కాంగ్రెస్‌ కురువృద్ధుడు ఎమ్మెస్సార్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌ కురువృద్ధుడు ఎమ్మెస్సార్‌ కన్నుమూత

యువజన నేత నుంచి ఏఐసీసీ స్థాయికి
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర
కరోనా బారిన పడి తుదిశ్వాస
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఈనాడు, హైదరాబాద్‌, కరీంనగర్‌: రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.సత్యనారాయణరావు (88) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. మూడు రోజుల క్రితం కరోనాతో నిమ్స్‌లో చేరిన ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 22న ఎమ్మెస్సార్‌కు కరోనా నిర్ధారణ కాగా మూడు రోజులు ఇంట్లోనే చికిత్స పొందారు. అనంతరం ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో 25న నిమ్స్‌లో చేరి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య సుగుణ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంత్రిగా ఆయన పనిచేశారు. దివంగత ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సహా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ ఎమ్మెస్సార్‌కు అనుబంధం ఉంది. ముక్కుసూటిగా మాట్లాడే ఎమ్మెస్సార్‌ వార్తల్లో సంచలన వ్యక్తిగా గుర్తింపుపొందారు. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ నిమ్స్‌లో ఎమ్మెస్సార్‌కు నివాళి అర్పించారు. మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు భౌతికకాయానికి కాంగ్రెస్‌ జెండా కప్పి నివాళులు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, మల్లారెడ్డి అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు.

అంచెలంచెలుగా ఎదిగి..
విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అత్యున్నత పదవిని అందుకున్నారు. ఆయన పూర్తిపేరు మేనేని సత్యనారాయణరావు. కరీంనగర్‌ ఎంపీగా మూడు పర్యాయాలు గెలుపొందడంతో పాటు రాష్ట్రమంత్రిగా తనదైన ముద్ర వేశారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం, వెదిరె గ్రామంలో 1934 జనవరి 14న జన్మించిన ఎమ్మెస్సార్‌ కరీంనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయి. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన తర్వాత 1977, 1980లో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. ఉస్మానియా నుంచి న్యాయవాద పట్టా తీసుకున్న ఎమ్మెస్సార్‌ కరీంనగర్‌ న్యాయస్థానంలో వకీలుగా, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సేవల్ని అందించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహిత నాయకుడిగా ఎదిగిన ఆయన కొన్నేళ్లపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా నిలిచారు. 14 ఏళ్లపాటు ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా, వైఎస్సార్‌ మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా తన సేవల్ని కొనసాగించారు. 1980 నుంచి మూడేళ్లపాటు ఇందిరాగాంధీ హయాంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఆరు రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990 నుంచి 1994 వరకు, తిరిగి 2007 నుంచి 2014 వరకు ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎక్కువకాలం పనిచేసి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వైఎస్‌ హయాంలో దేవాదాయ మంత్రిగా, క్రీడలు, సినిమాటోగ్రఫీ మంత్రిగానూ బాధ్యతల్ని చేపట్టారు.  
వెంకయ్యనాయుడు, రాహుల్‌ సంతాపం
రాజకీయాల్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉండే అతి తక్కువమంది నేతల్లో ఎమ్మెస్సార్‌  పేరు చిరస్థాయిగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఈ మేరకు ఆయన కుమారుడు రంగారావుకు లేఖ రాశారు. ఎమ్మెస్సార్‌ మృతికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పార్టీకి సేవలు అందించారన్నారు. ఈ మేరకు ఎమ్మెస్సార్‌ సతీమణి సుగుణకు లేఖ పంపారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు.
ముక్కుసూటి మనిషి.. కేసీఆర్‌  
ఎమ్మెస్సార్‌ తెలంగాణవాదిగా, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు సంతాపం తెలిపారు.
ఉత్తమ్‌, మాణికం ఠాగూర్‌, భట్టి సహా పలువురు నివాళి
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఎం.సత్యనారాయణరావు అకాల మరణం పట్ల తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వీహెచ్‌, పొన్నాల, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. నాయకులు కుసుమకుమార్‌, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, కోదండరెడ్డి, నిరంజన్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని అన్నారు.
భాజపా నేతలు...
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్‌ ఇతర నేతలు, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణతో పాటు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.
జగన్‌, చంద్రబాబు...
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతిపట్ల ఏపీ సీఎం జగన్‌ విచారం వ్యక్తంచేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతాపం ప్రకటించారు.


ముక్కుసూటితనంతో..

ముక్కుసూటి నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెస్సార్‌ తన మాటతీరుతోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. చమత్కారంతోపాటు ప్రత్యేక శైలితో ఉండే ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేవి. పార్టీలోని వ్యవహారాలను, నాయకుల వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఆయనది ప్రత్యేక శైలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో మాటల యుద్ధం రాజకీయ సంచలనాన్ని రేకెత్తించింది. 2006లో కరీంనగర్‌ ఎంపీగా ఉన్న కేసీఆర్‌ను రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ ఎమ్మెస్సార్‌ సవాల్‌ విసరడం.. కేసీఆర్‌ రాజీనామా చేసి కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డిపై ఎంపీగా గెలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా నిలిచింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని