Corona: 2 వారాల్లో మూడింతలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 2 వారాల్లో మూడింతలు

ఐసీయూల్లో పెరిగిన కొవిడ్‌ బాధితులు
పడకలు దొరకడం అసాధ్యంగా మారిన పరిస్థితులు
వైద్య కళాశాలల ఆసుపత్రుల్ని ఉపయోగిస్తే కొంత ఊరట

ఈనాడు హైదరాబాద్‌: అవసరాల మేరకు ఆసుపత్రుల్లో పడకలను పెంచుకుంటూ పోతుంటే దానికంటే ముందుగా కొవిడ్‌ పరుగులు తీస్తూ సర్కారుకు సవాలు విసురుతోంది. గత రెండు వారాల్లో ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూలో వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న పడకల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇంతకంటే వేగంగా ఈ రెండూ అవసరమైన కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఐసీయూలోకి వెళ్తున్న రోగుల సంఖ్య రెండువారాల్లో వేలల్లో దూసుకుపోతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా కొవిడ్‌ రోగులకు వైద్యం అందిస్తుండగా, ఇక్కడ ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న, వెంటిలేటర్‌ వసతి కలిగిన పడకలు ఎప్పుడూ నిండి ఉంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే లెక్కల్లో కూడా గాంధీని మినహాయించింది. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏప్రిల్‌ 20తో పోల్చితే మే ఐదో తేదీ సాయంత్రానికి ఆక్సిజన్‌ పడకల్లో, ఐసీయూల్లో కొవిడ్‌ బాధితులు 15,747 మంది పెరిగారు. మొదట్లో ఆ సంఖ్య 5,827 కాగా ఇప్పుడది 21,574గా ఉంది. రెండు వారాల్లో 300 శాతానికిపైగా చేరింది. అదే తేదీల్లో కేవలం ఐసీయూ వరకే తీసుకొన్నా బాధితుల సంఖ్య 2,119 నుంచి 8,041కి పెరిగింది. అంటే ఇక్కడ కూడా సుమారు 300 శాతం పైమాటే.

నిండిపోయిన పడకలు
హైదరాబాద్‌ మహానగర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. పరిస్థితి విషమించి ఎవరినైనా చేర్చాల్సి వస్తే పడక దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది. రెండువారాల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌లో గాంధీనే కాదు టిమ్స్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌, ఈఎస్‌ఐ, నిమ్స్‌, రైల్వే ఆసుపత్రి ఇలా అన్నింటిలోనూ పడకలు పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పడకలను కూడా వెంటిలేటర్‌ బెడ్లుగా మార్చడంతో కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ వెల్లడించింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్‌ వసతి ఉన్న ఐసీయూవి గణనీయంగా పెరిగాయి. అయినా నగరంలో పేరుగాంచిన ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే కాదు, మధ్యతరహా ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో లేవు.  
రాజధానిలో అక్కడక్కడ కొన్ని చిన్న ఆసుపత్రుల్లో ఖాళీలున్నా కరోనా బాధితుల ప్రాణభయాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకొని భారీగా దోచేస్తున్నాయి. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయన్న నమ్మకం లేకపోయినా అత్యవసరానికి ఏదో ఒకటి అని చేరే పరిస్థితి ఉంది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఆ బిల్లులకు తట్టుకోవడం కష్టంగా మారింది.

జిల్లాల్లో అధికంగా ఖాళీలు..
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కానీ ఆ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో అధిక సంఖ్యలో పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో 484 అందుబాటులో ఉన్నట్లు  వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ చెబుతోంది. దీని ప్రకారం ఆదిలాబాద్‌, ఉట్నూరు, భద్రాచలం, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ, ఆర్మూర్‌, నాగర్‌కర్నూల్‌, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట ఇలా అనేక చోట్ల ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ భాగం ఐసీయూ బెడ్లు రోగులతో నిండి ఉండటం గమనార్హం. ఇక్కడ ఐసీయూలకు అవసరమైన సిబ్బంది, ఇతర సదుపాయాలు లేకపోవడం సమస్యా లేదా వేరే కారణాలున్నాయా అన్నది వైద్యఆరోగ్య శాఖ దృష్టి సారించాల్సి ఉంది.
వైద్య కళాశాలల ఆసుపత్రుల్లోనూ బోలెడు...
ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో అధిక సంఖ్యలో ఆక్సిజన్‌ సౌకర్యం, వెంటిలేటర్‌ వసతి కలిగిన పడకలు ఉన్నాయి. అయితే వీటిని ఇప్పటివరకు వినియోగించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు వైద్యకళాశాలల ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కరోనాకు వినియోగించుకుంటామని చాలా రోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖ చెప్పినా ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఇక్కడ పీజీ వైద్య విద్యార్థులున్నారు. వారి సేవల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మొయినాబాద్‌లో ఉన్న ఓ ఆసుపత్రిలో 180 బెడ్లు ఉంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐసీయూలో 40 ఉన్నట్లు చూపిస్తున్నారు. సంగారెడ్డిలోని ఓ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో 500కు పైగా ఖాళీ ఉండగా, 58 ఐసీయూవి ఉన్నాయి.  ప్రైవేటు వైద్యకళాశాలల ఆసుపత్రులు 20కి పైగా ఉండగా అక్కడ వందల సంఖ్యలో ఉన్న ఐసీయూ బెడ్లను వినియోగించుకోగలిగితే కొంతైనా ఊరట లభిస్తుందనే అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు