close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్రం పక్షపాతం

టీకాలు, రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ సరఫరాలో నిర్లక్ష్యం
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానమేంటి?
మాకెన్ని ఇచ్చారు? గుజరాత్‌కు ఎన్ని పంపారు?
వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ నిరసన
శవాల మీద పేలాలు ఏరవద్దని ప్రైవేటు ఆసుపత్రులకు హితవు

రాజకీయాలను పక్కన పెట్టి మాకు ఇంజక్షన్లు కేటాయించాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాస్తున్నాం. మా దగ్గర తయారైన ఇంజక్షన్లు, టీకాలు మేమే వాడుకుంటాం అని చెప్పవచ్చు.. కాని మేం సంకుచితంగా లేం.

- ఈటల రాజేందర్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా టీకాల పంపిణీతో పాటు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌, ఆక్సిజన్‌ సరఫరా విషయంలోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. గుజరాత్‌తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని అన్నారు. రాష్ట్రానికి 4 లక్షల ఇంజక్షన్లు అడిగితే గత 10 రోజుల్లో ఇచ్చింది 21,551 మాత్రమేనన్నారు. కేంద్రం కరోనా టీకా లాగే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను తమ అధీనంలో ఉంచుకోవడం బాధాకరమని అన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ సమర్థంగా పని చేస్తోందన్నారు. రోగుల చికిత్సలో కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘‘రెమ్‌డెసివిర్‌ పంపిణీలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. అవి మన దగ్గరే తయారవుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువ డోసులు వస్తాయని ఆశించాం. కాని మొత్తం పంపిణీ వ్యవస్థను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకొని మనకు మొండిచేయి చూపించింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ రోగులు ఎక్కువమంది వచ్చి చేరుతున్నారు అని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు చెప్పినా కూడా స్పందన లేదు. తెలంగాణకు 21 వేలు ఇచ్చిన కేంద్రం గుజరాత్‌కు 1.63 లక్షలు, మహారాష్ట్రకు 2 లక్షలు, దిల్లీకి 61 వేలు, మధ్యప్రదేశ్‌కు 92 వేల ఇంజక్షన్లు ఇచ్చింది. కేంద్రం చూపిస్తున్న ఈ వివక్ష పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుపోకుండా ఇలా చేయడం బాధ కలిగిస్తోంది.
మేమూ వాళ్లలాగే ఉంటే?
రాష్ట్రంలో రోజుకు 384 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరముంటే.. సరిపడా ఇవ్వడం లేదు. కేంద్రం తమిళనాడు నుంచి 30 మెట్రిక్‌ టన్నులు కేటాయించింది. కాని ఆ రాష్ట్రం ఒక్క టన్ను కూడా ఇచ్చేది లేదంటోంది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విషయంలో వాళ్లలాగే మేమూ వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదు. బ్లాక్‌ చేస్తే కఠిన చర్యలుంటాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తి, నిల్వలు, సరఫరాపై ఐఏఎస్‌ అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ప్రైవేటు ఆసుపత్రులు బాధ్యతగా వ్యవహరించాలి
కరోనా రోగుల చికిత్సల విషయంలో కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల వాళ్లు డబ్బులు కట్టలేనివారిని చివరి దశలో గాంధీకి పంపిస్తున్నారు. ఇలా ఈ సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునేలా వ్యవహరించవద్దు. చివరి క్షణాల్లో గాంధీకి పంపడం వల్ల అక్కడ వెంటిలేటర్లకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రస్తుతం 600 మంది వెంటిలేటర్‌ మీద, ఆక్సిజన్‌ మీద ఉన్నారు. తెలంగాణలో కరోనాకు చికిత్స పొందుతున్న వారిలో ఇతర రాష్ట్రాల వారే 60 నుంచి 70 శాతంమంది ఉన్నారు. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మన రాష్ట్రానికి చెందిన వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
అవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి
కరోనా వైరస్‌ చాలా తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజుల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. పరిస్థితి ముదరకముందే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రజలు అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మి ఎవరూ భయాందోళనకు గురికావద్దు’’ అని ఈటల సూచించారు.


మన మాట వింటే కదా..

వాక్సిన్‌ ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమని తెలిసినప్పుడు ముందుగానే ఉత్పత్తి పెంచాల్సింది. కాని కేంద్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరించింది. మనం ఇచ్చిన సలహాలు సూచనలు పక్కన పెట్టింది. ముందే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అన్ని సంస్థలతో సమావేశమై టీకాల ఉత్పత్తి పెంచాలని కోరారు. కాని వాటిని కేంద్రం నియంత్రించింది. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, టీకాలు పంపిణీ చేయాలి. సమస్యను జటిలం చేయవద్దు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు