Coronaకు కొత్త ఔషధం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronaకు కొత్త ఔషధం

అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో

సమర్థంగా పనిచేస్తున్నట్లు తేల్చిన ట్రయల్స్‌
అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
త్వరలో అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19కు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారికి కూడా ఇది పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది. ఈ ఔషధంతో చికిత్స పొందిన బాధితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా ఎక్కువ శాతం మందికి నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించింది. దీని తయారీలో ఉపయోగించేది జనరిక్‌ మూలకాలే కావడంతో ఉత్పత్తి సులభమేనని తెలిపింది.

ఏమిటీ ఔషధం?
2 డీజీ ఔషధాన్ని గతంలో క్యాన్సర్‌ కోసం తయారు చేశారు. శరీరంలో కణాలకు గ్లూకోజ్‌ అందకుండా చేయడం ద్వారా క్యాన్సర్‌ కణాల వృద్ధిని ఈ మందు అడ్డుకుంటుంది. కొవిడ్‌ వైరస్‌ సైతం శరీరంలో వృద్ధి చెందకుండా ఉండేందుకు ఈ సూత్రం ఉపయోగపడుతుందనే ఆలోచనతో పరిశోధన ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు అతుక్కుపోతుంది. కణంలోని శక్తిని, గ్లూకోజ్‌ను ఉపయోగించుకుని వైరస్‌ కొన్ని రెట్లు పెరుగుతుంది. అదే గ్లూకోజ్‌ లేకపోతే కణ విభజన జరగదు. 2డీజీ ఔషధం నేరుగా వైరస్‌ బారినపడ్డ కణంలోకి వెళ్లి వాటికి గ్లూకోజ్‌ అందకుండా నిరోధిస్తుంది. దీంతో కణ విభజన ఆగిపోతుంది. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుంది. కొవిడ్‌కు ఇప్పటిలాగే చికిత్స అందిస్తూ 2డీజీ ఔషధాన్ని కూడా ఇవ్వాలని, పది రోజుల్లో కోలుకునేవారు ఏడు రోజుల్లోనే కోలుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నీళ్లలో కలుపుకొని తాగేలా..
పొడిలా ఉండే ఈ మందు చిన్నచిన్న పొట్లాల(సాచెట్‌)లో లభిస్తుంది. నీళ్లలో కలుపుకొని తాగితే, వైరస్‌ సోకిన కణాల్లోకి నేరుగా ప్రవేశించి, వృద్ధిని అడ్డుకుంటుంది. ఈ గుణం కొవిడ్‌ బాధితులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో గుర్తించారు. వేర్వేరు స్థాయుల్లో స్టాండర్డ్‌ ఆఫ్‌ కేర్‌ (ఎస్‌వోసీ)తో పోల్చి చూసినప్పుడు సగటున కోలుకుంటున్న రోజుల కంటే 2డీజీ ఔషధంతో చికిత్స పొందిన రోగులు రెండున్నర రోజులు ముందే కోలుకున్నట్లు గుర్తించారు.

ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది...
ప్రస్తుతం కరోనా బాధితులు ఎక్కువమంది శ్వాస సమస్యలతో, ఆక్సిజన్‌ అవసరమైన స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పలువురు ఆసుపత్రికి చేరేలోగా, ఆక్సిజన్‌ పెట్టేలోగా ప్రాణాలు విడుస్తున్నారు. 2డీజీ ఔషధం శరీరంలోకి వెళ్లి వైరస్‌ కణాలపై సత్వరం పనిచేస్తుండడం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుందని, ప్రాణాపాయ స్థితి తప్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరమూ తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారం ప్రకారం 2డీజీ ఔషధం వాడిన బాధితులు ఎక్కువ మందిలో తక్కువ రోజుల్లోనే వైరస్‌ లక్షణాలు తగ్గిపోయాయి. ఆక్సిజన్‌పై ఆధారపడటం 42 శాతం తగ్గింది. ఇతర ఔషధాలు వాడినప్పుడు ఈ శాతం 31గా ఉందని నిర్ధారణ అయింది. స్టాండర్డ్‌ ఆఫ్‌ కేర్‌ (ఎస్‌వోసీ)తో పోలిస్తే మూడో రోజు నాటికే ఆక్సిజన్‌ థెరపీ, ఆక్సిజన్‌ఫై ఆధారపడటం తగ్గడం పెద్ద ఉపశమనం. 65 ఏళ్లు పైబడిన వయసు వారిలోనూ ఔషధం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే 1న డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది.

ఏడాదికి పైగా పరిశోధనలు

ఏడాది క్రితం కరోనా తొలినాళ్ల నుంచే వైరస్‌పై యుద్ధం ప్రకటించిన డీఆర్‌డీవో.. ప్రధాని మోదీ పిలుపు మేరకు విరుగుడు ఔషధాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. డీఆర్‌డీవోకు చెందిన దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ సంస్థ శాస్త్రవేత్తలు ఏప్రిల్‌ 2020లో పరిశోధనలు ప్రారంభించారు. 2డీజీ ఔషధం పనితీరును హైదరాబాద్‌లోని సీసీఎంబీతో కలిసి ల్యాబ్‌లో పరిశీలించారు. ఇది కరోనా వైరస్‌ వృద్ధిని నిరోధిస్తున్నట్లు పరీక్షల్లో రుజువైంది. 2 డీజీ ఔషధాన్ని రోగులపై ప్రయోగించేందుకు డీసీజీఐ, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు మే 2020లో అనుమతి ఇచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌తో కలిసి మే - అక్టోబరు 2020 మధ్యలో రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. అందులో ఎలాంటి దుష్ప్రభావాలు కన్పించలేదు. పైగా బాధితులు కోలుకోవడంతో దేశవ్యాప్తంగా రెండు, మూడో దశల క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టారు. సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలు రావడంతో సమగ్ర నివేదికలను డీసీజీఐకి సమర్పించగా అత్యవసర వినియోగానికి తాజాగా అనుమతి ఇచ్చింది.

వైద్యుల పర్యవేక్షణలోనే...

2డీజీ ఔషధం కొవిడ్‌ రోగులకు రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఏడు రోజుల పాటు ఇవ్వాలి. పొడిని నీటిలో కలిపి బాధితులకు తాగించాలి. ఇదంతా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. దీనిద్వారా ఎక్కువ మంది త్వరగా కోలుకుంటున్నారని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి సాధ్యమైనంత తొందరగా మార్కెట్లోకి ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

- డాక్టర్‌ అనంత్‌ నారాయణ్‌ భట్‌, డీఆర్‌డీవో శాస్త్రవేత్త

Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని