడ్‌ రోగులు వస్తున్నారు. 440 కొవిడ్‌ పడకలున్న ఎంజీఎం ఆసుపత్రిలో ఈ నెల 2న 22న మంది రోగులుండగా.. 20 నాటికి ఆ సంఖ్య 190కి పెరిగింది. కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో వైద్యుల కొరత ఉంది. ప్రొఫెసర్లు ఇలా వచ్చి అలా వెళుతుండటంతో పీజీ వైద్యులు, హౌస్‌సర్జన్లపై, నర్సులపై పని ఒత్తిడి ఉంది.
అందరికీ ఒకే వార్డు
ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన రిమ్స్‌ ఆసుపత్రిలో పల్మనాలజిస్ట్‌, మత్తువైద్యుడు లేకపోవడంతో సాధారణ వైద్యులే ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. అనుమానితులు, నిర్ధారణ అయినవారికి, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి గతంలో వేర్వేరు వార్డులుండేవి. ఇప్పుడు ఒకే వార్డు ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
‘సాగర్‌’లో వైరస్‌ వ్యాప్తి
నల్గొండ: జిల్లాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. బాధితులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్తున్నారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల ప్రచారం ప్రభావంతో కొవిడ్‌ వ్యాప్తి బాగా జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోనే ఏప్రిల్‌లో 700 మందికిపైగా కొవిడ్‌ బారిన పడ్డారు. యాదాద్రి జిల్లాలో రోజుకు 200-250 కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో యాదాద్రి జిల్లాలో 3,200, నల్గొండ జిల్లాలో 3,600 కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న కేసులు
మహబూబ్‌నగర్‌: జిల్లాలో రోగుల సంఖ్య పెరుగుతోంది. మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో 240 పడకలున్నాయి. తొలివారంలో 10-15 మంది రోగులు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 82కి పెరిగింది. ప్రస్తుతానికి ఆక్సిజన్‌, పడకల ఇబ్బంది లేదు. ఆరోగ్యం విషమిస్తున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉంది.


 

కొన్ని గ్రామాల్లో 30-40 మంది బాధితులు

కరీంనగర్‌: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉపాధి రీత్యా మహారాష్ట్రకు రాకపోకలతో జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దాదాపు 30-40 మంది బాధితులున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ఆపై చనిపోయిన ఘటనలు వారంలో మూడు చోటుచేసుకున్నాయి. మార్చి ఆఖరి వారంలో రోజుకు 60-70 కేసులు నమోదు కాగా.. క్షేత్రస్థాయి లెక్కలమేరకు ప్రస్తుతం 500-700 నమోదవుతున్నాయి. ఇటీవల ఒక్కరోజేే 920 కేసులు రావడం గమనార్హం.
* ఇబ్రహీంపట్నం మండలంలో 20 రోజుల్లోనే 372 కేసులు నమోదయ్యాయి. దీంతో 12 గ్రామాల్లో స్వచ్ఛంద కట్టుబాటుతో లాక్‌డౌన్‌ విధించారు. పక్క గ్రామాల నుంచి తమ ఊర్లోకి రానివ్వట్లేదు. జగిత్యాల జిల్లాల్లో మొత్తం 80కి పైగా గ్రామాల్లో ఇలా లాక్‌డౌన్‌ విధించారు.
* కరీంనగర్‌ నగరంలో మార్చిలో రోజుకు 7-8 కేసులు నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 100పైనే ఉంది. పరిస్థితి విషమించిన రోగుల్ని ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 180 పడకలున్నాయి. మార్చి ఆఖర్లో 36 మంది రోగులుండగా ఇప్పుడు 136కు పెరిగారు. కొత్తగా 109 పడకలు పెంచుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేవు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఉంది. సిలిండర్‌ ధర గతంలో రూ.300 ఉండగా.. ఇప్పుడు రూ.వెయ్యికిపైగా పెట్టినా దొరకట్లేదు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు