close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గంటకు 10 మందికి అత్యవసర వైద్యం

ప్రభుత్వాసుపత్రుల్లో ఐసీయూ పడకల కొరత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మూడు రోజుల వ్యవధిలో కరోనా అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 720 మంది ఐసీయూలో చేరారు. అంటే గంటకు 10 మంది చొప్పున బాధితులకు ఐసీయూ పడకలు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ అత్యవసర కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు. రెండు రోజులుగా ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ 70 శాతానికి చేరింది. ఓ వైపు ప్రభుత్వం అదనపు పడకలు అందుబాటులోకి తీసుకువస్తున్నా అదే స్థాయిలో నిండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు కలిపి ఆక్యుపెన్సీ 67 శాతం దాటింది. రాష్ట్రంలో అత్యవసర వైద్యం అందించే ప్రధాన కరోనా ఆస్పత్రులైన గాంధీ, టిమ్స్‌లలో ఐసీయూ పడకలు ఖాళీగా లేవు. కొవిడ్‌ వైద్యానికి అనుమతించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోమవారం సాయంత్రానికి 480 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు లేకపోవడంతో గాంధీ, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు వెబ్‌సైట్‌లోనూ కనిపించడం లేదు. కొన్ని ఆస్పత్రులు గంటగంటకూ అప్‌డేట్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
మూడు రోజుల్లో 220 మంది
కొవిడ్‌ రెండో దశలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో బాధితుల ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. ఆక్సిజన్‌ పడకలపై వైద్యం సాధ్యం కాకుంటే ఐసీయూ పడకలపై చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు రోజుల వ్యవధిలో మరో 220 మంది ఐసీయూలో చేరారు. శనివారం నాటికి 700 పడకలు ఖాళీగా ఉంటే... సోమవారం సాయంత్రానికి 480కి తగ్గాయి. ఇందులో అత్యధికంగా ఉస్మానియా దవాఖానాలో 103 ఉన్నాయి. తరువాత వరంగల్‌ ఎంజీఎంలో 55, నల్గొండ ఆస్పత్రిలో 39, మహబూబ్‌నగర్‌లో 33, నిజామాబాద్‌లో 25, కరీంనగర్‌లో 21 ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకల భర్తీని పరిశీలిస్తే దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. గడిచిన మూడు రోజుల వ్యవధిలో 500 మంది ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఆ నాలుగు ఆసుపత్రుల్లోనే...
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 65 శాతానికి పైగా ఉంది. మూడ్రోజుల్లో ఆక్సిజన్‌ పడకలపై కొత్తగా 910 మంది చేరారు. గంటకు సగటున 12 మంది లెక్కన వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 2400 ఆక్సిజన్‌ పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గచ్చిబౌలి టిమ్స్‌లో 438, వరంగల్‌ ఎంజీఎం 313, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి 240, ప్రభుత్వ సూర్యాపేట ఆసుపత్రిలో 55 ఉన్నాయి. పడకల్లో వెయ్యి వరకు ఈ నాలుగు ఆసుపత్రుల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మినహా మిగతా వాటిలో పెద్దగా ఖాళీల్లేవు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 67 శాతానికి పైగా ఉంది.

కొత్తగా 5,695 కొవిడ్‌ కేసులు
మరో 49 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 5,695 కొవిడ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 4,56,485కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 49 మంది చనిపోగా, ఇప్పటివరకూ 2,417 మంది కన్నుమూశారు. తాజాగా 6,206 మంది చికిత్స పొంది కోలుకోగా, మొత్తంగా 3,73,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈనెల 2న(ఆదివారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో 80,135 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 58,742 నమూనాలను పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,31,18,856కు పెరిగింది. మరో 3,945 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,352 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 483, మేడ్చల్‌ మల్కాజిగిరి 427, వరంగల్‌ నగర 393, నిజామాబాద్‌ 258, సంగారెడ్డి 249, సిద్దిపేట 238, కరీంనగర్‌ 231, మహబూబ్‌నగర్‌ 221, జగిత్యాల 190, మంచిర్యాల 165, నాగర్‌కర్నూల్‌ 132, ఖమ్మం 121, మహబూబాబాద్‌ 119, వికారాబాద్‌ 109, భద్రాద్రి కొత్తగూడెం 108, వనపర్తిలో 101 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు