close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Elections: పురం... తెరాస పరం

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు.. అయిదు మున్సిపాలిటీల్లో జయభేరి
ఎదురు నిలవలేకపోయిన కాంగ్రెస్‌, భాజపా
ఈనాడు - హైదరాబాద్‌

వరంగల్‌ మహానగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకిరేకల్‌, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాల ఎన్నికల్లో ప్రజలు తెరాసను ఆదరించి అద్భుత విజయాలను అందించారు. ఈ ఎన్నికల్లో 74 శాతం స్థానాల్లో ప్రజలు పట్టం కట్టి...గులాబీ పార్టీ తమదని గొప్పగా చాటారు. ప్రభుత్వ పాలనను నిండు మనస్సుతో ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు.

-సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో జరిగిన మినీ పుర పోరులో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎన్నికలు జరిగిన రెండు నగర పాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాల్లో కారు జోరు కొనసాగించింది. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలను తెరాస గెలుచుకుంది. అన్నిచోట్లా తెరాస ఛైర్‌పర్సన్‌ స్థానాలను సొంతం చేసుకునేందుకు అవసరమైన పూర్తి మెజారిటీని సాధించింది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రికి పూర్తయింది. వరంగల్‌ నగరపాలక సంస్థ మినహా మరెక్కడా భాజపా రెండంకెల స్థానాలను పొందలేకపోయింది. కాంగ్రెస్‌ ఖమ్మం మినహా రెండంకెలకు చేరలేకపోయింది. సిద్దిపేట పురపాలక సంఘంలో కాంగ్రెస్‌ ఒక వార్డులోనూ గెలుపొందలేదు. నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలలో భాజపా బోణీ చేయలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికకు తెరాస దూరంగా ఉండగా భాజపాపై కాంగ్రెస్‌ నెగ్గింది. సిద్దిపేట, నకిరేకల్‌లలో తెరాస తిరుగుబాటు అభ్యర్థులు సత్తా చాటారు.
ఓరుగల్లులో కారు జోరు
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై గులాబీ జెండా రెండోసారి ఎగిరింది. 48 డివిజన్లలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. 2016లో ఒకే ఒక డివిజన్‌లో గెలిచిన భాజపా ఈసారి 10 డివిజన్లలో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో మాదిరే నాలుగు డివిజన్లతో సరిపెట్టుకుంది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున ఒకరు, మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఈ నలుగురిలో ముగ్గురు తెరాస తిరుగుబాటు అభ్యర్థులు కావడం గమనార్హం.
ఖమ్మంలో తెరాస విజయబావుటా
ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో వరుసగా రెండోసారి తెరాసనే విజయం వరించింది. ఒక డివిజన్‌ ఏకగ్రీవంతో బోణీ కొట్టిన అధికార పార్టీ.. మరో 42 గెలిచి సత్తా చాటింది. మిత్రపక్షం సీపీఐ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో తెరాస కూటమి ఖాతాలో మొత్తం 45 డివిజన్లు చేరాయి. తర్వాత కాంగ్రెస్‌ 10 స్థానాల్లో, దాని మిత్రపక్షం సీపీఎం రెండుచోట్ల గెలిచాయి. భాజపా ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. స్వతంత్రులు మరో రెండుచోట్ల గెలుపొందారు.కేవలం 11 ఓట్ల మెజారిటీతో 60వ డివిజన్‌ను కాంగ్రెస్‌ దక్కించుకుంది.

సిద్దిపేటలో గులాబీ గుబాళింపు
సిద్దిపేట పురపాలికలో తెరాస 36 స్థానాల్లో నెగ్గి తమ ఆధిపత్యాన్ని చాటింది. 43 వార్డులకు కాంగ్రెస్‌ 30 చోట్ల బరిలోకి దిగి ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. భాజపా 40 వార్డులలో పోటీ చేసి ఒకచోట మాత్రమే నెగ్గింది. ఎంఐఎం నాలుగుచోట్ల పోటీ చేసి ఒక వార్డులో గెలిచింది. తెరాస టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన తిరుగుబాటు అభ్యర్థులు నాలుగు వార్డుల్లో విజయం సాధించారు. ఎంఐఎం టికెట్‌ దక్కక.. స్వతంత్రఅభ్యర్థిగా పోటీచేసి ఒకరు గెలుపొందారు.  
జడ్చర్లలో కాంగ్రెస్‌, భాజపాలకు చెరో రెండు
జడ్చర్ల పురపాలక సంఘంలో 27 వార్డులకు గాను 23 వార్డులను దక్కించుకుని ఛైర్‌పర్సన్‌ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ 25 వార్డుల్లో పోటీ చేసి రెండింటిలో గెలిచింది. భాజపా 22 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా ఇద్దరు విజయం సాధించారు.
అచ్చంపేటలో కాంగ్రెస్‌కు ఆరు
అచ్చంపేట పురపాలక సంఘంలో 13 వార్డులను గెలుపొంది తెరాస ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ 20 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా ఆరు వార్డుల్లో నెగ్గారు. భాజపా 20 వార్డుల్లో పోటీ చేసి ఒకచోట నెగ్గింది.

కొత్తూరు తెరాసదే
కొత్తగా ఏర్పాటైన రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని తెరాస దక్కించుకుంది. మొత్తం 12 వార్డులకు గాను తెరాస ఏడింట నెగ్గింది. కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఐదు వార్డుల్లో గెలిచింది. భాజపా 12 వార్డుల్లో నిలబడినా ఒకచోట కూడా విజయం సాధించలేదు.
నకిరేకల్‌లో బోణీ చేయని భాజపా
నకిరేకల్‌ పురపాలికగా ఏర్పడిన అనంతరం తొలిసారి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ జయభేరి మోగించింది. 20 వార్డులకు తెరాస 11 దక్కించుకోగా ఆరు వార్డుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ రెండు వార్డుల్లో గెలుపొందగా ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. భాజపా ఒక స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. 20వ వార్డులో పోటీ చేసిన తెరాస అభ్యర్థి రాములమ్మ కేవలం 9 ఓట్ల తేడాతో గెలిచారు. ఒకటో వార్డులో స్వతంత్ర అభ్యర్థి భిక్షంరెడ్డి విజయం సాధించారు. ఈయనకు ఎన్నికలకు ముందు భాజపా మద్దతు ప్రకటించింది.

లింగోజిగూడ డివిజన్‌ ‘హస్త’గతం
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ను అనూహ్యంగా కాంగ్రెస్‌ దక్కించుకుంది. గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్‌ నుంచి నెగ్గిన భాజపా కార్పొరేటర్‌ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. తెరాస తమ అభ్యర్థిని బరిలో దించలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ బలం మూడుకు పెరిగింది. ఇంకా ఉప ఎన్నికలు జరిగిన గజ్వేల్‌ 12వ వార్డు, నల్గొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డులో తెరాస అభ్యర్థులు గెలుపొందగా పరకాల మున్సిపాలిటీ 9వ వార్డులో భాజపా గెలిచింది.

వరంగల్‌ను తీర్చిదిద్దుతా
‘ఖమ్మం’ను అభివృద్ధి చేస్తా
  అయిదు పురపాలికల అభ్యున్నతికి కృషి:  సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మినీ పురపోరులో మొత్తం 248 స్థానాలకు గాను 181 డివిజన్‌లు, వార్డుల్లో తెరాసను గెలిపించారని, తమ మిత్రపక్షం సీపీఐకి మూడు స్థానాలతో కలిపి మొత్తం 184 చోట్ల అభ్యర్థులకు విజయం కట్టబెట్టారన్నారు. మిగిలిన అయిదు పురపాలక సంఘాల అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్‌ ధన్యవాదాలు
మినీ పురపోరులో తెరాసను గెలిపించిన ప్రజలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో నగర, పురపాలక, జడ్పీ, మండల పరిషత్‌, సర్పంచి ఎన్నికల్లో తెరాస బలాన్ని చాటుకుందని, తాజా ఎన్నికల్లో అదే ఒరవడి సాగిందన్నారు. నగరపాలక సంస్థలు, పురపాలికల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం మునుపెన్నడూ లేని స్థాయిలో కృషి చేస్తోందని చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి ఇతర మంత్రులు పురపోరులో తెరాస విజయాలపై హర్షం వ్యక్తం చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు