రేపే మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపే మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక

సభ్యుడికి కొవిడ్‌ ఉంటే  వీడియోకాల్‌లోనే ప్రమాణం, ఓటు
నోటిఫికేషన్‌ జారీచేసిన ఎస్‌ఈసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు నగరపాలక సంస్థల మేయర్లు, అయిదు పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. వరంగల్‌ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలికతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాలకు గత నెల 30న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (ఎస్‌ఈసీ) సి.పార్థసారథి బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం 3.30 గంటలకు మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు.
కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: ఎస్‌ఈసీ
సభ్యుల ప్రమాణ స్వీకారం, పరోక్ష ఎన్నిక నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పురపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం.. ప్రత్యేక సమావేశంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌గా నిర్ధారణ అయినవారై ఉండాలి. పాజిటివ్‌ నిర్ధారణ అయి, హోం క్వారంటైన్‌లో ఉన్న సభ్యుడు వీడియోకాల్‌ ద్వారా ప్రమాణం చేయడానికి, ఓటు వేయడానికి అనుమతించాలి. దీన్ని హాల్‌లోని ఇతర సభ్యులు గుర్తించడంతో పాటు ప్రిసైడింగ్‌ అధికారి మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేయాలి. ఎన్నిక అనంతరం ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు
పరోక్ష ఎన్నికలకు ఐఏఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించారు. వరంగల్‌కు రాష్ట్ర గెజిటీర్స్‌ కమిషనర్‌ జి.కిషన్‌, ఖమ్మంకు మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, అచ్చంపేటకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అదనపు డీజీ మహేశ్‌దత్తా ఎక్కా, సిద్దిపేటకు జీఏడీలోని ఐఏఎస్‌ అధికారి వాసం వెంకటేశ్వర్లు, నకిరేకల్‌కు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, జడ్చర్లకు పురపాలకశాఖ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి, కొత్తూరుకి గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ.శ్రీధర్‌ను నియమించారు.
పరోక్ష ఎన్నిక ఇలా
ఎన్నికైన సభ్యులతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పురపాలక సంఘాన్ని ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. చేతిని ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఓటు హక్కు ఉన్న సభ్యులు సగం, అంతకంటే ఎక్కువ మంది ఉంటే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. కోరం లేకుంటే ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి.. మరుసటి రోజు హాజరైన సభ్యులతో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు. మేయర్‌ ఎన్నిక తర్వాత డిప్యూటీ మేయర్‌, ఛైర్‌పర్సన్‌ ఎన్నిక తర్వాత డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు