Lockdown ఉండదు: KCR
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown ఉండదు: KCR

దాని వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది
  ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది
  ప్రజలు ఆందోళన చెందవద్దు.. ఇంటికే కిట్లు పంపిస్తాం
 ఆక్సిజన్‌ సరఫరాకు 12 క్రయోజనిక్‌ ట్యాంకర్ల దిగుమతి
  వైద్యఆరోగ్యశాఖకు సత్వరమే నిధుల విడుదల
  సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి ·కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కూడా పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా మీద యుద్ధంలో భాగస్వాములు కావాలన్నారు. అందరం కలిసి కొట్లాడితేనే ఇది అంతమౌతుందని చెప్పారు. రెండోదశ కరోనా తీవ్రత మే 15 తర్వాత  తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయన్నారు. అయినా అశ్రద్ధ వద్దన్నారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా కొవిడ్‌ పరీక్షల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే మెడికల్‌ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. తక్షణమే 500 ఆక్సిజన్‌ వృద్ధి యంత్రాలను (ఎన్‌రిచర్లను) కొనుగోలు చేయాలన్నారు. వైద్యశాఖకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన ఆదేశించారు. కరోనా పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను సీఎం నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎంవో, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 9,500 ఆక్సిజన్‌ పడకలున్నాయి. హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో వారం రోజుల్లో మరో 500 పడకలు సమకూర్చాలి. మెరుగైన ఆక్సిజన్‌ సరఫరా కోసం ఒక్కో దానికి రూ.కోటి చొప్పున 12 క్రయోజనిక్‌ ట్యాంకర్లను కొనుగోలు చేసి.. చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, ప్రాథ]మిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 5,980 కరోనా అవుట్‌పేషెంటు కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలి. కరోనా రెండో దశలో 1.56 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1.30 లక్షల (85 శాతం) మంది కోలుకున్నారు. కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాలి. ఆరోగ్యశాఖ సంచాలకుడు బాధ్యత తీసుకోవాలి. పాజిటివ్‌ కేసులు, కోలుకున్న వారు, హోం క్వారెంటైన్‌లోని వారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనే వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తాం. నిధుల విడుదల బాధ్యతలను చూసేందుకు కూడా మరో ప్రత్యేక అధికారిని అందుబాటులో ఉంచుతాం. తక్కువ సమయంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి. మొదటిడోస్‌ టీకా వేసుకున్న వారు.. వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండోడోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయించి పరిసరాల పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలి’ అని సీఎం సూచించారు. సమీక్ష సందర్భంగా రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ లభ్యతపై సీఎం ఆరా తీశారు. రెమ్‌డెసివిర్‌ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడారు. వాటి ఉత్పత్తి, లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. ఐఐసీటీ సంచాలకుడు చంద్రశేఖర్‌తోనూ ఆక్సిజన్‌ అవసరాల గురించి ఫోన్లో మాట్లాడారు.

వైద్యఆరోగ్యశాఖకు అభినందనలు
కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని వైద్యఆరోగ్యసిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. వైద్యులు, నర్సులు,ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్పసేవ చేస్తున్నారని వారి కృషి, త్యాగం గొప్పదని కొనియాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి లు కూడా పాల్గొన్నారు.
 

అంతా ఆగమాగమవుతుంది

‘‘లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగం లేదు. రాష్ట్రంలో 25-30 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా మొదటిదశలో లాక్‌డౌన్‌ వల్ల వీరందరి జీవితాలు చెల్లాచెదురయ్యే పరిస్థితిని చూశాం. మరోసారి వీరంతా తమ ఊళ్లకు వెళ్లిపోతే తిరిగిరావడం కష్టం. రాష్ట్రంలో ధాన్యం పెద్దఎత్తున పండింది. గ్రామాల్లో 6,144 కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం నిండి ఉంది. ధాన్యం కొనుగోలు ఆషామాషీ కాదు. ఇందులో కిందినుంచి పైదాకా సంధాన వ్యవస్థ ఇమిడి ఉంటుంది. ఈ ప్రక్రియలో లక్షల మంది భాగస్వాములవుతారు. లాక్‌డౌన్‌ విధిస్తే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైసుమిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? ఎక్కడికిపోతారు? ఊళ్లకు వెళ్లే వలస కార్మికులను తిరిగి రప్పించడం ఎలా? కొనుగోలు చేయకపోతే ధాన్యాన్ని  రైతులు ఎక్కడ పెట్టుకుంటారు. మెత్తం ధాన్యం కొనుగోలు వ్యవస్థ ఎక్కడి కక్కడ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా ఉంటుంది. నిత్యావసర సరకుల దిగుమతికి ఆటంకం ఏర్పడుతుంది. అంతా ఆగమాగమవుతుంది.

పరిశ్రమలు మూతపడితే..
లాక్‌డౌన్‌లో పరిశ్రమలు అకస్మాత్తుగా మూతపడితే అంతా ఆగమాగం కాదా? క్యాబ్‌ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి ? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోతాయి. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. గొంతు పిసికినట్లు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మళ్లీ కోలుకోదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధిస్తే ప్రభుత్వమే భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. అందుకు సర్కారు సిద్ధంగా లేదు. లాక్‌డౌన్‌ లేకపోయినా కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి  మైక్రోలెవల్‌ కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తాం.  ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. గుంపులు గుంపులుగా తిరగొద్దు. పెళ్లిళ్లలో వందకు మించి జమ కావద్దు. పరిశుభ్రత పాటించాలి. శానిటైజర్లు వాడాలి. మాస్కులు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామరక్ష ’ అని సీఎం తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు