Covid Vaccine: మొదటి డోసు నిలిపివేత
close

ప్రధానాంశాలు

Covid Vaccine: మొదటి డోసు నిలిపివేత

ఇప్పుడు రెండో డోసు వారికే కరోనా టీకాలు
నేటి నుంచి వారు నేరుగా కేంద్రాలకు వెళ్లొచ్చు
ఈ నెల 15 వరకు స్లాట్లన్నీ రద్దు చేశాం
18-44 ఏళ్ల వారు మరికొంత కాలం ఓపిక పట్టాలి
డీహెచ్‌, డీఎంఈ విజ్ఞప్తి
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ టీకాలలో రెండో డోసు వారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిషీల్డ్‌ వేయించుకొని 6 వారాలు గడిచినవారికి.. కొవాగ్జిన్‌ తీసుకొని 4 వారాలు నిండినవారికి టీకాలను వేస్తారు. పరిస్థితి తీవ్రతను, టీకాల లభ్యతను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. శనివారం నుంచి రెండోడోసు టీకాలను పొందడానికి అర్హులైన వారందరూ స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా సమీపంలోని ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లవచ్చు. మొదటి డోసు వారికి ప్రస్తుతానికి టీకాల్లేవు. ‘‘ఈ నెల 15 వరకు ఎవరికీ స్లాట్‌ బుకింగ్‌ ఉండదు. తర్వాత అప్పటి పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తాం. మొదటి, రెండో డోసులకు సంబంధించి అన్ని స్లాట్‌ బుకింగ్‌లను రద్దు చేశాం. ఆ మేరకు బుక్‌ చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్‌లు పంపించాం. అయితే రెండో డోసు వారు మాత్రం స్లాట్‌ల రద్దుతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రానికి వచ్చి టీకా పొందవచ్చు’’ అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో పలు అంశాలను వివరించారు.

ఇప్పుడున్నవి రెండో డోసుకు కూడా సరిపోవు
‘‘రాష్ట్రంలో ఈనెల 31 నాటికి రెండో డోసు తీసుకోవాల్సిన వారు 19,92,257 మంది ఉన్నారు. ఇందులో కొవిషీల్డ్‌ పొందాల్సిన వారు 16,61,543 మంది కాగా, కొవాగ్జిన్‌ తీసుకోవాల్సిన వారు 3,30,714 మంది. కనీసం ఈనెల 15 నాటికి రెండోడోసు పొందాల్సిన వారి గణాంకాలను పరిశీలించినా.. 4,99,432 మందిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత టీకా నిల్వలు 3,74,900 డోసులు మాత్రమే ఉన్నాయి. అప్పటిదాకా రెండో డోసు వారికే టీకాలు ఇస్తారు. మొదటి డోసు వారికి ఇవ్వరు. ఈనెల 15 నాటికి మరో 3,11,000 టీకా డోసులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో మే నెలాఖరు వరకూ రెండో డోసు వారికే టీకాలు సరిపోని స్థితి నెలకొంది. ఇలాంటప్పుడు మొదటి డోసు టీకాల పంపిణీ సాధ్యం కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతానికి రెండో డోసు వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 2 లక్షల నుంచి 2.5 లక్షల డోసులు కేటాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధానమంత్రిని కోరారు. ఒకవేళ కేటాయింపులు పెంచితే అప్పుడు డోసుల లభ్యతను బట్టి అర్హులకు టీకాలను అందజేస్తాం. అప్పటి వరకూ 18-44 ఏళ్ల మధ్య వయస్కులు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడున్న కొవిన్‌ పోర్టల్‌లో ప్రత్యేకంగా రెండోడోసు వారు మాత్రమే నమోదు చేసుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. టీకాల కొనుగోలుకు ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.2,500 కోట్లను మజూరు చేసినా వ్యాక్సిన్‌ లభ్యత లేదు.

ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఆక్సిజన్‌ సౌకర్యం
అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 3,000కు పైగా ఆక్సిజన్‌ పడకలు రానున్నాయి. రాష్ట్రంలో 6 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే స్వయం ఉత్పత్తి ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాం. ఇవి మరో నెలలో అందుబాటులోకి రానున్నాయి. మరో 51 ఆక్సిజన్‌ జనరేటర్లను కూడా కేంద్రం కేటాయించింది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఆక్సిజన్‌ సౌకర్యం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం.   ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి మందుల కొరతా లేదు. మందుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ను అవసరాల మేరకే ఇవ్వాలి. అనవసరంగా ఇస్తే కొన్ని సార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి’’ అని ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్య సంచాలకులు పేర్కొన్నారు.

రెండో డోసు కోసం వెళ్లే వారు  వెంట తీసుకెళ్లాల్సినవి

* తొలిడోసు సందర్భంగా ఏదైతే గుర్తింపు కార్డును ఇచ్చారో.. అదే తీసుకెళ్లాలి.
* తొలిడోసు సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబరునే ఇప్పుడూ ఇవ్వాలి.
* మొదటి టీకా పొందినట్లుగా ఫోన్‌ నంబరుకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ చూపించినా సరిపోతుంది.
* తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని అయినా ఇవ్వవచ్చు.

3-4 వారాల్లో కేసులు తగ్గే అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి 1,247 ఆసుపత్రుల్లో కొవిడ్‌ ఓపీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో 1,41,714 మందిని పరీక్షించగా.. 19,099 మందిలో కొవిడ్‌ లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వారికి ఔషధాల కిట్‌ను అందించారు. క్షేత్ర స్థాయిలో 20,955 బృందాలు పర్యటిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకూ 11,22,369 ఇళ్లలో పరిశీలించారు. లక్షణాలున్న వారు కిట్‌లో ఇచ్చిన మందులు వాడాలి. అవసరం లేని వారు కూడా కిట్‌ను దగ్గర పెట్టుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కిట్‌లు మళ్లీ లభించవేమోననే ఆందోళన వద్దు. లక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయి. కిట్‌ ఇచ్చిన తర్వాత వైద్యసిబ్బంది 2 వారాల పాటు ఇంటి వద్ద రోగులను పరీక్షిస్తారు. అవసరమైతే 108 అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలిస్తారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారు 2 వారాల పాటు విడి గదిలో ఉండాలి. బయట తిరగొద్దు. తగినంత విశ్రాంతి, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. వచ్చే 3-4 వారాల్లో కేసులు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని