జొన్నలో సరికొత్త వంగడం
close

ప్రధానాంశాలు

జొన్నలో సరికొత్త వంగడం

తాండూరు పరిశోధన స్థానం పదిహేనేళ్ల కృషి ఫలితం
ఎస్వీటీ-68గా నామకరణం

తాండూరు, న్యూస్‌టుడే: పదిహేనేళ్ల కృషి తరువాతవికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జొన్నలో కొత్తగా తొలి వంగడాన్ని ఆవిష్కరించారు. నల్లరేగడి నేలల్లో సాగుకు  అనువైన ఈ వంగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాల్సి ఉందని వారంటున్నారు. జొన్నలో కొత్త వంగడాలను సృజించడానికి శాస్త్రవేత్తలు 2006 నుంచి కృషి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జొన్న విత్తనాలను క్రాసింగ్‌ చేశారు. ఇలా వేల కొద్దీ నమూనాలను బయటకు తీసి విత్తనాలను ఉత్పత్తి చేశారు. వీటి నుంచి నాణ్యమైన వాటిని సేకరించి పరిశోధన స్థానంలోనే సాగు చేశారు. ఇలా ఏడేళ్ల కృషి అనంతరం ఎంపిక చేసిన గింజలకు సార్గమ్‌ వెరైటీ తాండూరు-68 (ఎస్వీటీ-68)గా పేరు పెట్టారు. 2018 నుంచి 2019 మధ్య పాలెం, మధిర, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వేర్వేరుగా సాగు చేయగా.. దిగుబడులు ఒకేలా వచ్చాయి. 2019 నుంచి 2021 మధ్య యాసంగి సీజన్లలో ఎకరాకు 3 నుంచి 4 కిలోల వంతున విత్తనాలు విత్తారు. వీటితో పాటే సాధారణ విత్తనంగా ఉన్న ఎం-351 విత్తనాలు కూడా నాటారు. ఎస్వీటీ-68 వంగడాల నుంచి హెక్టారుకు 12.16 క్వింటాళ్ల అధిక దిగుబడులు రాగా.. ఎం35-1 వంగడాల నుంచి 10.79 క్వింటాళ్లు వచ్చినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో జొన్న పంట శాస్త్రవేత్త డాక్టర్‌ సుజాత మాట్లాడుతూ.. కొత్త జొన్న వంగడాన్ని రైతుల కోసం విడుదల చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దానికి ముందు విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నిపుణులు వంగడం తీరుపై విశ్లేషణ చేయాల్సి ఉందని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని