దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి

ప్రధానాంశాలు

దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి

కరోనా కట్టడికి జాతీయ ప్రణాళికను కేంద్రం రూపొందించాలి
లాక్‌డౌన్‌పై రాష్ట్రాల నిర్ణయమే మేలు
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో నెలకొన్న కరోనా కల్లోల స్థితిని సుప్రీంకోర్టు ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ (నేషనల్‌ ఎమర్జెన్సీ)తో పోల్చింది. ఆక్సిజన్‌, నిత్యావసర మందుల్ని సరైన రీతిలో సరఫరా చేయడానికి, కరోనా రోగులకు చికిత్స అందించడానికి ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో కరోనా పరిస్థితులపై కోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లు ఈ బెంచ్‌లో సభ్యులు. రోగులకు చికిత్సలో ఆక్సిజన్‌ అత్యవసరమైందని, దాంతో పాటు వైద్యం సరిగా అందక గందరగోళ స్థితిలో పలువురు వివిధ కోర్టులను ఆశ్రయిస్తున్నారని కోర్టు గుర్తుచేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అనుసరిస్తున్న విధానం, అమలు తీరుతెన్నుల్ని పరిశీలిస్తామని స్పష్టీకరించింది.
లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎవరిది?
కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధింపుపై హైకోర్టులకున్న న్యాయపరమైన అధికారాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కొవిడ్‌ సంబంధిత అంశాలపై 6 (దిల్లీ, ముంబయి, సిక్కిం, మధ్యప్రదేశ్‌, కోల్‌కతా, అలహాబాద్‌) హైకోర్టులు విచారణ చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో వివిధ ప్రాధాన్యాల వల్ల గందరగోళం ఏర్పడే పరిస్థితులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఒక గ్రూపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఒక హైకోర్టు భావిస్తే.. మరో హైకోర్టు ఇతరుల గురించి ఆలోచించొచ్చు. నాలుగు అంశాలను మేం తెలుసుకోగోరుతున్నాం. 1. ఆక్సిజన్‌ సరఫరా, 2. నిత్యావసర మందుల సరఫరా, 3. వ్యాక్సినేషన్‌కు అనుసరిస్తున్న విధానం, 4. లాక్‌డౌన్‌ విధింపు. ఈ నాలుగు అంశాలపై ఒక జాతీయ ప్రణాళిక ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రణాళిక కోసం కోర్టులను ఆశ్రయించిన వ్యక్తులతో పాటు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నాం. దీనిపై శుక్రవారం విచారణ జరుపుతాం. లాక్‌డౌన్‌ విధించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని, అది న్యాయవ్యవస్థ నిర్ణయం కారాదనేది మా అభిప్రాయం’’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఆక్సిజన్‌, నిత్యావసర మందుల సరఫరాకు ఒక సమన్వయీకృత యంత్రాంగం ఉండాలనేది తమ అభిప్రాయమంది. కేంద్రం రూపొందించే జాతీయ ప్రణాళికను హైకోర్టులకు సమర్పించవచ్చునని బెంచ్‌ పేర్కొంది. ఈ విచారణలో  సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేను కోర్టు సహాయకుడి(అమికస్‌ క్యూరీ)గా నియమించింది.
అంతటా అల్లకల్లోలం
దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారాన్ని తెరిచేందుకు అనుమతించాలని కోరుతూ వేదాంత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్మాగారాన్ని తెరిచేందుకు అనుమతిస్తే వేల టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి కొవిడ్‌ రోగులకు ఉచితంగానే అందిస్తామని కోర్టుకు వేదాంత నివేదించింది. కర్మాగారాన్ని తెరవాలన్న విజ్ఞప్తిని కోర్టు గతంలోనే తిరస్కరించిన విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చి.. అభ్యంతరం తెలిపింది. అయితే తమిళనాడు వాదనలపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీలాంటి పరిస్థితి ఉందని, పరిష్కారాలకు అడ్డుచెప్పొద్దని హితవు పలికింది. ప్లాంట్‌ తెరవడానికి సంబంధించి వేదాంత దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని