అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ నిబంధన వద్దు
close

ప్రధానాంశాలు

అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ నిబంధన వద్దు

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రయోగశాలల(ల్యాబ్‌లు) సామర్థ్యం సరిపోవడం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. వీటిపై పని ఒత్తిడిని తగ్గించేందుకు మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్యవంతులు దేశీయంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించేటప్పుడు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధనను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. అలాగే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ (ర్యాట్‌) లేదా ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఒకసారి పాజిటివ్‌గా తేలిన వారికి మళ్లీమళ్లీ పరీక్షలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. ఎవరైనా కొవిడ్‌కు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యే సమయంలో వారికి కూడా తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జలుబు, దగ్గు లాంటి ఫ్లూ లక్షణాలున్న వారు అత్యవసరం కాని అంతర్రాష్ట్ర ప్రయాణాలను మానుకోవాలని, దానివల్ల ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తగ్గుతుందని సూచించింది. లక్షణాలు లేని వ్యక్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే కొవిడ్‌ నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేసింది. ‘జెమ్‌’ పోర్టల్‌లో ప్రస్తుతం మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ల్యాబ్‌ల ద్వారా ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని ఐసీఎంఆర్‌ సూచించింది.

15 లక్షల పరీక్షల వరకే సామర్థ్యం..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,506 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయని.. ఇవి మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేసినా రోజుకు 15 లక్షలకు మించి పరీక్షలు చేసేందుకు వీల్లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. అందుకే అనవసర పరీక్షలు తగ్గించడానికి కొత్త నిబంధనలు తెచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ల్యాబ్‌ల సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండటంతో పెరిగిపోతున్న కేసులకు తగ్గట్టు పరీక్షలు నిర్వహించడం పెనుసవాల్‌గా మారినట్లు పేర్కొంది.
‘ర్యాట్‌’ పెంచండి..
‘ర్యాట్‌’ విధానంలో ఫలితాలు 15-30 నిమిషాల్లోనే వస్తాయని, దీంతో పాజిటివ్‌ కేసులను వేగంగా కనిపెట్టడానికి వీలవుతుందని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఇప్పటికే 36 ‘ర్యాట్స్‌’కి ఆమోదముద్ర వేశామని, అందులో 10 జెమ్‌ పోర్టల్‌ ద్వారా లభిస్తున్నందున ప్రస్తుతం పెరిగిపోతున్న డిమాండ్‌ను అందుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలని సూచించింది.
కీలక సూచనలు..
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాట్‌ పరీక్షలను అనుమతించాలి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో వీలైన ప్రతిచోట ప్రత్యేక ‘ర్యాట్‌’ పరీక్ష బూత్‌లు ఏర్పాటు చేయాలి. ఇవి ‘24×7’ పనిచేసేలా చూడాలి. ఈ కేంద్రాల వద్ద రద్దీ పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ర్యాట్‌ పరీక్ష ధరలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ధారించాలి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహించాలి.
* ‘ర్యాట్‌’లో పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించొద్దు. పరిస్థితికి అనుగుణంగా వెంటనే ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించాలి. ఎవరికైనా నెగెటివ్‌ వచ్చి.. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ ప్రయోగశాలతో అనుసంధానం చేయాలి. అంతవరకు గృహ ఏకాంతవాసంలో ఉండి చికిత్స తీసుకోవాలని సూచించాలి.
* ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల్లో రాష్ట్రాలు గరిష్ఠస్థాయిలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలి. అన్ని ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాట్‌ పరీక్షల ఫలితాలు ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
* ఎవరికైనా జ్వరం (దగ్గు ఉన్నా లేకపోయినా), తలనొప్పి, గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, నీరసం, వాసన కోల్పోవం, డయేరియా లాంటి లక్షణాలు కనిపిస్తే వారిని అనుమానిత కొవిడ్‌ బాధితులుగానే పరిగణించాలి.
* కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నవారు వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా? అన్న సమాచారాన్ని ఆర్‌టీ-పీసీఆర్‌/ర్యాట్‌ శాంపిల్‌ రెఫరల్‌ ఫామ్‌లో తప్పక పొందుపరిచాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని