close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మృగరాజుకూ కరోనా!

హైదరాబాద్‌ జూలోని ఎనిమిది సింహాలకు వైరస్‌
దేశంలోనే తొలిసారిగా జంతువుల్లో నిర్ధారణ
సంరక్షణ సిబ్బంది నుంచి సోకి ఉంటుందని అనుమానం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెండో దశ రోజురోజుకు ఉద్ధృత రూపం దాలుస్తుండగా.. తాజాగా జూలో ఉన్న సింహాలకూ సోకడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఎనిమిది సింహాలకు వైరస్‌ ఉన్నట్లు మంగళవారం నిర్ధారణ అయింది. ఏప్రిల్‌ 24న జూలోని ఎనిమిది ఆసియా సింహాలు తేలికపాటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటాన్ని సిబ్బంది గమనించారు. లయన్‌ సఫారీ ఎన్‌క్లోజర్లలోని సింహాల ముక్కు నుంచి ద్రవంలా కారడం గమనించి.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించి నమూనాలను పరీక్షించాలని నిర్ణయించినట్లు జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌ సుభద్రాదేవి తెలిపారు. సెంట్రల్‌ జూ అథారిటీ మార్గదర్శకాల మేరకు సింహాల నాసిక, నోటి నుంచి లాలాజల నమూనాలు సేకరించి సీసీఎంబీలోని ‘అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ సంస్థ’ (లాకోన్స్‌)కు పరీక్షల నిమిత్తం పంపించినట్లు చెప్పారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సీసీఎంబీ మంగళవారం వెల్లడించింది.
ఎలా సోకిందంటే..
జంతు ప్రదర్శనశాలలోని సింహాలకు వాటిని సంరక్షించే సిబ్బంది నుంచి వైరస్‌ సోకి ఉంటుందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. సింహాలకు సోకిన వైరస్‌ను పరీక్షించగా.. కొత్త రకం వైరస్‌ ఏదీ బయటపడలేదన్నారు. ‘జంతువుల్లో కొవిడ్‌ వ్యాప్తి అనూహ్య పరిణామమే. ఇది కొత్త పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇది చాలా అవసరం కూడా’ అని సీసీఎంబీ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీఎం తివారీ అన్నారు. సింహాలకు జ్వరం రావడం, ముక్కు కారడం వంటి వైరస్‌ లక్షణాలు కనిపించగానే జంతు ప్రదర్శనశాలలోని ఇతర జంతువుల నుంచి వాటిని వేరుగా ఉంచి తగిన సంరక్షణ, అవసరమైన చికిత్స అందిస్తున్నామని జంతు ప్రదర్శనశాల డైరెక్టర్‌ డాక్టర్‌ కుక్రెట్టి తెలిపారు. వాటికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు. చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆహారం తీసుకుంటున్నాయని.. కోలుకుంటున్నాయని వివరించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు