close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేసులు.. అరెస్టులకు భయపడను:Eetala

చావునైనా భరిస్తా.. ఆత్మగౌరవాన్ని వదులుకోను
కోర్టుకు వెళతా.. దోషిగా తేలితే శిక్ష అనుభవిస్తా
దేవాదాయ భూముల కబ్జాపై కాగితాలు చూపండి
19 ఏళ్లు తమ్ముడిని..  ఒక్కసారిగా దెయ్యాన్ని ఎలా అయ్యాను సీఎం గారూ?
విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌
ఈనాడు, హైదరాబాద్‌

‘‘మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి సీఎంగారూ. అవి గొప్పవి. మనుషులపై ఉక్కుపాదం మోపుతున్నపుడు మీకు గుర్తురావాలి కదా మేం ఎవరమో! మీకు, మాకు అనుబంధం ఏమిటో? అసెంబ్లీలో పేగులు తెగిపడేలా పోరాటం చేసింది.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపింది.. అమ్ముడు పోకుండా కొట్లాడింది.. ఇవన్నీ గుర్తుకు రావాలి కదా ముఖ్యమంత్రి గారూ?’’

- ఈటల రాజేందర్‌

‘అధికారం ఉందని ఏదంటే అది చేస్తే ప్రజలు హర్షించరు. కేసులు.. అరెస్టులకు భయపడే చిన్నవాడు కాదు ఈటల. చావునైనా భరిస్తాగానీ.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకునేది లేదు’ అని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. జైలుకైనా వెళ్తానుగాని లొంగేది లేదన్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అనంతరం సోమవారం ఈటల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘వేల ఎకరాల భూముల్ని కబ్జా పెట్టానని, ఎసైన్డ్‌, దేవాలయ భూములు ఆక్రమించిండని, పెద్ద కుంభకోణాలు చేసిండని ప్రజలు అసహ్యించుకునేలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్‌.. ఈటల రాజేందర్‌ అనే మామూలు మనిషి మీద తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ల్యాండ్‌, ఏసీబీ, ఫారెస్టు.. అధికారులను పంపి.. ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టటమనేది ఆయన గౌరవాన్ని, స్థాయిని పెంచదు. ప్రజల్ని మెప్పించదు. నా కుమారుడు చదువు పూర్తయ్యాక పౌల్ట్రీని విస్తరించాలంటే రూ. 100 కోట్ల రుణం తీసుకున్నా. నేను ఎసైన్డ్‌ భూములను కొన్నా, అందులో షెడ్లు కట్టుకున్నా శిక్షార్హుడిని. నాకు సంబంధం లేని భూములను ఫొటోలు తీసుకొని మీకు మీరే విచారణ జరుపుకున్నారు. అసైన్డ్‌ భూమి ఉందని కనీసం నోటీసు ఇచ్చారా? కలెక్టర్లు, ఐఏఎస్‌లు చట్టాన్ని మరచిపోయి బాస్‌ కాబట్టి మీరు ఏం చెబితే అది రాసుకోవచ్చు. వందలమంది పోలీసులను, అధికారులను పెట్టి భయానక వాతావరణాన్ని స్పష్టించి మేము, చుట్టుపక్కల వాళ్లు లేకుండా కొలవడం న్యాయ సమ్మతమా ముఖ్యమంత్రి గారూ?
వావివరసలు ఉండొద్దా?
ముఖ్యమంత్రిగా అధికారం ఉంది కదాని ఏదిబడితే అది చేస్తే ఎవరూ హర్షించరు. అసలు నా పేరు ఎట్లా పెడతారు? జమున హేచరీస్‌కు ఛైర్‌పర్సన్‌ జమున. మీ అధికారులకు వావి వరుసలు లేవు. జమున వైఫ్‌ ఆఫ్‌ నితిన్‌ అని రాస్తారా? ఇది ఆలోచన చేయండి సీఎం గారూ.. మీకు సంస్కృతి తెలుసు కదా? కోర్టుకు వెళతా. దోషిగా తేలిస్తే శిక్ష అనుభవిస్తా. మీరు కూడా వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. ఎన్నెన్ని గ్రామాలకు ఎసైన్డ్‌ భూముల నుంచి రోడ్లు వేయలేదు? సర్పంచి ఉదయం ఒక మాట చెప్పగా.. ప్రలోభపెట్టి మళ్లీ వేరేలా చెప్పించారు. ఆ ఒక్క సంఘటన చాలు వారికి నాపై ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది. మా పౌల్ట్రీకి 5 పైసల భూమి, రాయితీ తీసుకోలేదు.  వ్యవసాయ రంగం కిందకు వచ్చే పౌల్ట్రీకి ‘నాలా’ కన్వర్షన్‌ అక్కరలేదు. నేను నయీం గ్యాంగ్‌ చంపుతానని బెదిరించినప్పుడే భయపడలేదు. వైఎస్‌ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలో ఉన్నా. ఆయన్ను ఎంతమంది కలిశారో, సుప్రభాత దర్శనాలు ఎంతమంది చేశారో మీకు తెలుసు. మీ వెంట మిగిలే వారిలో రాజేందర్‌ ఒకడని మీకు తెలుసు.
6.20 ఎకరాలు కొనుక్కున్నా..  
దేవరయాంజల్‌కు 1992లో వచ్చా. 1995లో సర్వే నంబరు 57, 58లో 6.20 ఎకరాలు కొనుక్కున్నా. అవి దేవాలయ భూములు కావు. ఆ తర్వాత 1999లో 1400 ఎకరాలు దేవాలయ భూములన్నారు. వాటిని అమ్ముకోలేకపోతున్నాం.. బిడ్డల పెళ్లి చేసుకోలేకపోతున్నామని స్థానిక రైతులు చెప్పగా, అసెంబ్లీలో మాట్లాడా. వైఎస్‌ను కలవగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన చనిపోయారు. ఆపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు కూడా చెప్పా. తర్వాత సీఎం కేసీఆర్‌కు చెప్పా. మీరు 24 గంటల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు కాబట్టి నా కోసం కాకపోయినా రైతుల కోసమైనా వాటిని పరిష్కరించండి. నావి కబ్జా భూములైతే కాగితాలు చూపండి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నపుడు రైస్‌ మిల్లర్ల నుంచి సేకరించిన బియ్యంలో అవకతవకలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు చేశారు.
ఇలాంటి చర్యలకు లొంగను  
ఈటల రాజేందర్‌ ప్రేమకు లొంగుతాడు. ఇలాంటి చర్యలకు లొంగడు. కేసులు పెట్టి జైలుకు పంపితే పోతా. నా వ్యాపారాలన్నీ సీజ్‌ చేసినా సరే. నేను వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చా. మళ్లీ ఆ స్థాయికి పోతా. 1986లోనే నేను పెద్ద పౌల్ట్రీ రైతును. నేను కూర్చొన్న స్థలం రూ. లక్షకు కొన్నా. ఇప్పుడు రూ.కోట్లు అయింది. మీ ఫామ్‌హౌస్‌ భూములు రూ.లక్షలకే కదా కొన్నది.. ఇప్పుడు రూ.కోట్ల ఆస్తులంటే ఎలా? 14 సంవత్సరాలపాటు ఉద్యమంలో మీతో ఉన్నాం.. తమ్ముడిని అన్నారు కదా? ఇప్పుడు ఒక్కసారిగా దెయ్యాన్ని ఎలా అయ్యాను? నేనెప్పుడూ పార్టీ పెడతాననికాని, మారతానని కాని ఎక్కడా చెప్పలేదు. మీరు మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. కారు గుర్తుపై గెలిచావు.. రాజీనామా చేయాలి అనొచ్చు. తప్పకుండా చేయాలి. 20 ఏళ్లు నన్ను ఎత్తుకొని మోసిన హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను అడిగి నిర్ణయం తీసుకుంటా. మీ శిష్యగణంలో గులాబీ జెండాతో ఈ స్థాయికి ఎదిగింది మాత్రం వాస్తవం. అమ్ముడుపోయే క్యారెక్టర్‌ ఉన్నవాళ్లం కాదు కాబట్టి ఆనాడు మీతో ఉన్నాం.
మంత్రులుగా చూడకపోతిరి..
నా ఆస్తుల మీద సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరపండి. నేను ఎందుకు దూరమయ్యానో మీ అంతరాత్మకు తెలుసు. మంత్రులుగా చూడకపోతిరి.. మనుషులుగా చూడమని కోరుకున్నాం. మీ దగ్గర ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మగౌరవంతో గొప్పగా ఉన్నామని మనస్ఫూర్తిగా ఎవరూ అనరు. కాకపోతే నేను ముక్కుసూటి మనిషిని కాబట్టి చెప్పగలిగా. అంతమాత్రాన వ్యవస్థను పక్కనపెట్టి వేధిస్తారా? మీరు ఒక పని ఎత్తుకుంటే ఖతం అయ్యేదాకా వదలరు. అయినా చావునైనా భరిస్తా తప్ప.. నా ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోను. పదవుల కోసం పెదవులు మూసేవాడు కాదు ఈటల రాజేందర్‌. తెలంగాణ ప్రజలారా!.. ఆవేశాలకు లోను కావొద్దు’’ అని పేర్కొన్నారు.

అభిమానుల హడావుడి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామ పరిధిలోని ఈటల ఇంటి వద్ద సోమవారం అభిమానుల హడావుడి నెలకొంది. ఆయన ఏ నిర్ణయం ప్రకటిస్తారోనని ఎదురు చూశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. పలువురు న్యాయవాదులు ఈటలను కలిసి మంతనాలు జరిపారు. మధ్యాహ్నం భారీ వాహన శ్రేణితో బయలుదేరిన ఆయన రాత్రికి హుజూరాబాద్‌ చేరుకున్నారు. మార్గమధ్యంలో పలు గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఈటల అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ప్రేమకు, అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నానని, వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని అందుకే వారి అభిప్రాయాల్ని తెలుసుకుని తన కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు.

ఈటలకు భద్రత కుదింపు

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతో ఈటల రాజేందర్‌కు ఆ హోదాలోని భద్రతను తొలగించారు. క్యాబినెట్‌ మంత్రులందరికీ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐ.ఎస్‌.డబ్ల్యూ.) నుంచి రక్షణ కల్పిస్తారు. మంత్రికి 2+2 గన్‌మెన్లు ఉంటారు. బుల్లెట్‌పూఫ్ర్‌ వాహనాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ వింగ్‌ నుంచి డ్రైవర్‌ను ఇస్తారు. ఇంట్లో ప్రత్యేకంగా గార్డులను నియమిస్తారు. సందర్శకుల తనిఖీకి డోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తారు. గార్డుల్లో ఓ మహిళా ఉద్యోగి ఉంటారు. మంత్రి పర్యటనకు వెళితే పోలీస్‌స్టేషన్ల వారీగా పైలెట్‌ వాహనం ఏర్పాటు చేస్తారు. ఏదైనా జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ పర్యటన పూర్తయ్యే వరకూ ఎస్కార్ట్‌ సిబ్బంది మరో వాహనంలో అనుసరిస్తారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకడంతో ఇప్పుడు ఈ హంగులన్నీ తొలగించారు. శాసనసభ్యుడి హోదాలో కేవలం 1+1 గన్‌మెన్‌ను ఉంచుతారు. వాహనం, డ్రైవర్లను సొంతంగానే ఏర్పాటు చేసుకోవాలి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు