ప్రాణవాయువు అందక 24 మంది మృతి

ప్రధానాంశాలు

ప్రాణవాయువు అందక 24 మంది మృతి

నాసిక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకు లీక్‌..
సరఫరా నిలిచిపోయి కొవిడ్‌ బాధితుల బలి
ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 150 మంది రోగులు

నాసిక్‌/ముంబయి: కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ ఇదో దారుణ సంఘటన. ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్‌ అందక 24 నిండు జీవితాలు గాలిలో కలిసిపోయాయి. స్వస్థతనివ్వాల్సిన ఆసుపత్రే వారికి బలిపీఠమైంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న జకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. ఆసుపత్రి ఆవరణలోని స్టోరేజీ ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ లీకైంది. తత్ఫలితంగా ప్రధాన స్టోరేజీ ట్యాంకు పనితీరు దెబ్బతిని.. కొవిడ్‌ రోగులకు అందాల్సిన అక్సిజన్‌ సరఫరా హఠాత్తుగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆసుపత్రిలో 150 మంది వరకు రోగులున్నారు. వీరిలో 23 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. మిగతా వారికి సాధారణ రూపంలో ఆక్సిజన్‌ అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్‌ రోగులకు సరఫరా నిలిచిపోవడంతో.. వారికి శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయి.. ప్రాణాలు విడిచారు.
ఆక్సిజన్‌ నింపుతున్నప్పుడు జరిగిందా?
ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకుకు ఉన్న సాకెట్‌ విరిగిపోయి వాల్వ్‌ నుంచి లీకేజీ మొదలైందనేది ఓ వాదన. అప్పుడే బయటి నుంచి వచ్చిన ఓ ట్యాంకర్‌ నుంచి నిల్వ ట్యాంకులోకి ఆక్సిజన్‌ను నింపుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. లీకేజీ విషయాన్ని 12.30 గంటల సమయంలో సిబ్బంది గుర్తించారు.  బయటి నుంచి వచ్చిన ట్యాంకర్‌ సిబ్బందితో పాటు, ఆసుపత్రిలోని సాంకేతిక సిబ్బంది కలిసి..ట్యాంకు వాల్వ్‌ను మూసేయడంతో మరింత లీకేజీ ముప్పుతప్పింది. కొందరు రోగుల్ని మరో చోటికి మార్చారు.నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న డ్యూరా సిలిండర్లను తెప్పించి కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తొలుత మరణించిన 22 మందిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయారు. వీరిద్దరి మరణాలకు ఆక్సిజన్‌ లీకేజీతో సంబంధం లేదని అధికార వర్గాలు అంటున్నాయి.

 సాధారణ స్థితికి వచ్చింది
ఆక్సిజన్‌ స్టోరేజీ ట్యాంకు నిర్వహణ బాధ్యతల్ని ఓ ప్రైవేటు కంపెనీ చూస్తోందని జిల్లా కలెక్టర్‌ సూరజ్‌ మంధారే తెలిపారు. ప్రస్తుతం లీకేజీని అదుపుచేశామని, ట్యాంకుకు మరమ్మతులు చేయించామని, ఆక్సిజన్‌ సరఫరా సాధారణ స్థితికి వచ్చిందని డివిజనల్‌ రెవెన్యూ కమిషనర్‌ రాధాకృష్ణ గమే తెలిపారు. స్టోరేజీ ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ లీకవుతున్న వీడియో ఉదయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. రోగుల బంధువులు, సమీప ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున ఆసుపత్రి వార్డుల్లోకి వచ్చారు. ఘటనకు కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండుచేశారు. ఆ సమయంలో బాధితుల బంధువుల రోదనలు ఆసుపత్రి ఆవరణలో మిన్నంటాయి. పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రూ.5 లక్షల పరిహారం
మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రూ.5 లక్షల వంతున పరిహారం ప్రకటించారు. మృతులందరూ కొవిడ్‌ బాధితులేనని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రమేష్‌ టోప్‌ తెలిపారు. ట్యాంకులో నిల్వచేసిన ద్రవరూప ఆక్సిజన్‌ మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కలిగి ఉందని, ట్యాంకు గోడలపై విపరీతమైన ఒత్తిడి ఉందని, ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకులో 25 శాతం వరకు ఆక్సిజన్‌ ఉందని ఆయన వివరించారు. లీకేజీ వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉందా? అనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.


ఘటనపై దిగ్భ్రాంతి

ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. నాసిక్‌ ఆసుపత్రి ఘటన తన హృదయాన్ని ద్రవింపజేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఈ సంక్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన వారిలో హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని