close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయువు తీసిన వాయువు కొరత

కర్ణాటకలో ఒక్కరోజే 24 మంది మృతి

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్‌ అందక ఒక్కరోజే 24 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల మధ్యలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. చామరాజనగర జిల్లా ఆసుపత్రిలో 23 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో మరొకరు అసువులు బాశారు. శుక్రవారం నుంచి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని వైద్యులు చెబుతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ జిల్లాకు కనీసం 280 జంబో సిలిండర్లు కావాలని ప్రతిపాదనలు పంపినా అవి రాలేదు. మైసూరు నుంచి చామరాజనగరకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారానికి 60 సిలిండర్లు కావాలని చెప్పినా.. 30 మాత్రమే వచ్చాయని జిల్లా ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ సంజీవ్‌రెడ్డి తెలిపారు. ఈ ఆసుపత్రిలోని లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనిచేయకపోవటం, మైసూరు నుంచి సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవటంతో రోగులు ఇబ్బంది పడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో మరణ మృదంగం మోగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శివయోగి కళసద్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుచేశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ప్రతీక అని కాంగ్రెస్‌ జాతీయప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.
ఎక్కడా 100% ఇవ్వట్లేదు: ఆరోగ్య మంత్రి
అయితే.. గడచిన 24 గంటల్లో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేక మరణించింది ముగ్గురేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ ప్రకటించడంపై విపక్షం మండిపడింది. దేశమంతా ఎక్కడా వందశాతం ఆక్సిజన్‌ అందించే వ్యవస్థ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మైసూరులో ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉన్నందునే పొరుగు జిల్లాకు సరఫరా చేయలేదని చామరాజనగర జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సురేశ్‌కుమార్‌ అన్నారు.

హిందూపురంలో ముగ్గురి మృతి

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక హిందూపురం పట్టణానికి చెందిన ముబారక్‌ (63), అమరాపురానికి చెందిన మంజునాథ్‌ (39), మడకశిర మండలం పాపసానిపల్లికి చెందిన రమేష్‌ (42) మరణించినట్లు వారి బంధువులు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు