కొవిడ్‌ బాధితులకు స్టార్‌ హోటళ్లలో వైద్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు స్టార్‌ హోటళ్లలో వైద్యం

శ్రీకారం చుట్టిన ప్రధాన ఆసుపత్రులు
వైరస్‌ లక్షణాలు తక్కువగా ఉన్న వారికి ప్రాధాన్యం
అత్యవసరమైతే తక్షణం ఐసీయూకి తరలింపు

ఈనాడు హైదరాబాద్‌: కొవిడ్‌ బారిన పడిన వారిని స్టార్‌ హోటళ్లలో ఉంచి చికిత్స అందించేందుకు ప్రధాన ఆసుపత్రులు శ్రీకారం చుట్టాయి. జనం నుంచి పడకల కోసం ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో హోటళ్లలో గదులు తీసుకొని వైరస్‌ లక్షణాలు ఎక్కువగా లేని రోగులను అక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నాయి. అవసరమైతే వెంటనే ఆసుపత్రికి తరలించడానికి వీలుగా సమీపంలో ఉండే వాటిని ఎంచుకొంటున్నాయి. కొన్ని వైద్య సంస్థలు హోటళ్లను తీసుకొన్న వెంటనే అన్ని రూములూ నిండిపోయాయి. మరికొన్ని యాజమాన్యాలు ఎక్కువ గదులు తీసుకొంటే వైద్యం అందించడం కష్టం కాబట్టి పరిమితంగానే తీసుకొన్నాయి. ఇంకొన్ని త్వరలోనే ప్రారంభించడానికి ఒప్పందాలు చేసుకొన్నాయి.స్థాయిని బట్టి ధరలు వైద్య సదుపాయాలు, హోటల్‌ స్థాయిని బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. కొన్నింటిలో రోజుకు రూ.నాలుగు వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్నాయి. గదిలో అందించే సదుపాయాలతోపాటు మందులు ఇతరత్రా కలిపి రోజుకు రూ.25 వేల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉందని ఓ ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు. కొన్ని ఆసుపత్రులు ప్యాకేజీగా నిర్ణయించి అమలు చేస్తున్నాయి. కేర్‌ ఆసుపత్రి.. సమీపంలోని ఓ హోటల్‌ను తీసుకొని అవసరమైన వైద్య సదుపాయాలతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ సింగిల్‌ రూం అయితే రోజుకు రూ.40 వేలు, గదికి ఇద్దరయితే ఏడురోజులకు రూ.30 వేలుగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భోజనంతోపాటు నర్సింగ్‌ కేర్‌, మందుల కిట్‌, వైద్యునితో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ తదితర సదుపాయాలతో 45 బెడ్లను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఏఐజీ కూడా ఓ హోటల్‌లో 45 గదులు తీసుకొని కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని చేర్చుకొంటోంది. ఇక్కడ కూడా చాలా వేగంగా భర్తీ అయినట్లు సమాచారం. ‘‘అత్యవసరమైతే చికిత్స అందించగల పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కీలకం. హోటల్‌లో ఎక్కువ గదులు తీసుకొని ఐసొలేషన్‌లో ఉంచితే అత్యవసరమైనప్పుడు చికిత్సకు ఇబ్బంది కలుగుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని హోటల్‌లో పరిమిత గదులను తీసుకొన్నాం’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెంచురీ ఆసుపత్రి రోజుకు రూ.6,999తో ఓ స్టార్‌ హోటల్‌లో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. మరికొన్ని ఆసుపత్రులు కూడా త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తేనున్నాయి.

మరోవైపు ‘ఓయో’ అనే సంస్థ కొవిడ్‌ బారిన పడి ఐసొలేషన్‌లో ఉండాలనే వారికోసం ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని హోటళ్లలో ఉంచుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 గదులు కొవిడ్‌ రోగులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.
అన్ని జాగ్రత్తలూ తీసుకొంటూ...
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కేర్‌, అపోలో, సెంచురీ ఇలా పలు ఆసుపత్రులు స్టార్‌ హోటళ్లలో వైద్యాన్ని ఇప్పటికే ప్రారంభించాయి. యశోద, కిమ్స్‌ తదితర సంస్థలు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ప్రతీ రోజు తగిన పరీక్షలు చేయడం,. వైద్యునితో సంప్రదింపులు, అవసరమైతే ఆక్సిజన్‌ పెట్టడం, మరి తీవ్రమైతే ఐసీయూలోకి తరలించడం ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని