భూమిపై కూలనున్న China రాకెట్‌?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భూమిపై కూలనున్న China రాకెట్‌?

నియంత్రణ కోల్పోయి దూసుకొస్తున్న శకలాలు

బీజింగ్‌: చైనా చేపట్టిన ఓ రాకెట్‌ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువుర్ని కలవరపాటుకు గురిచేస్తోంది! రాకెట్‌ శకలాలు జన సంచారమున్న ప్రాంతంలో పడే ముప్పుండటమే అందుకు కారణం. అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్‌ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. అయితే- ఆ రాకెట్‌ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శకలాలు దాదాపుగా ఈ నెల 8న భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైక్‌ హావర్డ్‌ తాజాగా వెల్లడించారు. దాని ప్రయాణ మార్గాన్ని తమ అంతరిక్ష కమాండ్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. భూ వాతావరణంలో రాకెట్‌ ఎక్కడ ప్రవేశిస్తుంది? అది ఎక్కడ కూలిపోతుంది? అనే విషయాల్ని ప్రస్తుతానికి కచ్చితత్వంతో చెప్పడం సాధ్యం కాదన్నారు. భూ వాతావరణాన్ని చేరడానికి కొన్ని గంటల ముందే వాటిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

జనావాసాలపై పడే ముప్పు స్వల్పమే
పుడమి వైపుగా దూసుకొస్తున్న చైనా రాకెట్‌కు సంబంధించిన శకలాలు చాలావరకు వాతావరణంలోనే భస్మమయ్యే అవకాశముంది. కానీ, ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ పరిమాణం (22 టన్నులు) మరీ ఎక్కువగా ఉండటంతో.. దాని పెద్దపెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోయే ముప్పుందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శకలాలు భూమిని తాకినప్పుడు.. చిన్నపాటి విమానం కూలిపోయినట్లు ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే అవి అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ నిపుణుడు జొనాథన్‌ మెక్‌డొవెల్‌ పేర్కొన్నారు. గత ఏడాది చైనా తొలిసారి ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ని ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమైన సంగతి గమనార్హం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు