పోలీసుల అదుపులో పుట్ట మధు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల అదుపులో పుట్ట మధు

భీమవరంలో పట్టుకున్నట్లు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్‌ బృందం
వామన్‌రావు హత్య కేసులో విచారణ
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ అదృశ్యంపై వీడిన ఉత్కంఠ

ఈనాడు డిజిటల్‌- కరీంనగర్‌, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధును రామగుండం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పట్టుకున్నట్లు రామగుండం కమిషనరేట్‌ నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు చెబుతున్నారు. గత నెల 30న పుట్ట మధు అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికెళ్లారో నలుగురు గన్‌మెన్లకూ సమాచారం లేదని, భార్య పుట్ట శైలజ సహా ఎవరూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదని.. తమకు సమాచారం తెలియదని రామగుండం పోలీసులు చెబుతూ వచ్చారు. తాజాగా రామగుండం కమిషనరేట్‌ చేసిన ప్రకటనతో పుట్ట మధు అదృశ్యంపై ఉత్కంఠ వీడింది. వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు ఇదివరకే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహా పలువురిని అరెస్ట్‌ చేశారు. తాజాగా మధును అదుపులో తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రెండోసారి ఫిర్యాదుతోనే..
వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గత నెల 16వ తేదీన వరంగల్‌ రేంజ్‌ ఐజీకి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోలేదని అందులో పేర్కొన్నారు. హత్య జరిగిన రోజున రామగిరి పోలీసులు తన కూతురితో ఫిర్యాదు తీసుకుని, తనతో సంతకం పెట్టించుకున్నారని.. ఆ సమయంలో తాను తీవ్రమైన దుఃఖంలో ఉండి ఫిర్యాదులోని పేర్లను సరిగ్గా చూడలేదని ఆయన తెలిపారు. రాజకీయ కక్షతో పుట్ట మధు హత్య చేయించారని ఆరోపించారు.
ఆయన కాల్‌డేటాను సేకరించి, సమగ్ర విచారణ జరిపితే చాలామంది వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మధును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారని, దీనిపై ఆయనకు ముందస్తుగానే సమాచారం తెలియడంతో అదృశ్యమైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. గత నెల వరంగల్‌లో జరిగిన పుర ఎన్నికల ప్రచారంలో పుట్ట మధు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 30వ తేదీ సాయంత్రం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. గత నెల 30 నుంచి ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారని పోలీసులు ప్రాథమికంగా విచారించినట్లు తెలిసింది.

నిఘా పెట్టి.. తనిఖీలు చేపట్టి
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు ఆచూకీ కోసం ఈ నెల 6న రామగుండానికి చెందిన పోలీసు అధికారులు మూడు, నాలుగు బృందాలుగా భీమవరం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ నిఘా పెట్టడంతో పాటు పలు లాడ్జీల్లో తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఓ నిందితుడి కోసం ఇక్కడికి వచ్చామని స్థానిక పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. భీమవరంలో ఓ లాడ్జికి వెళ్లారని, ఆయనతో మరొకరు ఉన్నారని బృందాలు గుర్తించాయి. జువ్వలపాలెం రోడ్డులోని ఓ దుకాణంలో వస్త్రాల కొనుగోలుకు వెళ్లగా.. మధును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే తమ సర్కిళ్ల పరిధిలో గత రెండు రోజుల్లో అరెస్టులు జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని భీమవరం సీఐలు ఏకే కృష్ణభగవాన్‌, ఆర్‌.విజయకుమార్‌లు పేర్కొన్నారు.

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి
ఈనాడు, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పి.వి.నాగమణిల హత్య కేసు సత్వర విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కేసు సత్వర విచారణ నిమిత్తం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా పరిధిలో సెషన్స్‌ జడ్జి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని