పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి Covid-19
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి Covid-19

24.80%కి చేరిన పాజిటివిటీ రేటు
తాజాగా 3,82,315 మందిలో వైరస్‌
3,780 మంది వైరస్‌కు బలి

ఈనాడు, దిల్లీ: దేశంలో పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కొవిడ్‌-19 సోకింది. గత 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 24.80% పాజిటివిటీ రేటు వచ్చింది. ఒక్కరోజులో 3,82,315 కేసులు నమోదవగా, 3,780 మరణాలు సంభవించాయి. ఈ నెల 2వ తేదీన గరిష్ఠంగా 3,689 మంది చనిపోగా ఇప్పుడు అంతకంటే 91 మంది అధికంగా కన్నుమూశారు. క్రితం రోజుతో పోలిస్తే 1,22,443 (7.35%) పరీక్షలు తగ్గాయి. అంతే సంఖ్యలో పరీక్షలు నిర్వహించి ఉంటే ఇప్పుడొచ్చిన పాజిటివిటీ రేటు ప్రకారం మరో 30వేల కేసులు పెరిగి ఉండేవి. మరోవైపు, మొత్తం కేసుల సంఖ్య 2,06,65,148కి, మొత్తం మరణాల సంఖ్య 2,26,188కి చేరింది. ఏప్రిల్‌ 30-మే 2 తేదీలతో పోలిస్తే మే3-5 తేదీల నాటికి 9,60,621 (17%) పరీక్షలు తగ్గాయి. దీనివల్ల కేసుల వృద్ధి మందగించినట్లు కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు భారీగా ఉన్న సమయంలో పరీక్షల సంఖ్యను తగ్గించడాన్ని వైద్యనిపుణులు తప్పుబడుతున్నారు. గత 24 గంటల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌లలో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 14 రోజుల్లో మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వృద్ధిచెందాయి. మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు 60వేల లోపు కేసులు నమోదవడం కొంత ఊరట కలిగించే అంశం. గత వారం రోజుల్లో దేశంలో సగటున 21.46% పాజిటివిటీ రేటు నమోదుకాగా, 16 రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ, 19 రాష్ట్రాల్లో అంతకంటే అధికంగా నమోదైంది. రాజస్థాన్‌లో ఏకంగా 62.34% పాజిటివిటీ రేటు రావడం అక్కడి ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో ఇదివరకు ఎన్నడూలేనన్ని మరణాలు సంభవించడం పరిస్థితుల తీవ్రతను చాటుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని