కబ్జాలు కాదు.. కట్టుకథలు
close

ప్రధానాంశాలు

కబ్జాలు కాదు.. కట్టుకథలు

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపండి
ఎన్ని సంస్థలతోనైనా జరిపించవచ్చు
నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
పథకం ప్రకారమే దుష్ప్రచారం
నాకు అందరి చరిత్రలూ తెలుసు
మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తాను ఏ తప్పూ చేయలేదని, పథకం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. తనపై కక్ష కట్టి ప్రణాళికాబద్ధంగా కుట్రలను.. కట్టుకథలను మొదలుపెట్టారని, తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను తన కుటుంబం సంపాదించుకున్న గౌరవంలో విషం చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు అందరి చరిత్రలు తెలుసని వ్యాఖ్యానించారు. ఏసీబీతోనే కాదు.. సిట్టింగ్‌ జడ్జితో లేదా ఎన్ని సంస్థలుంటే అన్నింటితోనూ విచారణ జరిపించాలని, కబ్జా ఆరోపణలే కాదు.. మొత్తం తన చరిత్ర మీద ఎన్ని కమిటీలైనా వేసుకోండి అని అన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని అన్నారు.
తాను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తినని, ఆస్తులు, పదవులు, ఇతర చిల్లర విషయాలకు లొంగిపోనన్నారు. ఆత్మగౌరవం కన్నా పదవి ముఖ్యం కాదని తెలిపారు. అచ్చంపేట, హకీంపేటలలో తాను ఎవరి భూమినీ కబ్జా చేయలేదని చెప్పారు. అసలు అసైన్డ్‌ భూములు కొనకూడదనే విషయం తెలిసినా రైతులే స్వచ్ఛందంగా పిల్లల పెళ్లిళ్ల కోసం తనకు అమ్మారన్నారు. ఎకరాకు రూ. 6 లక్షలు చెల్లించి తాను కొన్నవి సాగులో లేనివని చెప్పారు. శుక్రవారం శామీర్‌పేటలోని తన నివాసంలో ఈటల విలేకరులతో మాట్లాడారు.
తొండలు గుడ్లు పెట్టని భూములవి
పౌల్ట్రీకి ఎక్కువ భూమి కావాలి. విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశా. అచ్చంపేట, హకీంపేట మారుమూల గ్రామాలు. సరైన రోడ్డు కూడా లేదు. అక్కడ వ్యవసాయ భూముల్లేవు, 1994 నుంచి సేద్యం జరగడం లేదు. అసైన్డ్‌ భూములైనందున రైతులు స్వచ్ఛందంగా సరెండర్‌ చేస్తే.. ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఇవ్వొచ్చని అధికారులు చెప్పారు. తొండలు కూడా గుడ్లు పెట్టని, రూపాయి అక్కరకు రాని భూములను రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడంతో ఎకరాకు రూ. 6 లక్షల చొప్పున 40 ఎకరాలు కొన్నాం. మళ్లీ 7 ఎకరాలు కొన్నాం. కెనరా బ్యాంక్‌ ద్వారా రూ.వంద కోట్ల రుణం తీసుకుని హ్యాచరీ అభివృద్ధి చేశాం. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పాం. షెడ్లు వేసే ముందు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావును కలిసి సలహాలు తీసుకున్నా.
ఈటల అంటే నిప్పు
నా చరిత్ర చెరిపేస్తే చెరగనిది. ఈటల అంటే నిప్పు. ఎక్కడా, ఎవరి దగ్గరా పది రూపాయలు కూడా తీసుకున్న పాపాన పోలేదు. నాతో పనులు చేయించుకున్న వారెవరి దగ్గరైనా విచారించుకోవచ్చు. నాపై ఈ ఆరోపణలు వస్తుంటే వాళ్లు ఏడుస్తున్నారు.. తమ గుండెలు గాయపడుతున్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను నయీం లాంటి వాడు బెదిరిస్తేనే బెదరలేదు. అందరి చరిత్ర నాకు తెలుసు.
స్కూటరుపై వచ్చి సంపాదించిందెవరు?
స్కూటర్‌పై వచ్చి వందల కోట్లు సంపాదించింది ఎవరు? వారిపై వేయండి విచారణ. ఒక్క సిట్టింగ్‌లోనే రూ. వందలు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు. నాకు చేతికి వాచీ- రేమండ్‌ గ్లాస్‌లు పెట్టుకునే అలవాటు లేదు. పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి, ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నది ఎవరి భూములో చెప్పా. నా దగ్గర ఏమీ లేనినాడే పోరాటం చేసిన వ్యక్తిని నేను. 2007లో రింగ్‌రోడ్డులో నా భూమి పోయింది. దీనిపై అప్పటి సీఎం వైఎస్‌తో కొట్లాడిన. కక్షపూరితంగా అలైన్‌మెంటు మార్చవద్దని సభాసంఘాన్ని వేయించిన. ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డను. కొన్ని వందల మంది జైళ్లకు పోతే కాపాడాను. అప్పుడు ఈ డబ్బులు ఎక్కడివని ఎవరూ అడగలేదు.
హైదరాబాద్‌లో ఇల్లే లేదు
కేసీఆర్‌ చెప్పడంతో బంజారాహిల్స్‌లో 2007లో రూ. 5 కోట్లతో 2,100 గజాల భూమి కొన్నా. దానిపై ఇంకా కిరికిరి నడుస్తోంది. ఇంకా ఇల్లు కట్టుకోలేదు. నేను ముదిరాజ్‌ బిడ్డను. భయపడే జాతి కాదు. చావనైనా చస్తాం కాని ఆత్మాభిమానాన్ని వదులుకోం. నేను బీసీని అయినా నా భార్య రెడ్డి. నా పిల్లలకు రెడ్డి అని ఆమె పెట్టుకుంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. నాకు అందరి చరిత్రలూ తెలుసు’’ అని ఈటల అన్నారు.
ఈటల సూటి వ్యాఖ్యలు
* నేను ఎప్పుడూ అక్రమాస్తులు సంపాదించలేదు. నాకున్న ఆస్తుల్లోనే కొన్ని అమ్మాను.
* రైతుల భూముల్లో ఏమీ షెడ్లు లేవు. ఉంటే కూలగొట్టవచ్చు.
* భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించడం కాలయాపనతో కూడుకున్నదని, రైతులను నేరుగా సంప్రదించి, భూములను సేకరిస్తే మంచిదని అధికారులు సూచించారు. అయితే ఈలోపు రైతులు వారే పనికిరాని ఆ భూములను ఏం చేసుకోలేకపోతున్నామని, వాటిని అమ్మి పిల్లల పెళ్లిళ్లు చేస్తామనడంతో నేను కొన్నాను.


నా క్యారెక్టర్‌ను దెబ్బ తీసే పథకం

‘‘నాపై ఇలాంటి ప్రచారం దుర్మార్గం. నా క్యారెక్టర్‌ను దెబ్బ తీసేందుకు పథకం వేశారు. నేను సంపాదించుకున్న గౌరవాన్ని, ప్రేమను మలినం చేసేలా విషం చిమ్మారు. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే దానిపై నన్ను అడగాలి. అలా కాకుండా తామే పరిశోధించినట్లు చేయడం నీతి బాహ్యం. దీనిని సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనవి.  నేను, నా భార్య జమున 1986లో హ్యాచరీలోకి అడుగుపెట్టాం. వరంగల్‌లో 1992లోనే హ్యాచరీ అభివృద్ధి చేశాం. అప్పుడే నాకు 50 కోళ్ల ఫారాలున్నాయి. 2004 కంటే ముందే నాకు 124 ఎకరాల భూములున్నాయి. 2016లో అతిపెద్దదైన హ్యాచరీ పెట్టాలని నిర్ణయించుకున్నాం.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని