కుటుంబాల్లో Corona కల్లోలం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబాల్లో Corona కల్లోలం

అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి

బోథ్‌, న్యూస్‌టుడే: కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలో కరోనా పంజాకు ఒకరి తర్వాత ఒకరు.. అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బోథ్‌లో ఈ నెల 1న కుటుంబ పెద్ద మెరుగు నర్సయ్య(65) బలికాగా, ఆయన చిన్న కుమారుడు మెరుగు చిన్ననర్సయ్య(34) నిర్మల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే నర్సయ్య భార్య మెరుగు లక్ష్మి(58) నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. చిన్ననర్సయ్య భార్య సైతం కరోనా బారిన పడి నిర్మల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఊపిరి అందట్లేదు.. నా భార్య జాగ్రత్త!
పెళ్లయిన అయిదు నెలలకే  యువకుడి విషాదాంతం

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: అయిదు నెలల క్రితమే మేనమామ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో ద్విచక్ర వాహనాల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం తన చెల్లికి వివాహం జరిపించేందుకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంతలోనే అతడిని కరోనా మహమ్మారి కాటేసింది. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ డివిజన్‌లో దినకర్‌యాదవ్‌(28) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం తన భార్యతో కలిసి ఎల్‌బీనగర్‌లోని అత్తారింటికి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఎక్కువ కావడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఆయాసంతోపాటు దగ్గు తీవ్రమవడంతో ఆక్సిమీటర్‌తో పరీక్షించుకోగా ప్రాణవాయువు శాతం క్రమంగా పడిపోతున్నట్లు గుర్తించాడు. సోమవారం ఉదయం కుటుంబీకులు కర్మాన్‌ఘాట్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ముంగళవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులతోనూ దినకర్‌యాదవ్‌ చరవాణిలో మాట్లాడాడు. ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లయిన అయిదు నెలలకే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

చిన్నారికి జన్మనిచ్చి..కన్నుమూసిన బాలింత

బ్బాక, న్యూస్‌టుడే- ఈనాడు, హైదరాబాద్‌:  కడుపులో బిడ్డను నవ మాసాలు మోసి.. భద్రంగా ఈ లోకానికి తీసుకొచ్చిన ఆ తల్లిని వైరస్‌ అనంత లోకాలకు తీసుకుపోయింది. జన్మనిచ్చిన బిడ్డను కన్నులారా చూడకముందే పచ్చి బాలింత అసువులు బాసిన హృదయ విదారక సంఘటన స్థానికులను కలచి వేసింది. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌ పీహెచ్‌సీ వైద్యురాలు భార్గవి తెలిపిన వివరాలు.. దుబ్బాక పట్టణానికి చెందిన దొమ్మాట ప్రత్యుష (21)కు నెలలు నిండిన సమయంలో ఆమెతో పాటు భర్త భరత్‌, మామయ్య రాజయ్యలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా వారంతా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ప్రసవ సమయం సమీపించటంతో తిమ్మాపూర్‌ వైద్యుల సూచన మేరకు మంగళవారం ప్రత్యూషను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె అర్ధరాత్రి బాబుకి జన్మనిచ్చింది. అనంతరం శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. కన్నబిడ్డను చూడకుండానే తల్లి మృతి చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. శిశువును నిలోఫర్‌లోని న్యూయోనాటల్‌ కేర్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: కరోనాతో తల్లిదండ్రులు మృతిచెందగా.. ఆ బాధను తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడు. శంకర్‌పల్లి మండలంలోని మాసానిగూడలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యాధికారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసానిగూడకు చెందిన విశ్వనాథం(58) కాంచన్‌బాగ్‌ బీడీఎల్‌లో ఉద్యోగి కాగా.. కుమారుడు అరుణ్‌కుమార్‌(33) బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. 15రోజుల క్రితం అరుణ్‌కుమార్‌కు పాజిటివ్‌ రాగా, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఇంటికి చేరుకున్నాడు. అరుణ్‌ కోసం ఆసుపత్రికి వచ్చి వెళ్లిన క్రమంలో తండ్రితో పాటు తల్లి రుక్మిణి(50)కీ కరోనా సోకింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. తల్లిదండ్రుల మరణవార్త తెలుసుకొని, ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఉన్న అరుణ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

మృత్యువుపై ఓడిన విశ్రాంత ఏఎస్పీ

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం బొక్కలగూడకు చెందిన విశ్రాంత ఏఎస్పీ, మాజీ జాతీయస్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడు అన్వర్‌ హుస్సేన్‌(61) కొవిడ్‌తో హైదరాబాద్‌లోని మహావీర్‌ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. సబ్‌-జూనియర్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో త్రిపుర జట్టుపై పసిడి పతకం సాధించిన మొట్టమొదటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా క్రీడాకారుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు