close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2 కోట్లు దాటిన కరోనా కేసులు

తాజాగా 3,57,229 మందికి వైరస్‌
3,449 మంది మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. గత 24 గంటల్లో నమోదైన 3,57,229 కేసులు సహా మొత్తం వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 2,02,82,833కు చేరింది. ఇందులో 1,66,13,292 (81.90%) మంది కోలుకోగా, 34,47,133 (16.99%) మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా 3,449 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది. దేశంలో తొలిసారి గత డిసెంబర్‌ 19న పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి దాటింది. ఇందుకు 325 రోజులు పట్టింది. అప్పటికి మరణాల రేటు 1.45%, రికవరీ రేటు 95.46%, క్రియాశీల కేసుల రేటు 3.08% మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కేవలం 136 రోజుల్లోనే మలి కోటి మైలురాయి దాటింది. అందులో 79.12% కేసులు గత 34 రోజుల్లోనే నమోదయ్యాయి. ఏప్రిల్‌ 1-మే4 మధ్యకాలంలో 81,33,498 కేసులు, 59,940 మరణాలు సంభవించాయి. అమెరికాలో ఇప్పటివరకు 3,32,30,992 కేసులు నమోదవగా, భారత్‌ అంతకంటే 38.96%మేర వెనుకన ఉంది.
 తగ్గని వైరస్‌ తీవ్రత
దేశంలో తాజాగా వరుసగా మూడోరోజూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈనెల 1వ తేదీన 4లక్షలకు చేరిన కేసులు ఆ మరుసటి రోజు నుంచి 2.36%, 6.2%, 2.96% మేర తగ్గుతూ వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం పరీక్షల సంఖ్యలో తగ్గుదల కనిపించడమే. ఏప్రిల్‌ చివరి నాలుగు రోజులతో పోలిస్తే, మే నెల మొదటి నాలుగు రోజుల్లో 2.15%మేర పరీక్షలు తగ్గాయి. అయితే కేసులు 4.83%, మరణాలు 6.5%మేర పెరిగాయి. పాజిటివిటీ రేటు 20.50% నుంచి 21.96కి చేరింది. దీన్నిబట్టి వైరస్‌ తీవ్రత తగ్గలేదని తెలుస్తోంది. దేశంలో ఆరు రాష్ట్రాల్లో పరీక్షలు రోజువారీగా తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు మాత్రం మూడు రాష్ట్రాల్లో మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 26వ తేదీ తర్వాత తొలిసారి కేసులు 48వేలకు పరిమితమయ్యాయి.
* ఈ నెల 3వ తేదీ వరకు 29,33,10,779 నమూనాలను పరీక్షించామని, ఒక్క సోమవారమే 16,63,742 పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి మంగళవారం తెలిపింది.
బిహార్‌లో 15వరకు లాక్‌డౌన్‌
పట్నా: విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా బిహార్‌ ప్రభుత్వం బుధవారం నుంచి ఈ నెల 15 వరకు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10% వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో మంగళవారం సంక్షోభ నిర్వహణ బృందం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రకటించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు