close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రైవేటు ఆసుపత్రులు టీకాలు కొనొచ్చు

45 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 45 ఏళ్లు పైబడినవారికి మొదటి, రెండో డోసు టీకాలు ఇవ్వడానికి అవసరమైన నిల్వలు కొనుగోలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. కొవిన్‌ పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకున్న 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలందించాలని పేర్కొంటూ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా కాకుండా అప్పటికప్పుడూ పేర్లను నమోదు చేసుకునే విధానం పాటించవద్దని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతానికి 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలు ఇవ్వాలని, 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాల పంపిణీపై త్వరలోనే స్పష్టమైన సమాచారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ (మే 3 నాటికి) 48,14,784 మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.
సాధారణ కొవిడ్‌ రోగులను చేర్చుకోవద్దు: డీహెచ్‌
కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో పడకల కొరతను నివారించేందుకు అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ కొవిడ్‌ రోగులను చేర్చుకోవద్దని డీహెచ్‌ ఆదేశించారు. స్వల్ప లక్షణాలుండి, గది వాతావరణంలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే ఎక్కువగా ఉన్నవారిని ఇంటి వద్దే చికిత్స పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇంటి వద్ద వసతి లేనివారిని ప్రభుత్వ, ప్రైవేటు ఐసొలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందాల్సిందిగా మార్గనిర్దేశం చేయాలన్నారు. కొవిడ్‌ చికిత్సల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను డీహెచ్‌ మంగళవారం విడుదల చేశారు. మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారిని మాత్రమే కొవిడ్‌ చికిత్సల కోసం ఆసుపత్రిలో చేర్చుకోవాలని.. ఇలాంటి బాధితులను చేర్చుకోవడానికి పాజిటివ్‌ రిపోర్టు కోసం వేచిచూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తమ ఆసుపత్రుల్లో రెగ్యులర్‌, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఖాళీగా ఉన్నాయనే తాజా సమాచారాన్ని ఆసుపత్రి ముందు భాగంలోనే కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు