close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అధికారులను అడ్డుకున్న హేచరీస్‌ సిబ్బంది

కోడిపిల్లలకు వైరస్‌ సోకుతుందని అభ్యంతరం
చివరకు కార్లలో కాకుండా ద్విచక్ర వాహనాలపై లోపలికి అనుమతి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట వద్ద ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌ కట్టడాల పరిశీలనకు వచ్చిన ఏసీబీ, సర్వే, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను సిబ్బంది అడ్డుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అధికారులు కార్లలో చేరుకోగానే గేటు వేసేశారు. లోనికి వెళ్లేందుకు పరిశ్రమ ప్రతినిధి అనుమతి కావాలని కాపలాదారులు చెప్పారు. విషయం తెలుసుకున్న జమున హేచరీస్‌ ప్రతినిధి రామానాయుడు వచ్చి అధికారులతో మాట్లాడారు. షెడ్లలో కోడిపిల్లలు ఉన్నాయని.. ఇంతమంది వెళ్లడం వల్ల వాటికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయనకు ఏసీబీ అధికారులతో పాటు వెల్దుర్తి మండల పంచాయతీ అధికారి తిరుపతిరెడ్డి, తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ సర్వే అధికారిణి లక్ష్మీసుజాత, అచ్చంపేట, హకీంపేట పంచాయతీ కార్యదర్శులు జానకిరాం, దేవేందర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారిని లోపలికి పంపించేందుకు పరిశ్రమకు చెందిన వ్యాన్‌ను తెప్పించారు. అందులో వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ద్విచక్ర వాహనాలపై లక్ష్మీసుజాత, జానకిరాం, దేవేందర్‌లను పరిశ్రమ లోపలికి పంపించారు. వారు సుమారు అర గంటపాటు కట్టడాలను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులందరూ అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. ఈ ఘటనపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. అనంతరం సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హకీంపేట పంచాయతీ పరిధిలో హేచరీస్‌ నిర్మించిన రెండు షెడ్ల కొలతలు తీసుకున్నారు.
బీసీ కనుకే ఈటలపై చర్యలు: జాజుల
కవాడిగూడ, న్యూస్‌టుడే: అగ్రవర్ణాలకు చెందిన నేతల భూ ఆక్రమణలపై పెదవి విప్పని సీఎం.. బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం అన్యాయమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దీనికి నిరసనగా మంగళవారం నగరంలోని బీసీ భవన్‌లో నేతలు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల అక్రమాలకు పాల్పడితే విచారణ తప్పుకాదని, అగ్రవర్ణాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్‌ అధ్యక్షుడు రాజేందర్‌, బీసీ యువజన సంఘం జాతీయ కన్వీనర్‌ విక్రంగౌడ్‌, బీసీ నాయకులు జాజుల లింగంగౌడ్‌, బండిగారి రాజు నిరసన దీక్షలో పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు